Antera Bamardee 27

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

 

27 వ భాగం

"ఇదొక విచిత్రమైన వార్త సార్!" అన్నాడు పాణి.

"లేకపోతే వార్త ఎందుకవుతుంది?" అన్నాడు బసవరాజు .

"ఈ వార్త అస్సాంని కుదిపేసింది సార్!"

"అయ్ సీ!" "గోస్వామి అనే తండ్రిని గాయత్రీ ప్రసాద్ అనే కొడుకు - స్వీట్స్ లో విషం కలిపి చంపేసేడు సార్!"

అంత వార్తని తట్టుకోలేకపోయేడు బసవరాజు అంచేత బాధగానే అన్నాడు "కన్నతండ్రిని - కన్న కొడుకు విషం పెట్టి చంపడమా?"

"ఆస్తి కోసం సార్! పాపిష్టి డబ్బు - ఎంతపనైన చేస్తుంది!"

"నిజమే మిస్టర్ పాణీ! కోట్ల కొద్దీ డబ్బు సంపాదించి కన్న కొడుకు యిచ్చే విషం తిని చచ్చేకంటే - కూలి చేసుకుని గంజితాగి బతకడమే బెటరు! అయినా స్వీట్స్ లో విషం ఎట్లా కలిపేడో?"

"ఆ కొడుకు ఒక పెద్ద డాక్టరు సార్!"

"మా అబ్బాయి లాగా!"

"అంత పెద్ద డాక్టరుకి స్వీట్స్ లో విషం కలిపే పద్ధతి పెద్ద కష్టమవుతుందా సార్?"

"నిజమే మిస్టర్ పాణీ! అంచేత - కడుపున పుట్టిన బిడ్డల్ని పెద్ద పెద్ద డాక్టర్లని చేసి వాళ్ల చేత మర్డర్లు చేయించుకుని ప్రాణాలు పోగొట్టుకునే కంటే - పిల్లలకి చదువు చెప్పించకుండా మూటలు మోసే లెవెల్లో పెంచడమే బెటరు!"

"వెరీగుడ్ డెసిషన్ సార్!"

"హు! స్వీట్స్ లో విషం కలుపుతాడా! విషం!" అని ఒకటికి పది సార్లు అనుకుని గ్లాసులో నీళ్లు తాగి సేద తీర్చుకుంటున్నాడు బసవరాజు!

* * *

సరిగ్గా అదే సమయంలో ఆ ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స అని బోర్డున్న గదిలోంచి డాక్టర్ మురళి చాలా హ్యాపీగా హాల్లోకి వచ్చేడు! హాల్లో వున్న పెద్ద మనిషితో ఆనందంగా అన్నాడు .

"నోవర్రీ! మీ ఆవిడకు ప్రాణ గండం తప్పింది! షి ఈజ్ ఆల్ రైట్ నవ్!" పెద్ద మనిషికి టెన్సన్ మటుమాయమైంది! ఎంతో రిలీఫ్ పొందేడు అందుకే ఆనందంగా అంటున్నాడు.

"థ్యాంక్యూ డాక్టర్! థ్యాంక్యూ వెరీమచ్! మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలీకుండా వుంది! ఇది పర్సు! ఇవి స్వీట్స్! తీసుకోండి!"

"ఇప్పుడెందుకండీ - ఇవన్నీ?" పెద్ద మనిషి డాక్టర్ మురళి చేతులు చొరవగా తీసుకున్నాడు ఆ చేతుల్లో పర్సునీ స్వీట్స్ నీ వుంచేడు ఆ తర్వాత అన్నాడు.

"ప్రాణదాతకి ఏమిచ్చినా తక్కువే అవుతుంది డాక్టర్! పర్సు మీరుంచుకోండి! స్వీట్స్ - మీరు అపారంగా ప్రేమించే వ్యక్తికి యివ్వండి!"

