TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 14
ముచ్చర్ల రజనీ శకుంతల
"అర్జెంటుగా నేనిప్పుడు వెళ్లకపోతే ఇంకెప్పుడూ 'అప్పుడేనా...శ్రీ...' అని నువ్వడిగే చాన్స్ వుండదు" కోమలికి చెప్పి ఆమెను విడిపించుకుని బయటకు నడిచాడు.
కారు డ్రైవ్ చేస్తూనే ఆలోచిస్తున్నాడు. ప్రియంవదకు ఇప్పుడేం చెప్పాలి? క్షణాల్లో...ఇలాంటి విషయాల్లో అతను స్క్రీన్ ప్లే తయారుచేయగలడు. అతని మెదడు షార్ప్
గా పనిచేస్తోంది. టెన్ సెకన్స్ ..పది క్షణాల్లో స్కీన్ ప్లే తయారైంది. కోమలికి ఫోన్ చేసాడు. ఆమె ఏం చేయాలో చెప్పాడు.
* * *
తన క్యాబిన్ లో అటూ ఇటూ తిరుగుతోన్న భార్యని చూసి "ఏమైంది ప్రియంవదా..." అని అడిగాడు శ్రీకర్.
"నాకేమీ కాలేదుకానీ...మీరేమిటి ఆఫీసు టైంలో అవుడ్డోర్ షూటింగ్ పెట్టారు" అనుమానంగా అడిగింది.
శ్రీకర్ ఏదో చెప్పబోతుండగా టేబుల్ మీద వున్న ఫోన్ రింగయింది.
ప్రియంవద భర్తవైపు చూసింది.
"ప్రియా...ఓసారి ఆ ఫోన్ ఎవరు చేసారో చూడు" అన్నాడు కుర్చీలో కూర్చుంటూ.
"మీ ఆఫీసులో ఫోన్...మీరుండగా నేను లిఫ్ట్ చేయడమేమిటి? ఇంతకు ముందోసారి అలానే లిఫ్ట్ చేస్తే ఏమన్నారూ...?"
"అబ్బ! ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లే ఓపిక లేదుగానీ ఏమన్నానో ఒక్క ముక్కలో చెప్పు..."
"ఇది ఆఫీసు, ఫోన్ నేను లిఫ్ట్ చేస్తేనే బావుంటుందని అనలేదూ..."
"ఓహో అలా అన్నానా? అనే వుంటాను. నాకు మెంటల్ కదా. సర్లే ఇప్పటికి ఫోనెత్తు.
భర్త ప్రవర్తనను అబ్జర్వ్ చేస్తూ రిసీవర్ ఎత్తింది.
"ఏంటీ యశోదా హాస్పిటల్ నుంచా..." అంది ప్రియంవద. కొద్ది క్షణాల తర్వాత "అలాగే..అలాగే వన్ సెకన్..." అంటూ రిసీవర్ పక్కన పెట్టి... "ఏమండీ
మీకే...యశోదా హాస్పిటల్ నుంచి. మీ ఫ్రెండ్ పరిస్థితి గురించి డాక్టర్ గారూ ఏదో చెప్పాలట" అంది.
శ్రీకర్ కంగారు నటిస్తూ రిసీవర్ తీసుకుని "ఆ చెప్పండి. ఏంటీ అవుటాఫ్ డేంజరా? ఇన్ టైమ్ అడ్మిట్ చేశాం కాబట్టి సరిపోయిందంటారా? ఇట్స్ మై డ్యూటీ. నో
ప్రాబ్లెమ్. నేను రావాలా? రాత్రి కూడా అక్కడే వుండాల్సి వస్తుందా? ఎవరినైనా పంపించేదా? సరే...సరే.." శ్రీకర్ మాట్లాడేస్తున్నాడు.
"ఎవరు...ఎవరికేమైంది?" శ్రీకర్ ఫోన్ పెట్టేశాక అడిగింది ప్రియంవద.
"మన రాజారావు గారు లేరా?"
"రాజారావా? అతనేవరూ?"
"మన పెళ్లికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తూ నెలకోసారి డాక్టర్ చెకప్ చేయించుకుని ఆరోగ్యాన్ని బాగా చూసుకోమ్మా అని అన్లేదూ...నాకు హెల్త్ ఇన్సూరెన్సు పాలసీ
కట్టి ఆ రిసీట్స్ ని మన పెళ్లి కానుకగా ఇవ్వలేదూ..."
ఒక్క క్షణం ఆ రాజారావు ఎవరో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించింది ప్రియంవద.
"ఏంటీ గుర్తొచ్చిందా?" భార్య మొహంలోకి అనుమానంగా చూస్తూ అడిగాడు.
"ఆ...ఇప్పుడు గుర్తొచ్చింది. బబ్లూ బర్త్ డే ఫంక్షన్ కు వచ్చాడు కదూ. వాడికి గిఫ్ట్ గా కాల్షియమ్ శాండోజ్ బిళ్లలు కూడా ఇచ్చినట్టు గుర్తు."
