TeluguOne Services
Copyright © 2000 -
2025
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 45
స్వప్న కంఠంనేని
ఆ రోజంతా ఆ సంఘటన గురించే ఆలోచించాడు వైభవ్.
"ఎందుకో హనితను చూడగానే ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. కానీ పొద్దున్న అనవసరంగా తిట్టానామెని. మరీ అంత కఠినంగా మాట్లాడకుండా ఉండాల్సింది'' అనుకున్నాడు.
"అయినా ఆమేదో అన్నాడని నేను ఆమెని ఏదో ఒకటి అనటం, మళ్ళీ ఆమె నన్ననటం. చిన్నపిల్లల్లా ఏమిటిదంతా? రేపే ఆమెకి 'సారీ చెప్పేసి ఈ గొడవలకి పుల్ స్టాప్ పెట్టేస్తాను''
ఆ నిశ్చయానికొచ్చాక హాయిగా నిద్రపోయాడు. కానీ మర్నాడు పొద్దున్న ఇంటికి దగ్గరి బంధువులు రావటంతో వైభవ్ కాలేజీకి వెళ్ళే అవకాశం దొరకలేదు.
సాయంత్రం!
టైం ఏడవుతోంది. రాణీ ఫంక్షన్ ప్యాలెస్ కళకళలాడుతోంది. రంగురంగుల బల్బ్స్ వెలుగుతూ ఆ ప్రదేశమంతా వింత కాంతితో మెరిసిపోతోంది. ఆ రోజక్కడ సురేష్, సుధేష్ణల పెళ్ళి. అతిథులు ఒక్కొక్కళ్ళే చేరుకుంటున్నారు.
వైభవ్ అప్పుడే ఫంక్షన్ ప్యాలెస్ లోకి అడుగుపెట్టాడు. రాగానే ముందు వెళ్ళి సురేష్ ని కలిశాడు. తర్వాత బయటికొచ్చి క్లాస్ మేట్స్ కోసం చూశాడు. పెళ్ళి పందిరికి ఎడమవేపున వేసి ఉన్న కుర్చీల్లో కూర్చున్నారతని క్లాస్ మేట్స్. వాళ్ళతన్ని చూడగానే చేయి వేవ్ చేసి పిలిచారు.
చిరునవ్వు నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు వైభవ్. అతని నవ్వు చూసి పెళ్ళికొచ్చిన ఆడపిల్లలు ఒక్క క్షణం స్టన్ అయిపోయారు.
వైభవ్ నవ్వగానే వెయ్యి వోల్టుల బల్బు వెలిగినట్టయింది. వెయ్యి క్యాండిల్స్ ఒక్కసారే వెలిగించినట్టుగా అనిపించింది వాళ్లకి.
వాళ్ళ గుండెలు లయ తప్పి కొట్టుకోసాగాయి.
మీనాతో పాటు క్లాస్ మేట్స్ అందరూ అక్కడే ఉన్నా హనిత మాత్రం లేకపోవటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
మీనాని అడుగుదామనుకున్నాడు.
మళ్ళీ 'ఎందుకులే? కొంచెం లేట్ గా వస్తుందేమో!' అనుకున్నాడు.
కానీ మరో అరగంట గడిచినా హనిత అక్కడికి రాలేదు.
వైభవ్ కి అసహనంగా అనిపించింది. ఇబ్బందిగా అటూ ఇటూ కదిలాడు. మీనాని అడగాలని ఉందతనికి. కానీ మళ్ళీ అడగాలంటే బింకం అడ్డొస్తోంది. చివరికి 'ఏమైతేనేంలే' అని మీనాని అడిగేయబోతుండగా మీనా "హాయ్ హనీ!'' అంటూ లేచింది.
గభాల్న వైభవ్ కూడా మీనా చూసిన వేపుకి చూశాడు. ఒక్క క్షణం అతనికి కళ్ళు జిగేల్ మన్నాయి. డార్క్ గ్రీన్ కలర్ పట్టుచీర కట్టుకున్న హనిత అప్పుడే లోపలికొస్తోంది.
దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతలా ఉందామె. ఇంతలోనే హనిత పక్కనున్న అందగాడిని చూసి వైభవ్ భ్రుకుటి ముడిపడింది.
'హనిత పక్కనున్న దెవరబ్బా' అనుకున్నాడు. సురేష్, సుధేష్ణలను కలిసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చినంత హడావుడిగా వెనక్కి వెళ్ళిపోయింది హనిత.
తర్వాత మీనా వచ్చి వైభవ్ పక్కన కూర్చుంది. వైభవ్ మీనాని ఆరాగా అడిగాడు.
"ఎవరతను మీనా?''
"ఎవరూ?''
"అదే. హనితతో పాటు వచ్చినతను''
"ఓ! నీకు తెలీదు కదూ, నిన్ననే హనిత ఎంగేజ్ మెంట్ అయింది. అతను హనిత ఉడ్ బి'' చెప్పింది మీనా.
నోటమాట రాలేదు వైభవ్ కి. హతాశుడయ్యాడు. ఫ్రెండ్సంతా తలా ఒక జోక్ పేలుస్తున్నారు. వైభవ్ కి నవ్వు రావటంలేదు.
"హనిత నాది. నా స్వంతం'' అన్న భావన వచ్చేసిందతనిలో. ఆ తర్వాత ఇక అతను పార్టీని ఎంజాయ్ చేయలేకపోయాడు.
|