Antera Bamardee 18

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

Antera Bamardee 18

********************

తక్షణం చేయవలసిన ఫోనుకి ఇప్పుడొద్దు సార్ అని పాణి బ్రేకు ఎందుకు వేసేడో బసవరాజుకి అర్థం కాలేదు.అంచేత కారణం ఏమిటని కళ్ళతో పాణిని ప్రశ్నించేడు. పాణి వివరిస్తున్నాడు.

“ భూమ్మీద బతికే మనుషులంతా "

“ మనుషులు భూమ్మీదే బతుకుతారు మిస్టర్ పాణి! ఇంకోచోట బతికే ఛాన్సు ఇప్పట్లో లేదు. నసపెట్టకుండా పాయింటుకి రా !!” అన్నాడు బసవరాజు.

“ శ్రీ రంగనాథం గారు బాగా సెన్సిటివ్ సార్ "

“ తెలుసు "

“ ఈ పరిస్థితుల్లో శ్రీ రంగనాథం గారికి తమరు ఇప్పుడే ఫోన్ చేస్తే ఆయన కోపం రెట్టింపయ్యే ప్రమాదం ఉంది సార్. రెండు రోజులు ఓపిక పట్టండి సార్! అప్పటికి శ్రీ రంగనాథం గారి కోపం తగ్గే అవకాశముంటుంది సార్ !” అని.

“ అంతవరకు నేను కిటికీతోనే కాలక్షేపం చేయాలా మిస్టర్ పాణి "

“ ఈ పరిస్థితుల్లో మనకి కిటికిలే శ్రీరామరక్ష సార్ " బసవరాజుకి కిటికీల పాయింటు బొత్తిగా నచ్చలేదు. అంత మాత్రాన పాణి సలహాని తీసిపారేయాలని కూడా లేదు. అంచేత అతను జేబులోంచి రూపాయి బిల్లా తీసి టాస్ వేసేడు. బొమ్మ పడింది.

“ మిస్టర్ పాణీ...బొమ్మే పడింది "

“ వండ్రపుల్ సార్! మీకెప్పుడూ బొమ్మలే పడుతుంటాయి "

“ అంచేత ఈ రెండు రోజూలూ కిటికీలతోనే కాలక్షేపం చేయాలి! ఆ తరువాత ఫోన్ "

“ చాలా గొప్ప కరెక్టు నిర్ణయం సార్ "

******************

లవర్స్ పార్క్! లవ్ లీ పార్కు! లవర్స్ హోటల్ మాదిరి లవర్స్ పార్క్ కూడా హైదరాబాదులోనే వుందని చెప్పినప్పుడు అవునా అని ఆశ్చర్యపోకూడదు. హైదరాబాదులో అది ఎక్కడ వుందని అడ్రస్సు అస్సలడక్కూడదు! ఏఏ పార్కులకు లవర్స్ పార్కులని ముద్దు పేరు పెట్టుకున్నారో స్థానిక లవర్సుకి బాగా తెలుసు.

అలాంటి పార్కుల్లోని ఒక పార్కులో వేణూ ఉమా కూచుని వున్నారు. వేణు ఉమతో అంటున్నాడు. “ మా బావ మీ నాన్నగారి ఆఫీసుకి వెళ్లడం వరకు కరెక్టే! అక్కడేం గొడవ జరిగిందో ఏమో మా బావ శివాలు తొక్కుతూ ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి తలుపులు బిడాయించుకున్నాడు "

“ ఇంతకీ మా బావగారు మా నాన్నని కలుసుకున్నారా లేదా ?”

“ ఏమడుగుతావులే ! మా బావని తన ఆఫీసు గదిలోకి పంపించవద్దని మీ నాన్నగారు ఒక మనిషిని కాపలా పెట్టేరుట !” ఉమ నొచ్చుకుంటూ అన్నది.