"ఆ...ఆ రాజారావుగారికే హార్ట్ ఎటాక్ వచ్చింది.
బామ్మగారు ఫోన్ చేసారు. వెంటనే వెళ్లి అతడ్ని హాస్పటల్ లో జాయిన్ చేసి వస్తున్నాను."
"అయ్యో అలాగీ. ఆయన వయసు ఎనభై రెండు వుంటుంది కదూ..."
"ఆపై మాటే..." అన్నాడు శ్రీకర్.
"మరిప్పుడెలా వుంది?"
"డాక్టర్లు అర్జంటుగా బైపాస్ సర్జరీ...కిడ్నీ ఆపరేషన్ ...రెండూ వెంటనే చేయాలని చెప్పారు"
"వచ్చింది హార్ట్ ఎటాక్ కదా? మరి కిడ్నీ ఆపరేషన్ ఎందుకు?"
"రాజారావుగారికి ఒకటి అంకె అచ్చిరాదట. రెండు అంకె కలిసొచ్చే సంఖ్యట. సరి సంఖ్య కాబట్టి కిడ్నీ ఆపరేషన్ కూడా చేయమన్నారు. ఫ్యూచర్ లో కిడ్నీ
కాంప్లికేషన్స్ రాకుండా."
ప్రియంవదకు పిచ్చెక్కినట్టయింది. మైండ్ బ్లాంక్ గా మారింది. మొగుడ్ని నాలుగు దులపాలని వచ్చి, సిట్యుయేషన్ చూసి కామ్ అయింది.
ఆ రాత్రి రాజారావుగారికి తోడుగా ఉండాలని చెప్పి, కోమలి ఇంటికి వెళ్లాడు శ్రీకర్.
ఎర్లీ మార్నింగ్ బద్దకంగా లేచి డ్రెసప్ అయి, అన్నాడు, "కోమలీ...నువ్వు మంచి మిమిక్రీ ఆర్టిస్టువు. నువ్వు హాస్పిటల్ నుంచి అని చేసిన ఫోన్ మా ఆవిడ
నమ్మింది"
"కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మీది కదా..." అంది అతడ్ని మీదికి లాక్కుంటూ.
* * *
పొద్దున్నే వాడిపోయిన మొహం, ఎర్రబడ్డ కళ్ళతో వచ్చిన మొగుడ్ని చూసి కంగారుగా అడిగింది ప్రియంవద.
"రాజారావు బాబాయ్ గారికి ఎలా వుంది?"
సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు శ్రీకర్.
"పోయారా?" అనుమానంగా అడిగింది ప్రియంవద.
"అవును పోయారు...రాజారావుగారు కాదు, డాక్టర్ గారు"
"అదేంటి?"
"రాత్రిపూట విజిటింగ్ కు డాక్టర్ వచ్చారు. రాజారావుగారు డాక్టర్ని కూచోబెట్టి బైపాస్ సర్జరీ ఎలా చేస్తారో పూర్తి డిటైల్స్ తెల్లారే వరకూ చెప్పించుకున్నారు.
మొత్తం విని, మీరు బైపాస్ గురించి చెబుతుంటే మళ్లీ మళ్లీ బైపాస్ సర్జరీ అవసరం లేకుండానే డాక్టరుగారు పోయారు.
"అవునా...మరి బాబాయ్ గారు?"
"తనకు ఎపిసోయా అనే జబ్బు వుందేమోనని డౌటుట. స్కానింగ్ చేయించుకుంటానన్నారు."
"ఎపిసోయానా? అదేం జబ్బు? పేరెక్కడా విన్లేదే"
"హాస్పిటల్ లో స్కానింగ్ డిపార్ట్ మెంట్ వాళ్లు, మిగతా డాక్టర్లూ అదే చెప్పారు. కానీ రాజారావుగారు వినిపించుకోవడం లేదు. దక్షిణాఫ్రికా అడవుల్లో ఈ వ్యాధిని
కనుకున్నారట. నరమాంస భక్షకుల నుంచి ఈ వైరస్ సోకితే ఎపిసోయా వ్యాధి వస్తుందట. అలా అని కొరియా భాషలో వున్న వైద్య గ్రంథంలో చదివాడట."
"బాబాయ్ గారికి కొరియా భాష కూడా వచ్చా?"
"ప్రపంచంలో వున్న మందుల కంపెనీల గురించి, వాటి పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోవడానికి అనువుగా అన్ని భాషలూ తెలుసుకున్నారు.
అప్పుడప్పుడు ఇంటర్నెట్ లో విదేశాల్లో వున్న డాక్టర్లతో చాటింగ్ కూడా చేస్తారు."
ప్రియంవద ముక్కున వేలేసుకుని ఆలోచిస్తూ వుండిపోయింది. శ్రీకర్ మెల్లిగా బాత్ రూంలోకి జారుకోబోతూంటే బబ్లూ మెల్లిగా అన్నాడు.
|