"నేను అమితంగా ప్రేమించే వ్యక్తి ఈ భూమ్మీద ఒక్కరే వున్నారు?"

"ఎవరు?"

"మా నాన్న!"

* * *

ఆ నాన్న గారు తన ఆఫీసు గదిలో తలపట్టుక్కూచున్నారు! అట్లా ఎప్పట్నుంచి వున్నారో గాని - ఇప్పుడు పాణి తో అంటున్నాడు

"మిస్టర్ పాణీ! ఈ దిక్కుమాలిన వార్తలు వింటున్నప్పుడు - నాకు బతుకు మీద రోత కలుగుతుంది!"

"మంచి మాటన్నారు సార్!"

"భవబంధాలు తెంచుకుని హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపిస్తోంది!"

"గుండెకి గాయమైతే ఇల్లాంటి ఆలోచనలే వస్తాయి సార్!"

"నా కోసం మా అబ్బాయి వస్తే నా గదిలోకి పంపించవద్దని బంట్రోతులందరికీ చెప్పు!"

"ఖచ్చితంగా చెబుతాను సార్!"

"ఇక నువ్వు వెళ్ళచ్చు!" పాణి వెళ్ళబోతుండగా డాక్టర్ మురళి ఆ గదిలోకి వస్తున్నాడు!

అతని చేతిలో స్వీట్స్ పాకెట్టు కూడా వుంది! డాక్టర్ మురళినీ, అతని చేతిలో స్వీట్సునీ చూచినా పాణి గాభరగా పడిపోతూ బసవరాజుతో అన్నాడు 'సార్! అబ్బాయిగారు వచ్చేసేరు సార్!' బసవరాజు సడన్ గా లేచి నించున్నాడు! గదిలోకి మురళి అడుగు పెడుతూ పాణిని సరదాగా ప్రశ్నించేడు.

"ఏమిటా ప్రకటన?" పాణి డాక్టర్ మురళి మాటని తీసిపారేసేడు బసవరాజుతో అన్నాడు .

"సార్! స్వీట్స్ కూడా తెచ్చేరు సార్!" డాక్టరు మురళికి ఇప్పుడు కోపం వచ్చింది! పాణితో అంటున్నాడు.

"నీకేమైనా పెచ్చెక్కిందా? ముందు నువ్వు బయటకు వెళ్లు!"

పాణి బసవరాజుతోనే అంటున్నాడు - "సార్! నన్ను బయటకు - "

"వెళ్ళమంటున్నాను! ప్లీజ్ గో అవే!" అన్నాడు మురళి కోపంగా పాణి బసవరాజుని ఉద్దేశించి అన్నాడు.

"వస్తాన్ సార్! బయటకు వెళ్ళి మీ క్షేమం కోసం ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తాను సార్!" అని పాణి బయటకు వెళ్ళిపోయేడు! డాక్టర్ మురళి కూచుంటూ అన్నాడు .

"ఏమిటి నాన్న అతని పిచ్చివాగుడు? నీ క్షేమం కోసం భగవంతుడ్ని ప్రార్థించడ మేమిటి?" బసవరాజు సమాధానం చెప్పలేదు.

మళ్ళా మురళే అన్నాడు - "అదేమిటి? నీ వాలకం అదో మాదిరిగా వుంది! ఎందుకంత నెర్వస్ గా వున్నావ్?" బసవరాజు బెదిరిపోతూ అడిగేడు.

"అవి - స్వీట్స్ తెచ్చావా మురళీ!"

పాకెట్ ఊడదీస్తూ అన్నాడు మురళి - "నీ కోసమే తెచ్చేను నాన్నా! కమాన్ - హేవిట్!"

అతను ఇవ్వబోతుంటే బసవరాజు అరిచేడు భయంగా - "వద్దురా వద్దు! తీసుకుపో!" డాక్టర్ మురళి ఆశ్చర్యపోతూ అన్నాడు.

"నాన్నా?"