" అప్పుడప్పుడు మా నాన్న తిక్క తిక్కగా ప్రవర్తిస్తుంటాడు "

“ మా బావ ఎల్లప్పుడూ తిక్కగానే ప్రవర్తిస్తుంటాడు! అందుకే మన ప్రేమ విషయం మా బావకు చెప్పలేదు. మన విషయంలో ఆయన జోక్యం కల్పించుకుంటే, మనకి పెళ్లి కాదని నాకు బాగా తెలుసు "

“ మన పెళ్లి మాట అటుంచు! మా ఆఫీసులోకి నీ ఉద్యోగం మాటేమిటి ?”

“ నేనే స్వయంగా రంగంలోకి దిగబోతున్నాను " అని చెప్పాడు వేణు.

******************

బసవరాజు ఆఫీసు గది అది. బసవరాజు కిటికీ దగ్గరే నిలబడి వున్నాడు. ఇవాళ రంగనాథంతో ఫోన్లో మాట్లాడవలసిన రోజు.ఆ ముహూర్తం ఉదయం తొమ్మిదిన్నరకి పెట్టుకున్నాడు. తొమ్మిది ఇరవై అయిదు వరకు వర్జ్యం వున్నందువల్ల మరో అయిదు నిమిషాల ఆలస్యం చేసి మాటాడితే అన్నీ సవ్యంగా తగలబడతాయనే ఆశతో బసవరాజు కిటికీ విడిచిపెట్టడం లేదు. గోడ గడియారం టంగున గంట కొట్టింది. ఆ గదిలోనే వుండి తన చూపుని గోడ గడియారానికి అంకితం చేసిన పాణి, బసవరాజుని హెచ్చరించేడు.

“ సార్..నైన్ థర్టీ !” అని.

ఆ హెచ్చరికతో బసవరాజు కిటికీ వదిలేసి ఫోన్ తీసుకున్నాడు. నెంబర్ డయల్ చేసేడు. రంగనాథం ఇంట్లో ఫోన్ మోగింది. ముస్తాబవుతున్న వేణు, ముస్తాబవుతూనే ఫోన్ తీసుకున్నాడు.

“ హాల్లో " అన్నాడు బసవరాజు.

“ యస్ ప్లీజ్..” అన్నాడు వేణు.

“ ఇది మా సింగినాదం ఇల్లేనా ?” అన్నాడు బసవరాజు.

“ కాదండి! రంగనాథం గారిల్లు " అని చెప్పాడు వేణు.

“ వున్నాడా ?”

“ ఎవరండి ?”

“ సింగినాదం "

“ ఇది రంగనాథం గారిల్లు "

“ వాడ్ని నేను సింగినాదమనే పిలుస్తాను. వున్నాడా ?” అన్నాడు బసవరాజు.

“ వున్నారండి "

“ ఒకసారి పిలువు "

“ పిలిచినా రాలేరండి " బసవరాజు ఆత్రంగా అడిగాడు.

“ ఏమైంది ?” అని.

“ అలిగేరండి "

“ అలిగేడా "

“ సారీ...ఆనారోగ్యమండీ "

“ ఎప్పటి నుంచీ ?”

“ రెండు రోజుల నుంచీ "

“ ఇంతకీ నువ్వెవరు ?”

“ రంగనాథం గారి బామ్మర్దినండి. మీరెవరు ?”

“బసవరాజుని"

“ నమస్కారం సార్! రెండు రోజుల క్రితం మా బావగారు నా పని మీదే మీ ఆఫీసుకు వచ్చారండి"

“ నీ పనిమీదా...”

“ మీ ఆఫీసులో నాకో ఉద్యోగం ".

ఆ మాట వినగానే ఫోన్ పెట్టేసి తలపట్టుకుని కూర్చున్నాడు. ఆ భంగిమతోనే పాణితో అంటున్నాడు.

(ఇంకావుంది)

హాసం సౌజన్యంతో