TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
హలో... రాంగ్ నెంబర్.! - 25
ముచ్చర్ల రజనీ శకుంతల
"నమ్మకమే..."
"అంత ఖచ్చితంగా మీరెలా చెప్పగలరు?"
"మా పెళ్ళయిన తర్వాత ఫస్ట్ నైట్ తనకు అమ్మాయిలంటే చాలా యిష్టమని చెప్పారు. ఆయనకు అప్పుడప్పుడూ అమ్మాయిల నుంచి ఫోన్లు వస్తాయి. నాతో బయటకు వెళ్ళినప్పుడు చాలా అందంగా తయారై వెళ్తారు."
నాయర్ నవ్వి "మేము చేయవలసిన డిటెక్టివ్ పనులు మీరు కూడా బాగానే చేస్తున్నారు" అన్నాడు. ప్రియంవద నాయర్ వంకే చూస్తోంది. అతడ్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తోంది.
"మీవారు ఖచ్చితంగా అమ్మాయిలతో తిరుగుతాడన్నా నిర్దారణకు మీరు ఎలా వచ్చారు/"
"ఆయన అబద్దాలు ఆడ్డం వల్ల"
"వ్వాట్"
"అవునండీ. భార్యతో మగాడు ఎప్పుడు అబద్దం ఆడతాడు...డబ్బు విషయంలో, అమ్మాయిల విషయంలోనే కదా. ఆయన డబ్బు విషయంలో నాతో ఎప్పుడూ అబద్దం ఆడరు. నిజం చెప్పాలంటే ఆయనకు ఆ అవసరం లేదు. డబ్బు గురించి, వాటి లావాదేవీల గురించి నాకు ఎప్పుడూ చెప్పరు. నా పేరు మీద క్రెడిట్ కార్డు తీసారు. నాకు అవసరమైనవి కొనుక్కోమని చెబుతారు."
"సో..రెండో విషయంలో అంటే అమ్మాయిల విషయంలోనే అబద్దమాడతారని నిర్ధారణకు వచ్చారన్నమాట."
"దానికి చాలా కారణాలు వున్నాయి. ముఖ్యమైన కారణం..కొన్ని రోజుల క్రితం మాకు తెలిసిన ఒకాయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని ఆ రాత్రంతా హాస్పిటల్ లో వుండిపోయారు."
"అయితే.."
"నాలుగు రోజుల క్రితం ఆ తెలిసినాయన ఓ హాస్పిటల్ దగ్గర కనిపించాడు...స్కానింగులు చేయించుకుంటూ."
"అందులో మీవారిని తప్పుపట్టవలసిన అవసరం ఏముంది?"
"ఆ తెలిసినాయాన్ని 'ఎప్పుడెలా వుంది? బైపాస్ సర్జరీ జరిగిందా?' అని అడిగాను. దానికతను 'నాకు పుట్టినప్పటినుంచీ హెల్త్ ప్రాబ్లెమ్సే ...అయినా నాకు హార్ట్ ఎటాక్ యింకా రాలేదు. బహుశా రెండు మూడ్రోజుల్లో వస్తుందేమో' అని పరీక్ష చేయించుకోవడానికి హాస్పిటల్ కు వచ్చానని చెప్పారు. అంతే, ఆరోజు మావారు చెప్పినట్టుగా ఈయన హాస్పిటల్ లో లేరన్న మాటేగా"
"ఐసి..." అన్నట్టు తల పంకించాడు నాయర్.
|