TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 28
ముచ్చర్ల రజనీ శకుంతల
"చెప్పండి మా వాడికి బెయిల్ తెప్పించమంటారా?"
ఇన్స్పెక్టర్ చండి ఓసారి సెల్ లో వున్న జేమ్స్ బాండ్ వంక చూసి చెప్పింది.
"మీ వాడికి అంత సీన్ లేదు. రివాల్వర్ కు లైసెన్స్ వుంది కాబట్టి బ్రతికిపోయాడు. అయినా ఆ హోటల్ వాడు చెప్పాడు మీవాడు చేసిన నేరం"
జేమ్స్ బాండ్ చెవులు రిక్కించాడు. ఇన్స్పెక్టర్ ఏం చెప్పబోతున్నాడా అని.
"ఇరవై సమోసాలు...అయిదు ఛాయ్ లు ...వాటికి బిల్లు కట్టకపోవడం...ప్రెస్ ను పిలవమంటారా?"
జేమ్స్ బాండ్ కంగారు పడిపోయాడు. నాయర్ కాస్త నెమ్మదిగా "వదిలేయండి ఇన్స్పెక్టర్, మావాడు జస్ట్ పర్సు మరిచిపోయాడు. హోటల్ వాడికి బిల్లు నే 'పే' చేస్తాను."
"ఆ బిల్లు నేను కట్టానులెండి. మరి ఆ రివాల్వర్ తో బెదిరించడం సంగతేమిటి?" ఇన్స్పెక్టర్ చండి అడిగింది.
"ఛ...ఛ...అలాంటి పని జేమ్స్ బాండ్ చేయడు. తన ఐడింటీటీ కార్డు మరిచిపోయాడు. తను డిటెక్టివ్ ని అని నమ్మించడం ఎలా అని ఆలోచించి తన రివాల్వర్ చూపించాడు."
"ఆల్ రైట్...ఇంకా ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేయలేదు. ఈసారికి వదిలేస్తున్నాను" అంటూ "కానిస్టేబుల్" అని పిలిచింది.
జేమ్స్ బాండ్ తనే స్లే ఓపెన్ చేసుకొని బయటకు వచ్చాడు.
"థాంక్యూ ఇన్స్పెక్టర్" అంటూ జేమ్స్ బాండ్ వైపు ఓసారి చూసి బయటకు నడవబోతుంటే..
"ఎక్స్ క్యూజ్ మీ..." అని పిలిచింది ఇన్స్పెక్టర్ చండి.
లాయర్, జేమ్స్ బాండ్ ఆగారు
"మిమ్మల్ని కాదు..." అంటూ నాయర్ వైపు చూసింది. నాయర్ ఇన్స్పెక్టర్ చండి దగ్గరకి వచ్చాడు.
"ఎనీ సెకండ్ థాట్" అడిగింది మృదువుగా నాయర్ వైపు చూస్తూ.
"సారీ..." చెప్పాడు నాయర్.
"నో ప్రాబ్లెమ్ ...ఎప్పటికైనా మీరు కొనిపెట్టే శారీ కోసం ఎదురుచూస్తాను...యూ కెన్ గో" అంది లోగొంతుకతో ఇన్స్పెక్టర్ చండి.
* * *
నాయర్ ఎదురుగా కుర్చీలో కూచొని పేపర్ ఫ్లయిట్ ని టేబుల్ మీద తిప్పుతున్నాడు జేమ్స్ బాండ్. దాదాపు అరగంట ఉంచి నాన్ స్టాప్ గా తిడుతూనే వున్నాడు నాయర్.
"ఛ...ఛ... అసలు ఏంటి నీ వుద్దేశం...నీకు పరిశోధన మీద ఇంట్రెస్ట్ వుందని డిటెక్టివ్ ని చేసాను. సిన్సియారిటీ వుందని జేమ్స్ బాండ్ ని చేసాను. నీకు లాంగ్ కోటు, ఫెల్ట్ హాటూ ఇష్టమంటే అలానే వుండనిచ్చాను. నువ్వు ఇన్ వెస్టిగేషన్ చేసిన కేసుల వల్ల నీ ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని, నీకో రివాల్వర్ కోని, లైసెన్సూ ఇప్పించాను. అయినా నీకు యింత తిండి యావ వుండకూడదు..."
జేమ్స్ బాండ్ నాయర్ తిట్టే తిట్లు కామ్ గా భరిస్తున్నాడు. అరగంట తర్వాత కాసేపు ఆగి, టేబుల్ మీద వున్న గ్లాసులో నీళ్ళు తాగి "ఇంకెప్పుడూ నాకెలాంటి న్యూసెన్స్ ని క్రియేట్ చేయకు. పాపం చండి మంచిది కాబట్టి వదిలేసింది. మన లక్ ఏమిటంటే మనం ఆమె పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడం. ఆమెను అర్థం చేసుకో" అన్నాడు నాయర్.
"స్పెల్లింగ్ మిస్టేక్ సార్...ఆమెను అర్థం చేసుకోవల్సింది మీరు"
ఒక్క క్షణం నాయర్ మౌనంగా వుండిపోయాడు. ఇదే తగిన అదునుగా భావించి "నేనిక వెళ్లిరారానా సార్" అని అడిగాడు జేమ్స్ బాండ్.
"వన్ సెకన్..." అంటూ కిందికి వంగి టేబుల్ సొరుగులో వున్న పింక్ కలర్ ఫైల్ జేమ్స్ బాండ్ చేతికి ఇచ్చాడు. అందులో శ్రీకర్ కు సంబంధించిన డిటైల్స్ వున్నాయి.
"నువ్వతన్ని వాచ్ చెయ్...అతనికి ఎవరెవరితో ఎఫైర్స్ ఉన్నాయి, ఎన్ని గంటలకు ఎవర్ని కలుస్తున్నాడు లాంటి డిటైల్స్ సేకరించు. మూడ్రోజుల్లో మనం ఈ వివరాలు కనుక్కోవాలి. ఈ క్షణం నుంచి నీ డ్యూటీ ఇదే."
"సివిల్ ఎస్సయిన్ మెంటా...క్రిమినల్ ఎస్సయిన్ మెంట్ అయితే మజా వుండేది"
"మజా అంటే గుర్తొచ్చింది...కూల్ డ్రింక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వుండు. క్లయింట్స్ తో వ్యవహరించేటప్పుడు కూల్ డ్రింక్స్ ఆఫర్ చేయకు. నువ్వే వాళ్లకు విషమిచ్చి చంపావు అని కేసు ఫైల్ చేసే ప్రమాదం వుంది" చెప్పాడు నాయర్.
ఆ తర్వాత శ్రీకర్ కు సంబంధించిన ఫైల్ తీసుకొని బయటకు నడిచాడు జేమ్స్ బాండ్.
* * *
|