TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 31
ముచ్చర్ల రజనీ శకుంతల
హలో...రాంగ్...నెంబర్..!
శ్రీకర్ కారు అక్షిత యింటి ముందు ఆగింది. కారు పార్క్ చేసి ఇంటి లోపలికి అడుగుపెడుతోన్న శ్రీకర్ కు చిన్న అనుమానం కలిగింది. గత కొద్దిరోజులుగా అతనికీ అనుమానం కలుగుతూనే వుంది.
కొంతమంది అమ్మలక్కలు తన వైపే చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు.
శ్రీకర్ ఓసారి తన గురించి మాట్లాడుకుంటోన్న వాళ్ళ వైపు చూసి లోపలికి వెళ్ళాడు.
హాలులోకి వెళ్ళి అక్షితను పిలిచాడు. అక్షిత బాత్రూంలో వుందని అర్థమైంది. తను మార్నింగ్ వస్తానని చెప్పాడు. అందుకే ఇంటిముందు తలుపులు తనకోసం స్వాగతం పలుకుతూ తెరుచుకునే వున్నాయి.
ఇంట్లో ఎవరూ లేరు అక్షిత తప్ప. తలుపులు మూసి గొళ్ళెం పెట్టి బాత్రూం దగ్గరకి వెళ్ళాడు.
"అక్షితా..." పిలిచాడు.
లోపల్నుంచి నీటిధార శబ్దం వినిపిస్తోంది.
"అక్షితా...."
"బాత్రూం తలుపులకు బోల్డ్ ఊడిపోయి నలభై ఎనిమిది గంటలైంది..." లోపల్నుంచి వినిపించింది.
శ్రీకర్ నవ్వుకున్నాడు. మెల్లిగా తలుపు తెరిచాడు. ఒక్కక్షణం అతని కళ్ళు చిత్రంగా మెరిసాయి.
* * *
"నిన్న మీకు చెప్పడం మరిచాను. నన్ను చూడ్డానికి ఓ పెళ్ళికొడుకు వచ్చాడు" మంచం మీది నుంచి దిగి బట్టలు వేసుకుంటూ చెప్పింది అక్షిత.
ఒక్కక్షణం చిన్న గిల్టీ ఫీలింగ్ లాంటిది కలిగింది శ్రీకర్ కు. ఆమె పెళ్ళికాని అమ్మాయి...మరో పురుషుడికి ఇల్లాలు కావలసిన వ్యక్తి...తను ఆమెను ట్రాప్ లో పడేసి"
"వింటున్నారా?" అంది అక్షిత.
"శ్రీకర్ మౌనంగా మంచమ్మీద వెల్లకిలా పడుకుండిపోయాడు.
చీర కట్టుకుని, బ్లౌజు వేసుకొని అతని పక్కన కూచుని "ఏమిటి ఆలోచిస్తున్నారు?" అంది.
"ఏం లేదు. నీకు రవ్వల నెక్లెస్ కొన్నివ్వాలా? వడ్డాణం కొన్నివాలా? అని..."
"ఏమీ వద్దు..క్యాష్ యివ్వండి. నాకు పనికొస్తుంది" అంది అక్షిత.
ఒక్కసారి ఆమె వంక పరిశీలనగా చూసాడు శ్రీకర్. ఒక్కోసారి అక్షిత అతనికి పజిల్ లా అనిపిస్తుంది. అవును. అక్షిత ఓ ప్రహేళిక.
"అదిగో మళ్ళీ ఆలోచనలో పడిపోయారు"
"ఏం లేదులే..ఇంతకీ నిన్ను చూసిన పెళ్ళికొడుకు ఏమన్నాడు?"
"వంటావార్పు, పాటా, ఆటా వచ్చా అని నాలుగు ఐదు చచ్చు, పుచ్చు ప్రశ్నలడిగాడు"
"నువ్వేం చెప్పావు?"
"చచ్చు పుచ్చు జవాబులే చెప్పాను. అయినా అతనికి కావలసింది అవేమీ కావు. కట్నం అది ఏమాత్రం మేము ఇవ్వగలమోనని టెస్ట్ చేసాడు"
"అంటే"
"ముందు మాటలతో బెదరగొట్టి వాళ్ళ బ్యాగ్రౌండు వాళ్ళకెవరెవరు ఎంతెంత ఇస్తామన్నారో వాటి వివరాలు చెప్పి అన్యాపదేశంగా మీరు అంతకాన్నా ఎక్కువే ఇచ్చుకోవాలి సుమా అనే మీనింగ్ వుంటుంది"
"పోనీ....నీకు అతను నచ్చితే చేసుకో. కట్నం గురించి ఫీలవ్వకు" అక్షిత తలమీద చేయి వేసి చెప్పాడు.
"అతను చదివింది ఇంటర్మీడియట్. చేసేది ఓ చిట్ ఫండ్ ఆఫీసులో క్లర్క్ జాబ్. వయసు ముప్పయి అయిదు పైమాటే. బట్టతల...సిగరెట్లు విపరీతంగా కాలుస్తాడేమో బండబారిన నల్లపెదాలు. అయినా శల్యపరీక్ష చేసాడు. అందరూ నాలుగైదు లక్షల వరకూ యివ్వడానికి వస్తున్నారుట. ఆడపిల్లంటే ఎంత ఛీప్ అయిపొయింది" తనలో తనే గొణుక్కుంటున్నట్టు అంది అక్షిత అతని భుజం మీద తలపెడుతూ.
"నీకు మంచి భర్త వస్తాడు" చెప్పాడు శ్రీకర్. అక్షిత వైపు చూసి చిన్నగా నవ్వి లేచింది. శ్రీకర్ కూడా లేచాడు.
* * *
|