TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 94
- మల్లిక్
"ఇదే మా ఇల్లు" సందు చివరకి వెళ్ళాక చెప్పాడు బుచ్చిబాబు.
నవీన్ స్కూటర్ ఆపాడు. బుచ్చిబాబు క్రిందకి దిగాడు.
ఇప్పుడు బుచ్చిబాబు గొప్ప ఇరకాటంలో పడిపోయాడు.
పాపం... స్కూటర్ మీద ఇంటిదాకా తీసుకొచ్చినందుకు థాంక్స్ చెప్తే సరిపోదు. లోపలికి రమ్మనడం కనీస మర్యాద. కానీ లోపలికి రమ్మంటే లోపల సీతని చూస్తాడు.
సీతని ఏమని పరిచయం చేయాలి?
"ఏంటండీ ఆలోచిస్తున్నారు?" అడిగాడు నవీన్.
"హబ్బే... ఏంలేదు! థాంక్సండీ నవీన్ గారూ. శ్రమ తీస్కుని ఇంటిదాకా డ్రాప్ చేసారు. మిమ్మల్ని ఇంట్లోకి ఇన్ వైట్ చెయ్యాలని వుందిగానీ ఈ టైంలో మిమ్మల్ని లోపలికి రమ్మంటే సిల్లీగా వుంటుంది. అసలే ఆఫీసులో చాలా అలసిపోయి ఎప్పుడెప్పుడు ఇంటికెళ్దామా అనే ఆలోచనలో వుంటారు. దానికితోడు మీ టైం వేస్టుచేసినట్టు కూడా వుంటుందేమో! హిహిహి" ఇబ్బందిగా నవ్వుతూ అన్నాడు బుచ్చిబాబు.
"భలేవారే సార్. ఆఫీసులో ఏం పాటుపడి పోతున్నామని అలసిపోతాం. ఇకపోతే టైం వేస్టంటారా మీతో గడపడం ఇటీజ్ ఎ ప్లైజర్ టైం, వేస్టు ఎందుకు అవుతుంది సార్?"
తనతో గడపడం అతనికెందుకు ప్లెజరో అర్థంకాక బుచ్చిబాబు లోలోపల గింజుకున్నాడు.
ఇంక అతన్ని లోపలికి రమ్మనక తప్పదు!
"హి! హిహి... అయితే రండి... కాస్సేపు కూర్చుని వెళ్దురు గానీ" అన్నాడు బుచ్చిబాబు అనవసరంగా అతని స్కూటర్ ఎక్కినందుకు బాధపడ్తూ.
నవీన్ స్కూటర్ కి స్టాండ్ వేసి లాక్ చేసి బుచ్చిబాబుని అనుసరించాడు.
* * *
బుచ్చిబాబు డోర్ బెల్ నొక్కాడు గుండె బరువుగా కొట్టుకుంటుండగా.
నాలుగు సెకన్లలో తలుపులు తెరుచుకున్నాయి.
"రండి" అన్నాడు బుచ్చిబాబు నవీన్ తో.
సీత ప్రక్కకి తప్పుకుంది.
ఇద్దరూ లోపలికి వెళ్ళారు.
"ఈయన మా ఆఫీసులోనే పనిచేస్తారు... నవీన్"... సీత!!"
పరిచయం చేసాడు బుచ్చిబాబు.
ఇద్దరూ నమస్కారాలు చేసుకున్నారు.
వాళ్ళకి ఏకాంతం కల్పిస్తూ సీత లోపలికి వెళ్ళిపోయింది.
బుచ్చిబాబు గండం గడిచిందని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.
ఇద్దరూ హాల్లో సోఫాల్లో కూర్చుని వాళ్ళ వాళ్ళ సెక్షన్ కబుర్లు చెప్పుకోసాగారు.
ఇంతలో సీత మళ్ళీ వచ్చింది చేతిలో ట్రేలో మూడు కాఫీ కప్పుల్తో.
ఇద్దరూ కప్పులు అందుకున్నారు. ట్రేలోని మూడో కప్పు అందుకుని సీత అక్కడే కూర్చుంది వాళ్ళిద్దరికీ ఎదురుగా. బుచ్చిబాబుకి గొంతులో పచ్చివెలక్కాయి పడింది.
నవీన్ కాఫీ సిప్ చేసి "ఓహ్...! వాటే నైస్ కాఫీ! చాలా బాగుందండీ!" అన్నాడు సీతతో.
"థాంక్యూ ఫర్ ది కాంప్లిమెంట్!" అంది సీత.
"మీరు చాలా అదృష్టవంతులండీ బుచ్చిబాబు గారు! కాఫీయే ఇంత అద్భుతంగా చేస్తే మరి మీ శ్రీమతిగారు వంటెంత అద్భుతంగా చేస్తారో!" అన్నాడు బుచ్చిబాబుతో.
వెంటనే సీత అందుకుని అంది.
|