Antera Bamardee 25

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

Anthera Bamardi 25

వేణు అనుకున్నట్టుగానే ఆ యింటికి పాణి వచ్చేడు! అతని చేతిలో పేపరుంది! వేణుని చూచి 'గుడ్ మార్నింగ్' అన్నాడు పాణి. వేణు చేతులు జోడించేడు! పాణి తిన్నగా బసవరాజు గారి గది వైపు నడిచేడు ఆ గది ముందు నిలబడి తలుపు తడుతూ 'సార్' అని పిలిచేడు తలుపు తెరుచుకుంది బసవరాజే తలుపు తెరిచేడు పాణిని చూస్తూ అడిగేడు.

"ఏవీన్యూస్?" "యన్సర్! మీరు తప్పకుండా తెలుసుకోవలసిన వార్త!" "కమిన్!" పాణి బసవరాజు గదిలోకి వెళ్లేడు ఆ తర్వాత తలుపులు మూసుకున్నాయి.

వేణు ఆ గదివైపు విడ్డూరంగా చూస్తూ నిలబడ్డాడు గదిలో బసవరాజు సోఫా అలంకరించి వున్నాడు.. పాణి పేపర్ని తెరుస్తున్నాడు బసవరాజు కుతూహలంగా అడిగేడు - "ఏ భాష పేపరో?"

"బెంగాలీ సార్!"

"ఊ...చదువు!"

ఒక వార్తని పాణి బెంగాలీ భాషలో చదివేసేడు. అతను చదువుతున్నంత సేపూ - బసవరాజు శ్రద్ధగా విన్నాడు "అదీ సార్ విషయం!" అన్నాడు పాణి!

"తెలుగులో చెప్పు!"

"మీ లాంటి కోటీశ్వరుడు - "

"పోలికలోద్దు! పేరు - వాడి పేరు చెప్పు"

"బాసూ సన్యాల్! బాసూ సన్యాల్ అనే కోటీశ్వరుడి దగ్గిర చటర్జీ అనే కారు డ్రైవరు చాలా కాలంగా - ఎంతో నమ్మకంగా పనిచేస్తూ - "

"అంటే? నేను అనే ణా దగ్గిర - రంగడు అనే డ్రైవరు మాదిరి అన్నమాట!"

"ఎక్జాట్లీ సార్!"

"ఊ. ఇప్పుడు చెప్పు!"

"కలకత్తా నుండి ఖర్గపూర్ కి - అయిదు లక్షల రూపాయిల్తో - బాసూ సన్యాల్ ప్రయాణం చేస్తున్నాడు చటర్జీ కారు డ్రైవ్ చేస్తున్నాడు" పాణి చెబుతున్న ప్రకారం - బసవరాజు కళ్లెదుట దృశ్యం నడుస్తోంది! సన్యాల్ ఎట్లా ఉంటాడో తెలీదు గనక - సన్యాల్ స్థానంలో బసవరాజున్నాడు! చటర్జీ బొమ్మ కూడా తనకి తెలీదు గనక - చటర్జీ స్థానంలో రంగడు డ్రైవ్ చేస్తున్నాడు! పాణి చెబుతున్న ప్రకారం దృశ్యం నడుస్తోంది! అదొక నిర్మానుష్యమైన రోడ్డు! తూనీగలాగా పరిగెడుతోంది కారు!

అర్దరాత్రి దాటి అరగంటయ్యింది! చటర్జీ సడన్ గా కారు ఆపేడు! ఎందుకు ఆపేవని సన్యాల్ అడిగేడు! ఇంజన్ కి చిన్న ట్రబులొచ్చిందని చటర్జీ చెప్పేడు! చటర్జీ కారు దిగి బోనెట్ ఎత్తేడు! ఎంతసేపటికి పని పూర్తికాలేదు! బసూ సన్యాల్ కూడా కారు దిగేడు ఇంజన్ దగ్గరికి వెళ్లి చూస్తున్నాడు! అదే అదునుగా భావించి చటర్జీ తన యజమాని తలమీద ఇనుపరాడ్ తో గట్టిగా కొట్టేడు! ఆ దెబ్బకి - బసూ సన్యాల్ అక్కడికక్కడే ప్రాణాలు విదిచేడు! శవాన్నీ కారునీ ఆ నడి రోడ్డు మీదే వదిలేసి - చటర్జీ అనే ఆ డ్రైవరు కారులో వున్న అయిదు లక్షల పైకం తీసుకొని పారిపోయేడు! ఇంత వార్త విన్న బసవరాజు తట్టుకోలేకపోయేడు! అందువల్ల బాగా నీరసపడిపోయి నీరసంగానే అన్నాడు - "

"ఈ రాత్రి నేను కూడా - ఏడు లక్షల రూపాయిల్తో కార్లో కడప ప్రయాణం పెట్టుకున్నాను మిస్టర్ పాణి!"

"ఎన్ని లక్షల్తో వెడుతున్నారో తెలీదు గాని - కార్లో కడప వెడుతున్నట్టు నాక్కూడా తెలిసింది సార్!"

"నా కారుని రంగడు డ్రైవ్ చేస్తాడు!"

"న్యాచురల్లీ సార్!" "రంగడు మంచి నమ్మకస్థుడు!"

"చటర్జీ కూడా ఆ టైపే సార్!"

"రంగడు కూడా దారీ మధ్యలో కారుని అనవసరంగా ఆపి -"

"ఇంజన్ ట్రబులని కారు దిగుతాడు సార్" బసవరాజు భయంగా అన్నాడు.

"వద్దు! ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు చెప్పద్దు!"

"చెప్పను సార్!"

