TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 22
ముచ్చర్ల రజనీ శకుంతల
"చెబితే మమ్మీ తంతుందేమొ?"
"ఛ...మమ్మీ ఎందుకు తంతుంది...నువ్వు చెప్పరా బబ్లూ..."
"గయ్యాళి పెళ్లాలున్న మొగుళ్ళు. వాళ్ళే ఎక్కువగా దెబ్బలు తింటూంటారు."
ఫక్కున నవ్వింది ప్రియంవద. కొడుకుని దగ్గరకు తీసుకుని "అన్నీ నా తెలివి తేటలే" అంది.
"అవును...అవునవును..." అన్నాడు భార్య వంక చూస్తూ శ్రీకర్.
"అవునూ...ఇవ్వాళ మీ మేడమ్స్ హోంవర్క్ ఎందుకివ్వలేదో చెప్పనే లేదు" కొడుకుని అడిగింది ప్రియంవద.
"చెబితే ఒక తంటా...చెప్పకపోతే ఒక తంటా..ఎందుకులే" అన్నాడు బబ్లూ.
"ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాకు మండుతుంది...అసలు విషయం చెప్పు"
"ఏం చెప్పమంటావు మమ్మీ..." అంటూ ఎదురుగా వున్న సోఫా వైపు చూసాడు.
"ఏం చేస్తున్నావురా..." ప్రియంవద అడిగింది.
"సోఫా వైపు చూసి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు తెచ్చుకుంటున్నాను. ఉదయం ఏం జరిగిందంటే..."
"చంపేస్తానురా...జరిగింది చెప్పు చాలు...విజువలైజేషన్ అక్కర్లేదు" ప్రియంవద అంది.
"టీవీ సీరియల్స్ లో ప్రతీ సీన్ లో ఎవరో ఒకరు ఇలానే ప్లాష్ బ్యాక్ లోకి వెళ్తారు"
ప్రియంవద కోపంగా కొడుకు వంక చూసింది.
"హోం వర్క్ ఎందుకివ్వలేదో చెప్పనేలేదు కదూ...నిన్న మా సైన్స్ మేడమ్ ఇంట్లో కరెంట్ పోయింది. సోషల్ మామ్ ఇంట్లో కేబుల్ పోయింది. తెలుగు మేడమ్ ఇంటికి చుట్టాలొచ్చారు..ఇంగ్లీష్ మేడమ్ ఇంటికి బంధువులొచ్చారు..."
"వస్తే...? దానికీ, నీ హోంవర్క్ కు సంబంధం ఏమిటి?"
"ఒక్కొక్కరూ ఒక్కో సీరియల్ మిస్సయ్యారట. అందరూ కూచొని నిన్న జరిగిన ఎపిసోడ్ ముచ్చట్లు చెప్పుకున్నారు. సోషల్ మేడమైతే ఏడ్చింది...హీరోయిన్ ని, హీరోయిన్ అత్త బాగా కొట్టిందట..."
"అందుకని..."
"వాళ్ళు మిస్సయిన టీవీ సీరియల్ ఎపిసోడ్స్ చెప్పుకున్నారు. మాకు పాఠాలు చెప్పలేదు. హోంవర్క్ ఇవ్వలేదు" బబ్లూ చెప్పాడు.
"అవునూ..ఎగ్జామ్స్ అన్నావు కదరా..."
"నో ఎగ్జామ్స్...వాయిదా వేసారు. అబ్బబ్బ బోల్డు ఇన్ ఫర్మేషన్ ఇచ్చాను. తాగిన పాలు అరిగిపోయాయి. నేను వెళ్ళి పడుకుంటాను మమ్మీ..." ఆవులిస్తూ అన్నాను బబ్లూ.
* * *
మీరు బబ్లూ విషయం సీరియస్ గా ఆలోచించండి" అంది భర్త పక్కనే పడుకుంటూ ప్రియంవద. కళ్ళజోడు తీసి పక్కనే వున్న డ్రెస్సింగ్ మిర్రర్ మీద పెట్టింది.
"ప్రియంవదా...నువ్వలా కళ్ళజోడు తీస్తోంటే భలే సెక్సీగా వున్నావు"
"ఛ..ఛ...ఏం మాటలవి...అయినా ఎవరైనా ట్రాన్స్ పరెంట్ నైటీలోనో, తెల్లచీరలోనో సెక్సీగా వున్నావని అంటారుగానీ..మీరేమిటి?"
"సెక్సీనెస్, అందం...శరీర సౌందర్యాన్ని బట్టి కాదు ఆకర్షణను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన ఇష్టాన్ని బట్టి మారుతూ వుంటాయి.
"మరి మీకు?" చురుగ్గా అడిగింది ప్రియంవద.
"నాకు....నాకేమిటి...నాకు నువ్వెలా వున్నా యిష్టమే" అన్నాడు భార్యను దగ్గరకు లాక్కుంటూ.
"బబ్లూ సంగతి ఏం చేసారు?'
"ఏమైంది వాడికి?"
"వాడికి టీవీ మేనియా సోకింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. కేబుల్ కనెక్షన్ పీకించేయమంటే మీరు వినరు. ఎందుకు వింటారు. ఫ్యాషన్ షోలు...మిడ్ నైట్ మసాలాలు తమరు చూడాలి కదా..."
"అబ్బ..ఇది దెప్పిపొడుచుకునే సమయం కాదు. రెచ్చిపోయే సమయం..." అన్నాడు డ్రెస్సింగ్ మిర్రర్ మీద వున్న భార్య కళ్ళజోడు వంక చూస్తూ. తన కళ్ళజోడు ఆ కళ్ళజోడు పక్కనే పెడుతూ.
"రేపొద్దున్నే 'నో టెన్షన్' డిటెక్టివ్ ఏజెన్సీని కలవాలి. భర్తకి ఏం చెప్పి వెళ్ళాలా' అని ఆలోచిస్తూ వుండిపోయింది ప్రియంవద.
అదే సమయంలో ఇండియా రావడానికి సిద్ధమవుతోంది లూసీ.
ఎందుకో...ఏమిటో
|