TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
సిల్లీఫెలో - 95
- మల్లిక్
హాల్లో మినిస్టర్ మిన్నారావ్ కాలుకాలిన పిల్లిలా... పోనీ పిల్లి కాకపోతే మనిషిలా అనే అందాం.
మినిస్టర్ మిన్నారావ్ కాలు కాలిన మనిషిలా తిరుగుతున్నాడు.
అక్కడే సోఫాలో కూర్చుని అతని భార్య వెంకటలక్ష్మి అతని చేష్టలన్నీ గమనిస్తోంది.
మినిస్టర్ మిన్నారావు ఠక్కున నిలబడిపోయి తల పైకెత్తి సీలింగ్ వంక చూశాడు.
"హా! సింహాద్రి అప్పన్నా! నీకేటన్యాయం సేసాను తండ్రీ!" అన్నాడు బాధగా.
తర్వాత భారంగా నిట్టూర్చి మళ్ళీ అసహనంగా అటూ ఇటూ పచార్లు చేయడం మొదలు పెట్టాడు. రెండు నిముషాలు అలా పచార్లు చేసాక మళ్ళీ హఠాత్తుగా హాలు మధ్య ఆగిపోయి సీలింగ్ వంక చూసాడు.
"హా! నేనేం పాపం చేసాను ఏడుకొండలవాడా?" అన్నాడు కుమిలిపోతూ.
మరో రెండు నిమిషాలు అలా కుమిలిపోయి మళ్ళీ హాల్లో పచార్లు మొదలుపెట్టాడు.
కాలుకాలిన కుక్కలా....
కాలుకాలిన పిల్లి, కాలుకాలిన కుక్కలు నడవడం ఎవరు చూసారు?
ఏమో!
ఒక నిముషం తరువాత ఠకాలున ఆగిపోయి సీలింగ్ వంక చూసాడు.
"హె శ్రీశైల వాసా... నా నేరం ఏమిటి?"
మినిస్టర్ మిన్నారావ్ కంగారుపడిపోయి గొంతు తడుముకున్నాడు.
అసలు ఈ వాక్యం తను అనాలని అనుకున్నాడు, కానీ తను అనకముందే ఆ వాక్యం వినిపించింది. ఎలా? ఎలా?
"కంగారుపదమాకు. ఇహ ఎట్టాగూ ఆ మాట నువ్వంటావని నేనే అనేశా...." అంది వెంకటలక్ష్మి.
మిన్నారావ్ ఆమెవంక వెర్రిమొహం వేస్కుని చూశాడు.
"నేనామాట అంటానని నీకెవరు సెప్పారు?"
"ఓరు సెప్పాలా? ఇందాకట్నుండీ అటూ ఇటూ తిరగడం, పైకి సూడ్డం, ఈ మాటలు అందం ఇదేగా సేత్తున్నారు?" చికాకుగా మొహం పెట్టింది వెంకటలక్ష్మి.
"అవునా?" అయోమయంగా అన్నాడు.
"అయినా రోజూ ఉప్పుసేపల కూర తింటే ఇట్లాగే వుంటుంది.... ఎంతిట్టమయితే మాత్రం రోజూ తినాలా?"
"సీ నీయబ్బ! అది కాదులే... నీకు తెల్దు" విసుక్కున్నాడు మిన్నారావ్.
"మరెందుకట్టా గింజుకుపోతున్నావ్?"
"అబ్బా... ఆ యిసయం వదిలెయ్" విసుగ్గా అని మళ్ళీ పచార్లు మొదలుబెట్టాడు.
మిన్నారావ్ కి పరిస్థితి మొత్తం చాలా గందరగోళంగా వుంది. అతనికి జీవితం రోజురోజుకీ దుర్భారంగా మారిపోతుంది. రోజూ ఎవడో ఒకడు ట్రాన్స్ ఫర్ గురించో, ప్రమోషన్ గురించో వస్తున్నాడు.
ఠక్.... కుదుర్దు. వీల్లేదని అంటే పాత న్యూస్ పేపర్ తీసి చూపిస్తున్నారు.
అసలు ఇది ఇంతమందికి ఎలా ప్రచారం జరిగింది? ఇంతమందికి తెలిసిన విషయం పోలీసులకు తెలియలేదంటే ఆశ్చర్యమే. వీళ్ళకి తెలిస్తే నేరం రుజువయితే కటకటాల వెనక్కి వెళ్ళాల్సిందే!
అసలు ఈ బాధలన్నింటికీ కారణం ఆ బుచ్చిబాబుగాడే!
|