TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 44
స్వప్న కంఠంనేని
ఆకాశం మబ్బులు పట్టి ఉంది. చల్లటి గాలులు చెట్ల ఆకుల్ని పలకరిస్తూ కొమ్మల మీంచి పరుగులు తీస్తున్నాయి.
వాతావరణం అంత హాయిగా ఉన్నా ఆమె దాన్ని ఎంజాయ్ చేయలేకపోయింది. వైభవ్ నిర్లక్ష్యం ఆమె మనస్సును ముళ్ళుగా పొడుస్తోంది. అంతలో వెనకనుంచి ఎవరో కేకేశారు.
"హనితా! హనితా! !!''
అతను రాజా, రొప్పుతూ పరుగెత్తుకుంటూ వస్తున్నాడు.
"ఏమిటి హనీ, ఇటెక్కడికి వెళ్తున్నావ్?''
"నా మనసెం బాగాలేదు. కాసేపు వంటరిగా ఉండాలనుకుంటున్నాను''
"నేను కూడా వస్తున్నాను పద''
"రాజా! చెప్పానుగా, కాసేపు వంటరిగా వదిలేయ్ నన్ను''
అప్పటికి వాళ్ళు కాంపౌండ్ గోడ దాకా వచ్చారు దగ్గరలో ఎవరూ లేరు. అక్కడో చెట్టు, ఇక్కడో చెట్టు. విశాలమైన నీడల్ని పరచుకుని కిందకి చూస్తున్నాయి.
"హనీ నీకు ఎప్పటి నుంచో ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను ...''
"ఏమిటి సంగతి?'' చెట్టుకి వెనక్కు ఆనుకుని నిలబడుతూ అన్నది హనిత.
"నేనొక అందమైన అమ్మాయిని ప్రేమించాను. నీకా సంగతి చెప్పాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను ...''
ఆ మాటలు వినగానే హనితలో మళ్ళీ ఎప్పటి మూడ్ వచ్చేసింది.
"నువ్వు ... ప్రేమిస్తున్నావా? ఎవరా అమ్మాయి?'' క్యూరియాసిటీతో చిలిపిగా చూస్తూ అడిగింది.
ఒక చేతిని ఆమె తలపై భాగాన చెట్టు మీద ఆనించి ఆమె మీదకు వొంగి చూస్తూ అన్నాడు రాజా.
"హనిత!''
ఉలిక్కిపడింది హనిత. అలాంటిది ఆమెకు ఊహకైనా అందని విషయం. ఆమె దృష్టిలో రాజా ఒక వ్యక్తిత్వమంటూ లేని అరపురుషుడు. తన తోటి గాళ్ ఫ్రెండ్స్ తో సమానంగా చూస్తోందతన్ని.
అలాంటివాడు తనను ప్రేమిస్తున్నానని అనేసరికి ఇన్ సల్ట్ గా ఫీలయింది.
"రాజా నువ్వు మెంటల్ హాస్పిటల్ లో చేరటం మంచిదనుకుంటాను'' అన్నది.
రాజా ఆమె మాటలు వినిపించుకున్నట్టుగా కనిపించలేదు. ఏదో మైకంలో ఉన్నవాడిలా చట్టుకానించిన చేతిని కిందకి జరిపి ఆమె తలను కదలకుండా పెట్టుకుని ముద్దు పెట్టుకోవడానికన్నట్టుగా ముందుకు వొరిగాడు.
హనితకతని మీద చాలా కోపమొచ్చింది.
"ఏమనుకుంటున్నాడతను తన గురించి?''
అతడి పట్టు నుంచి విడిపించుకుని అవతలకు జరగటానికి ప్రయత్నించింది. కాని కుదరలేదు. అతని భల్లూక పట్టునుంచి విడిపించుకాలేకపోయింది.
గింజుకోసాగింది హనిత.
అరుద్దామా అనుకుంది. కాని అంత వీరనారిలా పేరుబడ్డ తను బేలలా అరవటం సిగ్గుచేటనిపించింది.
ఈలోపు అతని మొహం ఆమె మొహానికి దగ్గరగా వచ్చింది. సరిగ్గా ఆ సమయంలో ఒక బలమైన చెయ్యి వచ్చి రాజా మెడమీద పడింది. షాక్ తగిలినట్టుగా అవతలికి గెంతాడు రాజా.
ఎదురుగా వైభవ్! అతని కళ్ళు నిప్పుల్ని కురిపిస్తున్నాయి.
"రాజా, ఇక్కడ్నుంచి వెళ్ళిపో!'' కోపంగా అరిచాడతను.
రాజా ఒకసారి వైభవ్ వేపూ మరోమారు హనితవేపూ చూసి చరచరా అడుగులు వేస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిపోయాక వైభవ్ హనితతో కోపంగా అన్నాడు.
"ప్రతి దాంట్లోనూ నేనున్నానంటూ తయారవుతావు. మగవాళ్ళకీ, ఆడపిల్లలకీ తేడా ఏమిటని వాదిస్తావు కదా. ఇప్పటికైనా తెలిసిందా తేడా ఏమిటో''
హనిత ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదు.
అలాగే వైభవ్ ని వింతగా చూస్తుండిపోయింది.
"అసలిదంతా రాజా, నువ్వూ కలిసి ఆడుతున్న నాటకం కాదు కదా'' సడన్ గా ఆలోచనవచ్చి అన్నాడు వైభవ్.
తన కోపమెవరిమీదో, ఎందుకో కూడా అర్థం కావటం లేదతనికి.
"ఎందుకు వైభవ్, అలా మాట్లాడతావు? ఎవరైనా కావాలని ఇలా చేస్తారా?'' అంది హనిత బాధగా.
"ఎవరైనా ఎందుకు చేస్తారూ? నువ్వంటే ఇలా చేసే రకానివి కాబట్టి అంటున్నాను. అయినా నేనిప్పుడు హెల్ప్ చేశానని రెచ్చిపోకు. ఇటువంటి పరిస్థితిలో రోడ్డు పక్కనుండే కుష్ఠు బిచ్చేగత్తె అయినాసరే నేను తప్పకుండా హెల్ప్ చేసేవాడిని. అంతేతప్ప, నువ్వంటే నాకేదో ప్రత్యేకమైన అభిమానమేమీ లేదు'' కటువుగా అన్నాడు వైభవ్.
అనేసి అక్కడ్నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. హనిత మొహం కత్తివాటుకి నెత్తురు చుక్క లేనట్టుగా పాలిపోయింది.
|