"నేను స్వీట్స్ తినను! తినకూడదు!"

"తినకూడదా?"

"అవున్రా! షుగర్ పేషెంట్ ని గదా! తినకూడదు!"

"నీకు షుగరా. నేను డాక్టర్ని నాన్నా! నీకు షుగర్ లేదు!"

ఇక తప్పదన్నట్టు కొంచెం కటువుగానే అన్నాడు బసవరాజు - "అయినా సరే! నువ్వు తెచ్చిన స్వీట్స్ నేను తినను గాక తినను! తిననంతే! తీసెయ్!"

తండ్రి వాలకానికి డాక్టర్ బాగా షాకు తిన్నాడు. కోపం కూడా వచ్చింది. కానీ ఆ కోపాన్ని దిగమింగుకుని అన్నాడు - "జోక్ చేస్తున్నావేమోనని ఇప్పటివరకు సహించి కూచున్నాను! అయామ్ బిజీ డాక్టర్ యునో? అక్కడ బోలెడ్ పేషెంట్స్ ని విడిచిపెట్టి - నీ చేత స్వీట్స్ తినిపించాలని వస్తే వద్దంటావా? నే చేసిన తప్పేమిటి నాన్నా?"

బసవరాజు చెప్పదలుచుకున్నది స్పష్టంగానే చెప్పేడు నా కోసం స్వీట్స్ తీసుకురావడం తప్పు! వద్దు వద్దంటున్నా - తినూ తినమని వత్తిడి చేయడం పెద్ద తప్పు! ఇంకో తప్పు చేయకుండా వెళ్ళిపో! సంతోషిస్తా!" డాక్టర్ మురళి సడన్ గా లేచి నించున్నాడు!

"ఆల్ రైట్! ఆల్ రైట్ నాన్నా! ఆల్ రైట్! నీకోసం స్వీట్సు తీసుకురావడమే అపరాధమైతే సారీ! ఇకముందు ఇల్లాంటి పిచ్చిపని చేయనుగాక చేయను!" అని విసురుగా ఆ గది విడిచి వెళ్ళిపోయేడు డాక్టర్ మురళి!

అతని వెళ్లేక ఆ స్వీట్స్ పాకెట్ ని కిటికీలోంచి బయటకు విసిరేసేడు బసవరాజు! ఆ స్వీట్స్ పాకెట్ అక్కడే తచ్చాడుతున్న రంగనాధం నెత్తిమీద పడింది! రంగనాధం తలెత్తి చూసేడు!

కోపంగా గాలితో అంటున్నాడు - "మేము రాళ్లతో కొడతాం! పేదవాళ్ళం గదా! రాళ్లే మాకు అందుబాటులో వుంటాయి మీరు కోటీశ్వరులు! రాళ్లు మీకు సూటుకావు! అంచేత ఖరీదైన స్వీట్స్ తో కొడతారు! ఒరే బసివీ - నిన్ను నీకంటే పైనున్న దేవుడు కూడా క్షమించడు! ఆ!" అని ఆ స్వీట్స్ పాకెట్ ని సైడు కాలువలో పారేసి ఒక చెట్టు కిందికి చేరేడు! ఎందుకైనా మంచిదని తలెత్తి చెట్టువైపు చూస్తున్నాడు!

* * *

డాక్టర్ మురళితో పాటు వేణు నడుస్తున్నాడు! డాక్టర్ మురళి మవునంగా వున్నాడు!

వేణు అంటున్నాడు - "ఎంతో ప్రేమతో స్వీట్స్ తీసుకొచ్చేరు! అది తప్పెందుకవుతుంది? అన్నట్టు డాక్టర్ మురళీ - ఆ గదిలోకి మీరు వెళ్ళినప్పుడు అక్కడెవరున్నారు?"

"ఇంకా ఎవరుంటారు? మా నాన్నకి నీడలాంటి మనిషి - పాణి వున్నాడు!"

