Antera Bamardee 24

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

అంతేరా బామ్మర్దీ - 24

బసవరాజు గారి బంగళా ముందు వేణు స్కూటర్ ఆపేడు. అతనిప్పుడు చక్కగా ముస్తాబై వున్నాడు! ఎంతో ఠీవిగా వున్నాడు. స్కూటర్ దిగి ఆ యింటి గడప తొక్కాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. స్వయంగా బసవరాజే తలుపు తీశాడు.

" గుడ్ మారింగ్ సార్ ! " అన్నాడు వేణు వినయంగా.

" కమిన్ " అన్నాడు బసవరాజు.

ఇద్దరూ హల్లో కూర్చున్నారు.

" అవును మిస్టర్ వేణూ ! నువ్వు మంచి రన్నర్ కదూ ! " అని బసవరాజు అడిగాడు.

" అరే ! భలే కనిపెట్టారు సర్ " ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు వేణు.

బసవరాజు కొంచం గర్వంగా అన్నాడు " అంతే! నేనంతే...నీకు తెలీయకుండా నీ గురించి అన్నీ కనిపెట్టేస్తుంటాను " అని.

" అది జీనియస్సుల లక్షణం సార్ " అన్నాడు వేణూ.

ఆ మాటకి బసవరాజు మురిసిపోయాడు. అందువల్ల కాళ్ళు ఊపుకుంటూ అడిగాడు " ఊ...ఏం అంటున్నాడు మీ బావ ? " అని.

" ఏమడుగుతార్లేండి ! " అన్నాడు వేణూ.

" నీ ఉద్యోగం దొరికింది గదా ! హేపీగా వున్నాడా ?"

" లేదండి ! చాలా వర్రీడ్ గా వున్నాడు " అని చెప్పాడు వేణు.

ఆ మాట వినగానే బసవరాజు బిక్కమొహం పెట్టేడు. " లక్షణమైన ఉద్యోగం దొరికినందుకు సంతోషించాలి గాని ఏడుస్తూ కూచోవడం ఏమిటి చిత్రంగానూ " అంటూ నసిగాడు బసవరాజు.

" మా బావ సంగతి మీకు తెలియంది ఏముంది ? మీ దగ్గర ఉద్యోగం చేయడం బావకి సుతరామూ యిష్టం లేదు " అని చెప్పాడు వేణు.

" అందుకే కాబోలు ! నాకు ఫోన్ కూడా చేయలేదు. కనీసం థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేసినా సంతోషించేవాడిని ! వదిలేయ్ ! మీ  బావని మరిచిపో " అన్నాడు బసవరాజు.

" అక్షరాలా ఈ మాటే ఆయన కూడా అన్నాడండి " అన్నాడు విచారం నటిస్తూ.

" అంటాడు తిక్క సన్నాసి ! " అని విసుకున్నాడు బసవరాజు.

" అంతే కాదండి... నన్ను ఇంట్లోంచి " అని మాట పూర్తీ చేయకుండా చేయితో సైగ చేశాడు.

" దుర్మార్గుడు! ఇన్నేళ్ళూ పెంచి పెద్ద చేసి నా దగర ఉద్యోగం చేస్తున్నావనే ఆప్టరాల్ రీజన్ కి ఇంట్లోంచి వెళ్లిపో అంటాడా ? సరే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు ?" అని అడిగాడు బసవరాజు.

" ఈ వీధిలోనే...ఒక పాత పెంకుటింట్లో " అని చెప్పాడు వేణు.

" పెంకుటిల్లా ?" బాధ పడుతూ అడిగాడు బసవరాజు.

" చాలా పాతదండి ! అందులో ఒక చిన్నగదిలో "

" ఒక గదిలోనా ?"

" చాలా చిన్న గదండి " అని చెప్పాల్సిన దీన కథ చాలా వుంది గనుక దానికి తఃహట్టుగా తలవంచుకున్నాడు. మధ్య మధ్య గాలి బరువుగా పీల్చుకుంటూ అంటున్నాడు.

