Antera Bamardee 14

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

 

అంతేరా బామ్మర్దీ - 14

*******************************************************************

హైదరాబాదులో...

అది చుక్కల హోటలు కాకపోయినా, చెప్పుకోదగిన పెద్ద హోటలు. ఆ హోటలుకి ఒక మంచి పేరు కూడా వుంది. కానీ ఆ పేరుతో ఎవరూ దానిని పిలవరు. సింపుల్ గా ఆ హోటల్ని' లవర్స్ హోటల్' అనే ముద్దు పేరుతో పిలుచుకుంటారు!

ఎందుకట్లా పిలుస్తారో తెలుసుకోవాలనుకుంటే, ఆ హోటల్లో ఒక మూల కూర్చున్న వేణూ, ఉమలను చూసే చాలా ఈజీగా అర్థమైపోతుంది. వాళ్ళిద్దరూ చాలా సేపటినుండి మాట్లాడుకుంటున్నారు కాబోలు. అప్పటికే చెరో మూడు పెప్సీలు తాగేసేరు. నాలుగో పెప్సీకి ఆర్డరు యిచ్చి మళ్ళా మాటల్లో పడ్డారు.

“ మా వనజ పెళ్లి కూడా అవుతోంది " అన్నది ఉమ.

“ ఒక్క వనజేమిటి? దేశంలో చాలా మంది పెళ్ళిళ్ళు అవుతున్నాయి!”

“ అంతేలే! అందరి పెళ్ళిళ్ళూ చూసి మనం ఆనందించడమే గాని, మనం పెళ్లి చేసుకునే రాత ఈ జన్మకి లేదేమో ?” అంది ఉమ.

“ అదేమ్మాట? నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను"

“ ఏడాది నుంచీ ఆ మాటే అంటున్నావ్ ?”

“ నాగపూర్ ఉద్యోగం వదిలేసి, నీ కంపెనీలో ఎందుకు చేరుతున్నాననుకున్నావ్ ?”

“ మీ అక్క బావల్ని విడిచి వుండలేక "

“ ఆఫ్ కోర్స్ అదీ నిజమే అనుకో! నాకు తల్లీతండ్రి వాళ్ళిద్దరే ! బట్ నిన్ను విడిచి నాగపూర్లో వుండలేక నో అనేసేను. ఇక్కడ ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో మా బావని రెచ్చగొట్టి మీ నాన్న దగ్గరికి పంపించేను!” అన్నాడు వేణు.

“ మా నాన్న నీకు ఉద్యోగం ఇవ్వడు ?”

“ మరీ నన్ను తీసిపారేయకు ఉమా! చదువూ సంధ్యా వున్నవాడిని! పైగా మీ నాన్న ప్రాణ స్నేహితుడి ముద్దుల బావమరిదిని! అది మరిచిపోవద్దు!” అన్నాడు వేణు.

“ ఏమో బాబూ! నాకు పెళ్ళంటూ జరిగితే నీతోనే జరగాలి.”

“ నా విషయం కూడా అంతే! నువ్వేం ఆందోళన పడకు ఉమా! అన్నీ సర్దుకుంటాయి. ఈ వేళకి మా బావ శుభవార్తతో యింటికి చేరే వుంటాడు " అన్నాడు వేణు.

********

సదరు బావగారు యింకా యింటికి చేరలేదే.

నడుస్తున్నాడు.

శూన్యంలో నడుస్తున్నట్టు, దిక్కుల్ని పట్టించుకోకుండా నడుస్తున్నాడు. నడిచీ నడిచీ యింక నడిచే ఓపికలేక ఒకానొక బస్సు స్టాపులో నిలబడ్డాడు. తన పక్కనున్న వ్యక్తీ ఎంతో వినయంగా " నమస్కారం మేస్టారూ " అని పలకరించేడు. రం

గనాథం తనని పలకరించిన వ్యక్తి వైపు ఎగాదిగా చూశాడు.

“ నేను మాస్టార్ని కాదు " అన్నాడు.

“ ఫర్లేదు లెండి! టైమెంతయ్యిందో తెలుసుకుందామనీ "

“ ఆహా అల్లాగా! మీకు టైం చెప్పడానికి నేనే దొరికేనా? మా టైం బాగలేక మేము ఏడుస్తుంటే మీకు టైం ఏం చెప్పగలం ?” అన్నాడు రంగనాథం.

“ మీ చేతికి వాచీ వుంది గదండీ" అన్నాడు ఆ వ్యక్తి.

“ అంటే ఏమిటి మీ ఉద్దేశం ? మా చేతికి వాచీలుండకుండా, బేడీలు మాత్రమే వుండాలని రూలేమైన వుందా! అంతేలేండి! మేము కేటు ముండా కొడుకులం కదా! మాకు బెడీలే వుంటాయి. మీరంటే మర్యాదస్తులు! వాచీలవీ పెట్టుకుని టింగురంగా టైపులో తిరుగుతారు. అంతేగా " ఆ వ్యక్తి రంగనాథం ధోరణికి బాగా బెదిరిపోయేడు.

ఇంకా అక్కడే వుంటే తన మెదడు పాడైపోయే ప్రమాదం ఉందని గ్రహించి, అక్కడి నుంచి వెళ్లి పోయాడు.

ఆ రాత్రి అన్నపూర్ణమ్మ వేణుకి వడ్డిస్తూ అన్నది.

“ ఇంతవేళయినా మీ బావగారు యింకా రాలేదేమిట్రా ?”

“ వస్తాడులే! వెళ్ళింది ప్రాణమిత్రుడి దగ్గరికి కదా! వెంటనే ఎట్లా వస్తాడు ?” అన్నాడు వేణు.

“ ఎప్పుడో ఉదయం వెళ్ళేరు. ఇంత రాత్రయినా యింకా రాకపోవడం ఏమిటి విడ్డూరం ?”

“ మీ బావమరిదికి ఉద్యోగం యిచ్చేసెను అని బసవరాజు గారు అనగానే, బావ రెక్కలు కట్టుకుని ఎగిరిపోతే ఏం బావుటుంది చెప్పు! ప్రాణమిత్రులు గదా! మంచి చెడూ మాటాడుకోవద్దూ.?” అన్నాడు వేణు.

బస్టాపులో బావగారు ఆ పనిమీదే వున్నారు. తనని పలకరించే మనుషుల్ని కరుస్తున్నాడు.

ఆ సీను ఇట్లా జరుగుతుంది.

*******************************************************************

తిరిగి రంగనాథం ఇంటికి వస్తాడా? రాడా?.

వస్తే, తన బావమరిదితో ఏమని చేప్తాడు?

ఇంటికి రాకుంటే రంగనాథం కోసం, అతని భార్య, బావమరిది ఏం చేస్తారు ?

తరువాయి భాగంలో...

*******************************************************************

(ఇంకావుంది)

( హాసం సౌజన్యంతో )