TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 10
స్వప్న కంఠంనేని
ఆఫీస్ రూమ్ లోంచి బయటపడ్డాక ఇద్దరూ తిన్నగా కాలేజీ వెనుకవైపున్న లాబ్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు. తరువాత మీనా తను ఆఫీస్ రూంలోంచి కొట్టేసిన వస్తువులన్నిటినీ బ్యాగ్ లోంచి తీసి నేలమీద కుప్పగా పోసింది.
"ఎం చేసుకుంటావే? ఎందుకు నీకివి?'' అడిగింది హనిత.
"నా క్లాసిక్ కలెక్షన్ లో చేరుస్తాను. అయినా ఆ క్లర్క్ ఇందాక నీ దగ్గర నుంచి యాభై రూపాయలు వసూలు చేసాడుగా. అందుకే నేను వాడి దగ్గర్నుంచి వంద రూపాయల వస్తువులు కాజేశాను'' చెప్పింది మీనా.
క్లర్క్ మొహం గుర్తొచ్చి నవ్వుకున్నారిద్దరూ.
"అది సరే గానీ వైభవ్ అడ్రెసెందుకు? వాళ్ళింటికి వెళ్తావా?'' అనుమానంగా చూస్తూ అడిగింది మీనా.
"ఛీ! వాళ్ళింటికా? నేనా? నెవర్. ఇక్కడ చూడు. అడ్రస్ తో పాటు అతని ఫోన్ నెంబర్ కూడా వుంది'' చెప్పింది హనిత.
"అంటే అతనికి ఫోన్ చేసి బండబూతులు తిడ్తావా నువ్విప్పుడు?'' సంబరంగా అడిగింది మీనా.
"అది పాత పధ్ధతి డియర్. ఇప్పుడతనికి మనం సుదేష్ణ ఫోన్ చేసినట్లుగా చేద్దాం. సరేనా?''
"ఓయస్. నాకర్థమైంది. ఎప్పుడు చేద్దాం?'' తెగ ఉత్సాహపడి పోయింది మీనా.
"ఈరోజు రాత్రికి. నువ్వు ఇవాల్టికి మా ఇంట్లో వుండిపోకూడదు"అలాగే వుంటాను. ముందు మా ఇంట్లో చెప్పేసి ఏడింటికల్లా మీ ఇంటి కొచ్చేస్తాను ఓకే?''
"ఓకే!'' అంది హనిత.
"మరిపుడు మనం క్లాసెస్ కి అటెండ్ అవ్వాలంటావా?'' దీనంగా అడిగింది మీనా.
"ఇప్పుడు క్లాస్ కెవరు అటెండ్ అవుతారు బాబూ! ఇంటికి వెళ్ళిపోదాం పద'' చెప్పింది హనిత.
ఇద్దరూ కాలేజీ గోడ దూకి బయటపడ్డారు.
మీనా గోడ పైకెక్కేసరికి అంది హనిత "జాగ్రత్తేవ్ గోడ పడిపోగలదు''
చెప్పిన టైం కంటే ముందుగానే హనిత ఇంటికి చేరుకుంది మీనా.
అప్పటికే స్నానం చేసి నైటీ వేసుకుని టీవీ చూస్తోంది హనిత.
మీనా రాగానే ఇద్దరూ హనిత రూమ్ లోకి వెళ్ళిపోయారు.
మీనా మంచం మీద వాలింది.
హనిత మంచం దగ్గరికొక కుర్చీ లాక్కుని కూర్చుంది.
సడెన్ గా హనిత అడిగింది.
"మీనా! నాకో చిన్న డౌట్ నువుగానీ వైభవ్ ని ప్రేమించట్లేదు కదా''
"నేను ప్రేమించట్లేదు కానీ అతనే నాకు సైటు కొడ్తున్నాడు''
"అవునా?'' అనుమానంగా అంది హనిత.
"అవును. నువ్వు చూడలేదుగానీ అతనెప్పుడూ నన్నే చూస్తుంటాడు తెలుసా?'' మొహం పక్కకు తిప్పుకుని నవ్వాపుకుంటూ అంది మీనా.
"వాడి పేరు వైభవ్ అని కాకుండా వెధవ అని పెట్టాల్సింది'' కసిగా అంది హనిత.
"సరేగానీ నీకా డౌట్ ఎందుకొచ్చింది?'' అడిగింది మీనా.
"ఏ డౌట్?'' చిరాగ్గా అంది హనిత.
"అదే, నేను వైభవ్ ని ప్రేమిస్తున్నానని''
"అతను నీకు అన్నయ్యవుతాడని నేను చెప్తే నువ్వు నెత్తీనోరూ బాడుకున్నావు కదా. అందుకే నేనలా అనుకున్నాను'' అంది హనిత.
"నెకెఉ అన్నయ్యంటే నువ్వు ఏడ్చినంత పనిచేసావుగా, మరి నువ్వతన్ని ప్రేమిస్తున్నావా?'' అంది మీనా.
"నేనా? వాడ్నా? ఛీఛీ! నెవ్వర్!'' చెప్పింది హనిత.
"ఫోనెప్పుడు చేద్దాం?'' అడిగింది మీనా.
"ఇప్పుడు చేద్దామా? అర్థరాత్రి పన్నెండింటికి చేద్దామా?''
"పన్నెండింటికి చేద్దాం''
"అయితే పద. ఈలోగా భోంచేసి టీవీ చూద్దాం'' అంది హనిత.
ఇద్దరూ కలిసి హాల్లోకెళ్ళారు.
*****
సరిగ్గా పన్నెండయింది.
మీనా, హనిత ఫోన్ దగ్గరకు పరిగెత్తారు.
హనిత నెమ్మదిగా నెంబర్స్ ప్రెస్ చేసింది.
అవతల ఫోన్ రింగవడం మొదలుపెట్టగానే నోటికి కర్చీఫ్ అడ్డంగా పెట్టుకుంది.
ఫోన్ ఎవరో లిఫ్ట్ చేసారని మీనాకి సైగ చేసింది హనిత.
మీనా టెన్సన్ తో ఉక్కిరిబిక్కిరవ్వసాగింది.
"హలో! మే ఐ స్పీక్ టు వైభవ్?'' అడిగింది హనిత. ఇప్పుడామె గొంతు సుదేష్ణ గొంతులాగా వుంది.
"ఇంత అర్థరాత్రి ఫోనెవరు చేసారబ్బా?'' విసుక్కుంటూ వెళ్ళి ఫోనెత్తాడు వైభవ్ తండ్రి రామారావు.
"ఎవరో అమ్మాయి వైభవ్ కోసం ఫోన్ చేసింది. అయినా ఇంత అర్థరాత్రి ఏం పనో'' గొణుక్కుంటూ వెళ్ళి వైభవ్ ని లేపాడాయన.
"ఇప్పుడు నాకెవరు ఫోన్ చేస్తారు? ఏ అమ్మాయి? ఎందుకు?'' ఆవులిస్తూ అన్నాడు వైభవ్.
"ఏమో నాకేం తెలుసు? వెళ్ళి మాట్లాడు'' అన్నాడాయన.
వెళ్ళి ఫోనందుకుని చిరాగ్గా "హలో'' అన్నాడు.
"హలో వైభవ్. నేను సుదేష్ణని'' అని వినిపించింది అవతల్నుంచి.
"సుదేష్ణ నాకెందుకు ఫోన్ చేసిందో? అదీ ఈవేళప్పుడు' మనసులో అనుకున్నాడు వైభవ్.
పైకి మాత్రం "ఏంటి సుదేష్ణ? ఇప్పుడు ఫోన్ చేశావు?'' అన్నాడు ఆశ్చర్యంగా.
"వైభవ్. అయ్ లవ్ యూ. నువ్వు నాకేం చెప్పొద్దు. నేను నీతో మాట్లాడాలి. రేపు ప్రొద్దున ఎనిమిది గంటలకి నన్ను పబ్లిక్ గార్డెన్స్ దగ్గర కలుసుకో''
అవతల్నుంచి ఫోన్ పెట్టేసిన శబ్దం.
"హలో ... హలో'' అరిచాడు వైభవ్.
"తిక్క కుదురుతుంది. రేపు పబ్లిక్ గార్డెన్స్ లో వెయిట్ చేసి చేసి విసుగుపుట్టి వెళ్ళిపోతాడు చూడు'' అంది హనిత.
"ఐడియా'' అంది మీనా.
"సుదేష్ణకి కూడా వైభవ్ లాగే ఫోన్ చేసి వాళ్ళిద్దరికీ జూలకటక పెడదామా?'' అంది మీనా.
"రైట్. కానీ సుదేష్ణ ఫోన్ నెంబర్?''
"నాకు తెలుసు''
"మరి ఆలస్యమెందుకు? చెప్పు!'' తొందరచేసింది హనిత.
తర్వాత హనిత వైభవ్ కి చేసినట్లే సుధేష్ణకి ఫోన్ చేసి వైభవ్ గొంతుతో మాట్లాడింది.
తర్వాత మీనాతో అంది "అయితే మనం రేపు పొద్దున్నే పబ్లిక్ గార్డెన్స్ కి వెళ్ళాలన్నమాట''
"అంతేగా మరి'' ఉత్సాహంగా అంది మీనా.
ఆరింటికి అలారం పెట్టుకున్నారు.
మరి కాసేపట్లోనే ఇద్దరూ గుర్రుపెట్టి నిద్రపోసాగారు.
|