సిల్లీ ఫెలో - 111

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 111

- మల్లిక్

సాయంత్రం అయిదయ్యింది.

బుచ్చిబాబు గబగబా ఫైల్స్ సర్దేశాడు. సీత దగ్గరికి వెళ్ళాలని మనసు ఆరాటపడ్తోంది.

పాపం క్రితంరోజు సాయంత్రం సీత ఆరోజు ఉదయం ఆఫీసుకు వెళ్ళేటప్పుడు తిరిగి ఆఫీసు నుండి ఇంటికెళ్ళేటప్పుడు కనబడమని బుచ్చిబాబుకి చెప్పింది కానీ ఉదయం పార్వతమ్మ వంట ఆలస్యం చెయ్యడం వల్ల ఆఫీసుకి టైమైపోయి సీత దగ్గరికి వెళ్ళకుండా డైరెక్టుగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంటికెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కనిపించి తీరాలి. పాపం!! చాలా ఎదురుచూస్తూ వుంటుంది అనుకున్నాడు. కోపంగా కారాలు మిరియాలూ కూడా నూరుతుందేమో!

ఫైల్సన్నీ సర్దిపెట్టి మోహన్ దగ్గరికి వెళ్ళి "ఇంక ఇంటికెళ్దామా?" అన్నాడు బుచ్చిబాబు.

మోహన్ అయిష్టంగానే తల ఊపాడు.

ఏకాంబరం బుచ్చిబాబుకి ఏమైనా అర్జంట్ ఫైల్స్ ఇచ్చి ఆఫీసులో లేటుగా కూర్చోబెడితే బావుండు. తను సీతతో కబుర్లేసుకోవచ్చు అనుకున్నాడు. మోహన్. మోహన్ సీట్లోంచి లేచాడు.

ఇద్దరూ ఆఫీసులోంచి బయటపడ్డారు.

"పొద్దున రాలేకపోయాను. సీత నాకోసం ఎదురు చూసిందా? నేను రాలేదని కోపగించుకుందా?" అడిగాడు బుచ్చిబాబు.

"ఊహూ. అసలు నీ ప్రసక్తే తీసుకురాలేదు" కసిగా అన్నాడు మోహన్.

నిజానికి సీత మోహన్ తో చాలాసార్లు అంది ఏంటి బుచ్చిబాబు ఇంకా రాలేదు అని!

ఇద్దరూ బస్టాండువైపు అడుగులు వేస్తున్నారు. ఇంతలో...

"ఓరేయ్ వెధవాయ్" గట్టిగా కేక వినిపించింది.

బుచ్చిబాబు గుండెల్లో రాయి పడింది.

అది తన తండ్రి పర్వతాలరావు  గొంతు.