Antera Bamardee 13

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

అంతేరా బామ్మర్దీ  -13 

*******************************************************************

“యస్సర్ !సింగినాదమని చెబితే మీరు తెలుసుకుంటారని కూడా చెప్పేడు !”

ఆ పేరు వినగానే బవసరాజు ఎంతో ఆనందంగా లేచి నిలబడ్డాడు. “సింగినాదమా? ఏడీ? ఎక్కడున్నాడు?” అని ఆత్రంగా అడిగేడు.

“ఆనందపడిపోకండి సార్! సింగినాదంగారు శివాలు తొక్కుతున్నారు "

బసవరాజు గదిలోంచి బయటకు వెళ్ళే ప్రయత్నంలో "వాడంతే! ఉద్రేకం ఎక్కువ!” అన్నాడు.

పాణి, బసవరాజుని కదలనీయకుండా గట్టిగా వాటేసుకున్నాడు.

“అందుకే సార్! తమర్ని బయటకు వెళ్లొద్దంటున్నాను!పశుపతి నాయర్ కేసు విన్నారు కదా!”

ఆ హెచ్చరిక వినగానే బసవరాజు నీరసంగా తన కూర్చీలో కూర్చున్నాడు. తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు పాణిని ప్రశ్నించేడు.

“సింగినాదం కూడా ఆ పనిమీదే వచ్చేడా?” అని.

“ఏ పని సార్ "

“అదేనయ్యా! బామ్మర్దీ...ఉద్యోగం "

“ అది నాకు తెలియదు సార్! ఏ పనిమీదొచ్చేడు అడిగి తెలుసుకునే ఛాన్సు నాకివ్వలేదు సార్! పేరు దగ్గిరే పేచి పెట్టుకున్నారు!” చెప్పాడు పాణి.

బసవరాజు క్షణం ఆలోచించి అన్నాడు "అయితే ఒక పని చెయ్ " అని.

“చెప్పండి సార్!” అన్నాడు పాణి.

“మళ్ళా బయటకు వెళ్ళు! పనేమిటో కనుక్కో! బామ్మర్దీ.... ఉద్యోగం...అన్నాడనుకో " అని బసవరాజు చెప్తుండగా, మాట మధ్యలో పాణి కల్పించుకున్నాడు. “ఆయన వరస చూస్తుంటే అనేలాగానే వున్నాడు సార్!” అని.

“ అన్నీ నువ్వే చెప్పి నన్ను భయపెట్టకయ్యా! అడుగంతే...నువ్వు అనుకుంటున్నట్టే వాడూ అంటే నేను బిజిగా వున్నానని చెప్పి పంపించేయ్ " అని చెప్పాడు బసవరాజు.

“వినకపోతే " అనుమాన్నాన్ని వ్యక్తం చేశాడు పాణి.

ఆ ప్రశ్నకి బదులేమి చెప్పాలో తెలీక బిన్నమొహం పెట్టుకున్నాడు బసవరాజు. ఏదో ఒక సమాధానం చెప్పాలి గనక "పోలీసుల్ని పిలు. వాడిని యింటికి పంపించే పని వాళ్ళే చూసుకుంటారు! వెళ్ళు!” అన్నాడు బసవరాజు.

పాణి ఆ గదిలోంచి బయటకు వస్తున్నాడు.

వరండాలో! నిప్పుల మీద ఆడుగులు వేస్తున్నట్లు పచార్లు చేస్తున్న రంగనాథాన్ని చూచి పాణి కీడు శంకించేడు. పాణిని చూడగానే రంగనాథం గాండ్రించేడు.

“ఏమన్నాడు? రమ్మన్నాడా? పోమ్మన్నాడా?” అని.

పాణి నీళ్ళు నముల్తూ చెప్పేడు.

“పని! పనేమిటో చెప్పమన్నారండి!” అని.

“చంపుతా "

“ఆ పనేచేస్తారేమోనన్న భయంతో, పనేమిటో కనుక్కోమన్నారండి " అన్నాడు పాణి.

“ అడ్డమైన ప్రతి అడ్డగాడిదకీ నా పనేమిటో చెబుతానా? చెప్పను. చచ్చినా చెప్పను!”

“ అయితే తమర్ని బాసు గదిలోకి వెళ్ళనివ్వను.”

“చంపుతా "

“చంపినా సరే! వెళ్ళనివ్వను!” అన్నాడు పాణి.

రంగనాథం తనకీ జరుగుతున్నా అనుమానానికి ఓర్చుకోలేక, పాణి చెంప చెళ్ళుమనిపించేడు. ఆ దెబ్బకి పాణి కళ్ళల్లో నీళ్ళు తిరిగేయి. రంగనాథం ఆ చెంప దెబ్బ వెనకున్న ఫిలాసఫీ వివరించేడు.

“కొట్టింది నిన్నుకాదు! వాడిని ఆ బసివిగాడిని! దిక్కున్న చోట చెప్పుకోమను!” అని వేగంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

వెళ్ళిపోతున్న రంగనాథాన్ని చూస్తూ చెంపరుద్దుకుంటూ పాణి స్వగతంలో అనుకుంటున్నాడు. “నన్ను కొట్టి బాసును కొట్టానంటాడేమిటి? వామ్మో...ఇది కేవలం ఉద్రేకం కేసు మాత్రమే కాదు! ఉన్మాదం కూడా తగలుకుంది.

(ఇంకావుంది)

హాసం సౌజన్యంతో