"అనుకున్నాను! అతను వున్నప్పుడే ఈ విచిత్రాలు జరుగుతున్నాయి! వదిలేయండి! మీరు నిశ్చితంగా వెళ్లండి! మీ నాన్నగారి చాదస్తానికి మూల కారణమేమిటో నేను కనుక్కుంటాను! ఓ.కె?" అని డాక్టర్ మురళిని కారెక్కించి పంపించేసేడు! తిరిగి ఆఫీసులోకి వెళ్లబోతుండగా  చాలా ఆప్యాయంగా - 'ఒరే వేణూ' అనే పిలుపు తియ్యగా వినిపించింది! వేణు వెనక్కి తిరిగి చూసేడు! అక్కడ రంగనాధమున్నాడు! రంగనాధాన్ని చూడగానే వేణు కళ్ళు చెమర్చేయి! 'బావా' అంటూ అతన్ని చేరుకున్నాడు!

రంగనాధం చేతుల్ని తీసుకుని - ఆ చేతుల్ని కళ్లతో అద్దుకుని "బావున్నావా బావా!" అన్నాడు ఆత్మీయంగా వేణు! బామ్మర్ది పలకరింపుకి ముగ్దుడయ్యేడు రంగనాధం "నా సంగతి వదిలెయ్! ఆ తిక్క సన్నాసి దగ్గిర నువ్వు ఎట్లావున్నావ్?" రంగనాధం అడిగేడు!

"బసవరాజు గారు చాలా మంచివారు బావా! నువ్వే ఆయన్ని అపార్ధం చేసుకుంటున్నావ్!" ఆ మాటతో రంగానాదానికి కోపం ముంచుకొచ్చింది!

తన చేతులు లాక్కున్నాడు. కోపంగానే అంటున్నాడు - "అంతేరా! అంతే ! నేను అమాయకపు ముండాకొడుకుని గదా? అందర్నీ అపార్ధం చేసుకోవడం నా లక్షణం! శ్రీరామచంద్రుడ్నీ చీ పొమ్మంటాను! రామణాసురుడ్ని కావిలించుకుంటాను! మీలాగా మేము పెద్ద పెద్ద చదువులు చదువుకున్నామా? లేదు! పలు కష్టాలు పడుతూ - వారాలవీ చేసుకుంటో - ఏడో తరగతి ఏడు సార్లు తప్పిన బావగారి ఏబ్రాసి వెధవలం! మాకేం తెలుస్తుంది లోకం?" బావగారి వరసకి వేణు భయపడ్డాడు!

తమ మాటలు ఎవరైనా వింటున్నారేమోనని చుట్టుపక్కల చూచి అన్నాడు "బావా! ప్లీజ్! గట్టిగా అరవకు! ఎవరైనా వింటారు!"

"విననివ్వు! ఎవరో వింటారనే భయంతో నోరు నోక్కేసుకోవడం మాకు చేతకాదు! గంభీరమైన నిజాల్ని గట్టిగా చేబుతామే కాని - గుట్టుగా భోదించడం! మేము కొన్ని సత్యాలు - జీవిత సత్యాలు చెబుతుంటాం! అంతేగా? జీవిత సత్యాలు చెప్పడం నేరమా? జైల్లో పెడతారా? సిద్ధంగా వున్నాం! ఉరిశిక్షలు వేస్తారా? రెడీగా వున్నాం! ఒరే వేణూ - నువ్వింత దగా చేస్తావనుకోలేదురా బామ్మర్డీ!" వేణు ఆశ్చర్యంగా అడిగేడు.