" పాత పెంకుటింట్లో చాలా చిన్న గదైనా పర్లేదులెండి! నా ఒక్కడికి ఆ గది చాలు. కాకపోతే పగటిపూటకూడా ఆ గది చీకటిగా వుంటుంది! అయినా సర్దుకోవచ్చులేండి ! ఎటొచ్చి గాలి రాదు ! ఫేను పెట్టుకోవచ్చు అనుకోండి. పగటిపూట కరెంటు వాడకూడదని రూలు పెట్టేరు. పగలంతా ఆఫీసులో వుంటాను గనుక నో వర్రీ అనుకోండి ! కాకపొతే స్నానానికి చాలా ఇబ్బంది పడాలి. ఆ యింట్లో పంపుల్లేవు ! నూయీ లేదు! నాలుగిళ్ళ అవతల దిగుడుబావి వుందిలెండి! రోజూ అక్కడికి వెళ్లి నీళ్ళు తోడుకుని స్నానం గట్రాలు చేసుకునే ఏర్పాటు చేసేరు " అని మొత్తం చెప్పి తలెత్తి చూశాడు వేణు.

ఆశ్చర్యం ! అతని చుట్టూ ఇంటిల్లిపాది వున్నారు. అందరినీ ఒకేసారి చూడటంతో ఉలికిపడి లేచి నించున్నాడు వేణు.

బసవరాజు తన వాళ్ళతో అంటున్నాడు సీరియస్ గా " విన్నారా ? ఆ సింగినాదం గాడి కిరాతకం ఏ స్థాయిలో పెరిగిపోయిందో తెలుసుకున్నారా ! ఈ కుర్రాడికి ఆ వెధవ గాడి ముఖం చూసి ఉద్యోగం ఇవ్వలేదు. ఇతని క్వాలిఫికిషన్స్, ఇతని సర్టిఫికెట్స్ చూసి ముచ్చటపడి ఉద్యోగం యిచ్చాను! ఇతను ఫలానా అని తెలీయకుండానే ఇంటర్వూ చేసి ఉద్యోగం యిచ్చేను ! అంచేత ఇతను సింగినాదం గాడి బావమరిదిలా కానేకాదు ! బసవరాజు ఇండస్ట్రీస్ కు సెక్రటరీ ! మన సెక్రటరీ కూడా మన హోదాకు తగ్గట్టుగా వుండాలి ! అంతేగాని నో వాటర్ సప్లై, కరెంటు లేని ఆ ఇంట్లో కాదు ! షేమ్...క్వైట్ షేమ్ ! ఎవరికీ ? ఎవరికీ షేమ్ ! మనకి ! మన కంపెనీకి ! ఇది నేను భరించలేను ! నావల్లకాదు ! చెప్పండి ! ఏం చేద్దాం ఇతన్ని " అని,

" ఏదైనా బంగళా చూడండి ! మీ ఫ్రండు బామ్మర్దే గదా ! మన మనిషే " అన్నది జానకి.

వేణు ఆ తల్లికి చేతులు జోడించి అన్నాడు " బ్రహ్మచారిని ! బంగళా పెద్దది అవుతుంది మేడమ్ " అని.

" అయినా సరే ! మీ బావగారు మా నాన్నకి ప్రాణ స్నేహితుడు " అన్నాడు డాక్టర్ మురళి.

" ఇప్పుడు నాకు తెలియదు గాని, మీ బావ నాకు ప్రాణం లాంటి మిత్రుడు ! నాకు తోడు ! నాకు నీడ ! నాకు గైడు ! ఒక్కటేమిటి ? నాకు అన్నీ వాడే ! కాకపొతే తిక్క సన్నాసి ! ఆ సన్నాసికి నువ్వు బామ్మర్దీవి ! దట్ మీన్స్ నాకు కూడా నువ్వు బామ్మర్దీలాంటి వాడివే !" అన్నాడు బసవరాజు.

" అలాంటప్పుడు ఎక్కడో ఉండటం ఎందుకు ? మనింట్లోనే మనతోపాటు వుంటాడు " అన్నది పద్మ.

ఇంకావుంది

హాసం సౌజన్యంతో