Antera Bamardee 17

story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

 

అంతేరా బామ్మర్దీ 17

“ గొప్ప స్థితిలో వుండేవారు సార్! నాకు అసిస్టెంట్ గా పనిచేసేవారు "

“ చూసేవా? ఎంత డేంజర్ తప్పోపోయిందో ?”

“ అంతేసార్! అదృష్టవంతులకు డేంజర్లు ఆ విధంగానే తప్పిపోతుంటాయి సార్ !”

“ ఇప్పుడు చెప్పు మిస్టర్ పాణీ "

“ అడగండి సార్ ?”

“ నన్నింత పెద్ద వాడిని చేసిన సింగినాదానికి థేంక్ పుల్ గా వుండవలసిందిపోయి గెటవుట్ అని నీ చేత గెంటించడం తప్పరైటా ?”

“ ఖచ్చితంగా తప్పే సార్! కానీ సర్, నేను చదివిన మలయాళం వార్త అట్లా వున్నప్పుడు ఎవరినా మీలాగే చేస్తారు సార్ "

“ ఇప్పుడు..ఇప్పుడు నేనేం చేయాలి ? ఏం చేస్తే బావుంటుంది? అది చెప్పు నాకు "

“ తప్పకుండా చెబుతాను సర్! కాకపోతే కొంచం టైం కావాలి సర్ "

“ ఎన్నాళ్లు కావాలి ?”

“ ఎన్నాళ్ళో అక్కర్లేదు సార్! కొన్ని నిమిషాలు చాలు సార్ !”

“ ఒకే! గంట టైమిస్తున్నాను. గంట తరువాత చెప్పు "

“ తప్పకుండా సార్ "

సరిగ్గా ఇదే వేళకి...రంగానాథమింట్లో! రంగనాథం గృహప్రవేశం చేస్తున్నాడు. మనిషి బాగా నలిగిపోయి వున్నాడు.జుత్తు రేగిపోయి వుంది. అతన్ని చూడగానే అక్కాతమ్ములిద్దరూ కీడు శంకించేరు! అన్నపూర్ణ భర్తను ఆత్రంగా అడిగింది.

“ అట్లావున్నారేమిటండీ? ఏం జరిగింది ?” అని.

రంగనాథం సమాధానం చెప్పకుండా, అందుబాటులో వున్నా స్టూలుని గట్టిగా తన్నేడు. ఇనపస్తంబాన్ని తన్నిన కాల్తోనే ఇంట్లోని స్టూలును కూడా తన్నేసేడు. అన్నపూర్ణ భయపడుతూ అడిగింది.

“ బసవరాజు గార్ని కలుసుకున్నారా?” అని.

రంగనాథం కోపంతో ఊగిపోతూ అరిచేడు " చంపుతా! ఇకముందు ఆ పేరు ఈ ఇంట్లో వినిపిస్తే మిమ్ముల్ని కిరసనాయిలు పోసి తగలపెడతా!” అని.

వేణు కలగజేసుకుని " అసలేం జరిగింది బావా ?” అని.

“ ఏం జరిగిందా ?” అని అటూ ఇటూ చూసి, అక్కడున్న బిందెను అమాంతం ఎత్తేసి, దాన్ని నెల మీద కొట్టి అన్నాడు.

“ ఇది...ఇదే జరిగింది "

“ ఇప్పుడు ఆయన్ని ఏమి అడక్కురా వేణు! కోపం మీద వున్నారు " అని చెప్పింది అన్నపూర్ణ.

“ అవునే! ఇంటా బయటా యావన్మందికీ నా కోపమే కనిపిస్తుంది! నాకు జరిగిన అనుమానం " అని వంటి మీదున్న చొక్కాన్ని చింపివేసుకుంటున్నాడు రంగానాథం.

వేణు ఖంగారు పడ్డాడు. ఖంగారుగానే అన్నాడు. “ బావా! కొంచెం శాంతించు " అని.

“ శాంతించడాల్లేవు! అసలిదంతా నీ వల్లే జరింగింది. నీకు ఉద్యోగం అడగడానికి వెళ్లి ఆ బసివిగాడి చేత ఛీ కొట్టించుకుని !” వేణు షాకు తిన్నాడు.

“ నాకు ఉద్యోగం యివ్వనన్నాడా !”

“ అది నాకేం తెలుసు ?”

“ బావా ? ”

“ అవున్రా! అసలు నన్ను వాడి గదిలోకి రానిస్తేనా? బయట నించోమని ఆర్డరేసి గెటవుట్ అని ఖబురు పెట్టేడు.పిచ్చి వెధవలా తిరిగోచ్చేసేను! చాలా ?” అని గబగబా తన గదిలోకి వెళ్ళిపోయి డామ్మని తలుపులు మూసుకున్నాడు.

********************

బసవరాజు ఆఫీసు. పాణి కిటికీ దగ్గర నిలబడి వున్నాడు. బసవరాజు తన సీట్లో కూచుని వున్నాడు. బసవరాజు వాచీ చూసుకుని " మిస్టర్ పాణీ " అన్నాడు.

“ యస్సార్ " అని కిటికీ వదిలి వచ్చి బసవరాజు ముందు వినయంగా నిలబడ్డాడు పాణి.

“ నీకిచ్చిన గంట గడువు పూర్తయింది "

“ జస్టిప్పుడే పూర్తయింది సార్ "

“ ఏం ఆలోచించేవ్ ?”

“ మీ ఫ్రెండ్ ఇంట్లో ఫోన్ వుందా సార్ ?”

“ వుంది! ఇప్పుడు ఆ ఫోనుతో పనేమిటి ?”

“ ఫోన్లో పశ్చాత్తాపం పలు విధాల శ్రేయస్కరం సార్ !”

“ పలు విధాలక్కర్లేదు! ఒక్క విధం చెప్పుచాలు "

“ అవతల పెద్ద మనిషి ఎంత మంట మీదున్నా మీకు చాలా దూరంగా ఫోన్ దగ్గిరుంటాడు గనక, మీరు చెప్పేదే వింటాడు గాని కాలో చెయ్యో విసరలేదు "

“ వెరీ గుడ్! మంచి అయిడియా!”

“ థేంక్యూ సర్! నేను ఎప్పుడూ ఆ జాతి అయిడియాలేనే యిస్తుంటాను సార్! అది నా వీక్నెస్ !”

“ ఇచ్చే అయిడియా లేటుగా యిచ్చేవు "

“ అడిగిన వెంటనే అయిడియా తట్టదు సార్! అది కూడా నా వీక్నెస్ !”

“ ఇక ముందు ఇల్లాంటి వీక్నేస్సులు రిపీట్ కాకుండా చూసుకో "

“ అలాగే సర్ "

“ ఇప్పుడే సింగినాదానికి ఫోన్ చేస్తా "

“ ఇప్పుడు వద్దు సార్ " అన్నాడు పాణి.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)