"నేను నిన్ను దగాచేసేనా?" లేదురా! నేనే నిన్ను నిలువునా ముంచేసేను! వెన్న తినరా బామ్మర్డీ అంటూ నీ నోట్లో చిన్నప్పట్నుంచీ మైదా పిండి కుక్కి పెద్ద చేసేను! జేబులు కొట్టుకో బాగుపడతావని బుద్దులు నేర్పేను! మూటలు మోసుకో కోట్లు సంపాయిస్తావని సలహాలిచ్చేను! అర్ధాకలితో నీ కడుపు మాడ్చేను! రాత్రిళ్లు మురికి కాలవలపక్కపడుకోమని ఆర్డర్లు వేసేను. ఒరే బామ్మర్డీ - నేన్నీకు చాలా చాలా ద్రోహాలు చేసేనురా! అందుకే నా యింటి నుంచి పారిపోయి - ఇదిగో - ఈ హరిశ్చంద్ర చక్రవర్తి, ధర్మదాత, దానకర్ణ, దాచేపల్లి పాండు - ఈ పేరెందుకు వచ్చిందో రానివ్వు - ఆజాతి మనిషి దగ్గిర - ఆ పుణ్య పురుషుడి కొలువులో ఎంచక్కా సుఖపడిపోతున్నావ్? సుకం అనే వస్తువు బసివిగాడి దగ్గిర లేదురా? వాడి మేడల్లో లేదు. వాడి కరెన్సీ కట్టల్లో అస్సలు లేదు!" వేణు - మరింత భయపడిపోతూ అన్నాడు.

"బావా! నీ కాళ్లట్టుకుంటాను. దయచేసి వెళ్లిపో!"

"నా కాళ్లేందుకు? పట్టుకున్నావ్ గదా గాడిద కాళ్లు! ఒరే బామ్మరీ - గాడిద కాళ్లు పట్టుకుని బాగుపడ్డవాడు లేడురా! ఎప్పుడో కొడుతుంది గాడిద! నువ్వు పట్టుకున్న కాళ్ళతోనే - నీ దవడ పళ్లు రాలిపోయేలాగా పెడీల్మని కొడుతుంది! తెలుసునాకు!"

"సాయంత్రం మీ యింటికి వస్తాను బావా వెళ్లిపో!"

"మాకేందుకుంటాయిరా ఇళ్లు? మీకంటే ఇంద్రభవనాలుంటాయి! తాజ్ మహాల్లుంటాయి! మావి గుడిశెలు! పందుల పాకలు! వద్దు బాబూ! నువ్వు మా యింటికి రావద్దు! పెద్ద పెద్ద భవనాల్లో వుండే మీకు మాయింటి కొస్తే ముక్కులు పాడైపోతాయ్! మెదళ్లు చెడిపోతాయ్! ఇక్కడింత దరిద్రమా అని మూర్చపోతారు! బామ్మర్డీ! నువ్వు రావద్దు!"

"రానులే బావా! సరేనా?"

"నువ్వు వస్తావని ఎందుకనుకుంటాన్రా నేను? నువ్వురావు! ఆ బసివిగాడు నిన్ను మీ బేవార్సు బావగారింటికి ఎందుకు పంపుతాడు. పంపడు! వాడు మమ్మల్ని స్వీట్సు తో కొడితే కేసుండదు! రాయిచ్చుక్కొడితేనే కేసు! ఈ తడవ కొడతానొరేయ్ - దెబ్బకి ఠా అంటాడు ! వెళ్లెళ్లు! వెళ్లి వాడితో చెప్పు! జాగ్రత్త పడతాడు! పోలీసు రిపోర్టరదీ అడ్వాన్సుగా రాసి పెట్టుకోమను! నన్ను జైల్లో పెట్టించమను ! ఈ దగాకోరు ప్రపంచంకంటే - మాకు జైలే ఎంతో సుఖంగా వుంటుంది!" అని ఏదేదో గొణుక్కుంటూ - గాల్లో చేతులు ఊపుకుంటూ రంగనాధం వెళ్ళిపోతున్నాడు! బావ పరిస్థితికి జాలిపడి నిట్టూర్చేడు!

(ఇంకావుంది)

(హాసం వారి సౌజన్యంతో )