"తీసేయ్! ఆ రంగా గాడ్ని ఉద్యోగంలోంచి వెంటనే తీసెయ్!"

"అలాగే సార్!"

"ఎప్పుడో చంపవలసిన నన్ను - ఇన్నేళ్లూ చంపనందుకు - అతనికి పాతికవేల రూపాయలు నా కానుకగా యిచ్చి యింటికి పంపించు! ఇక నుండి నా కారుకి నేనే డ్రైవర్ని!"

"చాలా మంచి నిర్ణయం సార్!"

"వెళ్లింక! నే చెప్పిన పని మీదుండు!"

"ఒ కె సార్!" అని పాణి ఆ గది నుంచి బయటపడ్డాడు!

* * *

ఆ ఉదయం రంగనాధం ఇంట్లో గోడవారగా కుర్చీ వేసుకుని - అందులో కూచుని - కాళ్లు రెండూ గోడకి తన్ని పెట్టి అంటున్నాడు రంగనాధం "నీకు మా బసివిగాడి సంగతి తెలీదు! కాలాంతకుడే వాడు!" అన్నపూర్ణమ్మ బియ్యం చెరుగుతోంది చెరుగుతూనే అన్నది - "ఆ విషయం ఎన్నేళ్ల తర్వాత ఇప్పుడు తెలిసిందా మీకు?"

"తెలివిగా మాటాడకు! వాడి తత్త్వం నాకు మొదట్నుంచీ తెలుసు!"

"ఎప్పుడూ చెప్పేరు కాదే?" ఆ మాటకి కోపం వచ్చింది కుర్చీలోంచి చివాలున లేచి అన్నాడు - "అవునే! చెప్పకపోవడం నాదే తప్పు! చాలా పెద్ద తప్పు! అసలు నేను చేసేవన్నీ తప్పుడు పనులేగదా? అప్పుడు - ఆ రోజుల్లో - మా కాలేజీ రోజుల్లో - తాయారు విషయంలో కూడా తప్పే చేసేను!"

బియ్యం చెరగడం మాని ఆశ్చర్యంగా అడిగింది అన్నపూర్ణ - "తాయారా? ఆవిడెవరు?"

"ఎందుకంత కుతూహలంగా అడుగుతున్నావ్?"

"తాళికట్టిన భర్త - పరస్త్రీ పేరు కలవరిస్తుంటే - ఏ భార్య అయినా నాలాగే అడుగుతుంది!"

"పరస్త్రీ అని ఎవరన్నారు? తాయారు మా క్లాసుమేటు!"

"అంటే? క్లాసుమేటులు పరస్త్రీలు కాదా?" చేతిలో వున్న పుస్తకాన్ని విసిరేసి అన్నాడు - "కాదు! ఎట్టి పరిస్థితిల్లోనూ కాదు!"

"పోన్లెండి ! తాయారుతో ఏం తప్పు చేసేరు?"

"అంటే ఏమిటనీ ఉద్దేశం? తప్పులు చేయడానికే ప్రత్యేకంగా పుట్టిన రవుడీ ముండాకొడుకుననుకుంటున్నావా?"

"బాగుంది చోద్యం! మీరే అన్నారుగా - తప్పు చేసేనని?"

"జడ పట్టుకు లాగితే పెద్ద తప్పయిపోతుందా?"

"అమ్మో! అలాంటి పనులు కూడా చేసేవారా?"

"పళ్లు రాలగొడతా! నేను చేసేనంటా వేమిటి?" "నేను అనలేదు. మీరే అన్నారు!"

"అవునే! ఏదో అనబోయి ఏదో అనడం మా వంశాచారం! మా వంశం మొత్తం తాత తండ్రుల నుంచీ - ఇదే తంతు!"

"ఆడపిల్ల జగపట్టుకు లాగింది చాలక వంశాచారమని గొప్పగా చెప్పుకుంటారే - సిగ్గులేకుండా?"

"చంపుతా! జడపట్టుకు లాగింది నేను కాదు! ఆ బసివిగాడు! వాడు చేసిన తప్పు నా నెత్తినేసుకోమని బతిమాలితే కాదనలేక సరే అన్నాడు! తాయారు జడ లాగింది వాడు! లెక్చరర్తో చివాట్లు తిన్నది నేను! అర్థమైందా?" "తాయారు మంచిది గనక సరిపోయింది! అదే నేనైతే చెప్పుచ్చుక్కొట్టేదాన్ని!"

"ఎవర్నీ?"

"జడ లాగిన మనిషిని!"

"తాయారు కూడా అప్పుడు ఆ పనే చేసింది!"

"రామ! రామ! ఒక ఆడపిల్ల చేత చెప్పుదెబ్బలు కూడా తిన్నారా?"

"నరుకుతా! పిచ్చిపిచ్చిగా మాట్లాడకు! నా జీవితంలో ఇప్పటి వరకు నేనెవర్తోనూ చెప్పుదెబ్బలు తినలేదు!"

"తప్పు చేసింది మీరని మీచేత చెప్పించేరన్నారు గదా!"

"చెప్పిన మాట కరెక్టే! జడలాగింది బసివిగాడని తాయారుకి బాగా తెలుసు! అందుకే వాడ్ని కొట్టింది!' "అలాంటప్పుడు - మీ ఫ్రెండు కోసం ఏదో త్యాగం చేసినట్టు అంత ఉపోద్ఘాతమెందుకు? జడలాగింది అతను చెప్పుదెబ్బలు తిన్నది అతను! అతను ఇందులో మీ త్యాగమేముంది? బడాయి కాకపోతే!" అప్పటిగ్గాని రంగనాధానికి మంటెక్కలేదు! అంచేత అరవడం మొదలెట్టేడు.

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో )