TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 9
స్వప్న కంఠంనేని
వైభవ్ ని ఏడిపించి కోపం తెప్పించిన శుభసందర్భంగా హానిత, మీనా,రాజాలు పార్టీ చేసుకున్నారు.
పార్టీ అయి హానిత ఇంటికెళ్ళేసరికి ఏడయింది.
హానిత వెళ్ళేసరికి ఇంట్లో అందరూ ఆమె కోసమే ఎదురుచూస్తున్నారు. హానిత పెద్దన్నయ్య హరీష్ అన్నాడామెతో .
"ఇవ్వాళ తొందరగా ఇంటికొచ్చేస్తానన్నావుగా హనీ! హేమంత్ తో పెళ్ళిచూపులకి వేల్తానన్నావుకదా''
హానిత నాలిక కొరుక్కుని హేమంత్ తో అంది "అయ్యో! మర్చిపోయాను సారీ చిన్నన్నయ్యా''
"రాకపోవడమే మంచిదయిందిలే హనీ! పెళ్ళికూతుర్ని చూస్తే దడుచుకునే దానివి. హిమాలయ పర్వతంలా వుంది''
వెంటనే హానితకి మీనా, వైభవ్ లు గుర్తొచ్చారు.
పొట్ట పట్టుకుని నవ్వసాగింది.
"సర్లే! ప్రతివాళ్ళకీ వంకలు పెట్టి నవ్వడం మీకలవాటేగా'' కోపంగా అంది గిరిజ.
ఆ రాత్రి హనితకి వైభవ్ మీనా కాళ్ళు విరగ్గొట్టినట్లుగా కలొచ్చింది.
హనిత, మీనాలు హడావుడిగా కాలేజీ ఆఫీస్ రూమ్ లోకి అడుగుపెట్టారు.
అక్కడ ఇద్దరు క్లర్క్స్ కూర్చుని సీరియస్ గా పనిచేసుకుంటున్నారు. ఒక టైపిస్ట్ టైప్ చేస్తున్నాడు.
కాలేజీ స్టూడెంట్స్ కి సంబంధించిన అడ్రస్ లు, స్కాలర్ షిప్స్ వివరాలు అన్నీ ఆఫీస్ రూంలో క్లర్క్ దగ్గరే వుంటాయి. లెక్చరర్స్, ప్రిన్సిపాల్ అడిగితె తప్ప స్టూడెంట్స్ వివరాలను
వేరేవాళ్ళకి తెలియనివ్వరు వాళ్ళు.
ఒక క్లర్క్ కి యాభై ఏళ్లుంటాయి. తల నెరిసిపోయింది. చాలా స్ట్రిక్ట్ లా అనిపించాడు.
రెండో క్లర్క్ వద్దకెళ్ళారు హానిత, మీనాలు. అతనికి ముప్పై ఏళ్ళున్నట్టుగా అనిపించాడు. కిల్లీ నములుతున్నాడు.
అతని ముందు నిలబడి పొడిదగ్గ దగ్గింది హానిత.
తలెత్తలేదతను.
"ఎక్స్ క్యూజ్ మీ సార్'' వినయంగా పిలిచింది.
"ఎస్'' అంటూ తలెత్తాడు.
స్వీట్ గా నవ్వింది హనిత.
ఐసైపోయాడతను.
"మాకో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి''
"చెప్పండి''
"బిఎస్సీ సెకెండియర్ స్టూడెంట్ వైభవ్ అడ్రస్ కావాలి సర మాకు. అర్జెంట్'' అంది హనిత.
"ఎందుకు?'' కఠినంగా అడిగాడతను."ఎందుకంటే ... ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ ఊరినుంచి వచ్చింది సార్. అతనివాళ కాలీజీకి రాలేదు. ఈమెకేమో ఇంటి అడ్రస్ తెలియదు.
మీ దగ్గర అడ్రస్ తీసుకుని ఈమెని అతనింటికి తీసుకువెళ్దామని. ఈమెకి వైభవ్ అన్నయ్య అవుతాడు. సార్''
కేవ్వుమంది మీనా.
"ఛీ ...ఛీ ... అతను నాకు అన్నయ్యేం అవడు'' రోషంగా అంది.
"ఎందుకవడు? అతను నీకు అన్నయ్యే అవుతాడు'' గదమాయించింది హనిత.
"అతను నీకే అన్నయ్య నాకేంకాదు'' కోపంగా అంది మీనా.
"ఛ ... ఛ! అతను నాకు అన్నయ్యేమిటి? నీకేమన్నా మతిపోయిందా? నువ్వు కొంచెం గుర్తుకు తెచ్చుకో మీదా! అతను నీకు దూరపు వరసకి అన్నయ్య అవడూక్లర్క్ తమనే
అనుమానంగా చూస్తుండేసరికి మీనా అయిష్టంగానే వప్పుకుని "అవును ... అవుతాడు'' అంది.
క్లర్క్ అడ్రెస్ లున్న పెద్ద రిజిస్టర్ తిరగేయడం మొదలుపెట్టాడు.
ఉన్నట్లుంది మీనా "కానీ కొద్దిగానే అన్న అవుతాడు'' అంది మీనా మళ్ళీ.
"అవునుసార్ ... పాపం కొద్దిగానే'' అంది హనిత.
"అయితే అతని అడ్రెస్ మీకివ్వను'' బుక్ మూసేస్తూ అన్నాడు క్లర్క్.
హనిత మీనాని క్రూరంగా చూసింది.
"సారీ సార్! కొంచెం ఎక్కువే అవుతాడు'' అంది మీనా గబగబా.
"కొంచెం ఎక్కువ అంటే నాకెలా తెలుస్తుంది? అయినా నాకు తెలిసినంత వరకూ బందుత్వాలని ఇంత అంత అని కొలవరు. కాబట్టి మీరిక నన్నొదిలేస్తే నా పని నేను
చూసుకుంటాను'' విసుగ్గా అన్నాడు క్లర్క్.
ఇక లాభం లేదనుకుని హనిత ఒక యాభై రూపాయల నోటుని క్లర్క్ చేతిలో పెట్టింది.
డబ్బు చేతిలో పడగానే గబగబా రిజిస్టర్ తిరగేసి వైభవ్ అడ్రెస్ వెతికి ఒక పేపర్ మీద రాసిచ్చాడతను.
ఈలోగా మీనా అక్కడున్న టేబుల్ మీదున్న పేపర్ వెయిట్, గమ్ బాటిల్, గుండుసూదులు, స్టాప్లర్, సెలోఫోన్ టేప్, పెన్సిల్స్ పెన్స్ ని క్లర్క్ చూడకుండా తన బ్యాగ్ లోకి చేరేసింది.
అడ్రస్ తీసుకుని అతి వినయంగా 'థాంక్స్' చెప్పి అక్కడ్నుంచి బయటపడ్డారు వారిద్దరూ.
వాళ్ళు వెళ్ళిపోయాక కాసేపటికి ఖాళీగా వున్న తన టేబుల్ చూసుకున్న క్లర్క్ కాసేపు లబోదిబోమని తర్వాత తేలు కుట్టిన దొంగలా ఊరుకున్నాడు.
|