Antera Bamardee 8

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

ఎనిమిదవ భాగం

హైదరాబాద్ ఆశోక్ నగర్లో...అదొక పాతకాలపు డాబా ఇల్లు. కొత్త రోజుల్లో ఆ డాబా గొప్ప డాబు సరిగా వుండేదేమో!ఇప్పుడు అంత డాబుగా లేకపోయినా దీనంగా మాత్రం లేదు. ఆ ఇంటి ముందు ఒక ఆటో ఆగింది.

అందులోంచి వేణు దిగేడు. డబ్బులిచ్చి ఆటోని పంపించి ఇంట్లో అడుగు పెట్టేడు"అక్కా"అని పిలుచుకుంటూ.

వేణును చూడగానే అన్నపూర్ణ ఆత్రంగా అడిగింది. “వెళ్ళిన పని ఏమైందిరా ? పండా కాయా ?”అని. వేణు నీరసంగా సమాధానం చెప్పాడు.

“పండే!ఇంటర్వ్యూలో సెలెక్టయ్యేను!”అని.

ఆ మాటకి అన్నపూర్ణ ఆనందపడిపోతూ అన్నది. “అబ్బ...ఎంత మంచి వార్త చెప్పేవురా తమ్ముడూ.మీ బావగారు క్కూడా చెప్పు.సంతోషిస్తారు "అని. వేణు మరింత నీరసంగా అన్నాడు

"కానీ,ఆ ఉద్యోగం నాకిష్టం లేదు"అని. ఆ మాటకి అన్నపూర్ణ ఎంతో షాకు తిని "ఇష్టం లేదా?లక్షణమైన ఉద్యోగంరా!ఇష్టం లేదంటావేమిటి?” అన్నది.

“మీకు దూరంగా ఎక్కడో నాగపూర్లో బతకాలంటే దిగులుగా వుండే అక్కా "అన్నాడు వేణు.

“ఇంకానయం.ఈ మాట నాతో అంటే అన్నావు గానీ,మీ బావగార్తో అనకు!తల బద్దలు కొట్టుకుంటారు.”

సరిగ్గా ఆ మాట మీదే రంగప్రవేశం చేసేడు బావగారు. ఆ బావగారి పేరు రంగనాథం. స్నానం పూర్తయిన కారణంగా మొలకి లుంగీ కట్టుకున్నాడు. భుజమ్మీద టర్కీటవలు కప్పుకున్నాడు. టవల్ తిప్పుకుంటూనే నిప్పులు కక్కుతున్నాడు. “అంతేనే అంతే.నేను తిక్క సన్నాసిని.పరమ తిక్క వెధవని.అంచేత నా తల నేనే బద్దలు కొట్టుకుని మీ యావన్మంది తలలు బద్దలవ్వకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాను.తిక్క వెధవని కదా.అది నా హాబీ అన్నమాట "అన్నాడు ఆ బావగారు.

“అదికాదు బావా "వేణు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.

“నువ్వు నోర్మోయ్!నీ సంగతి నాకు తెలీదా.అక్కకి తగ్గ తమ్ముడివి.అది ఆర్మణీ.నువ్వొక తబలా!మీకు ఆవేశం ఎక్కువ.శాంతంగా బతకడం తెలీదు.ప్రశాంతంగా ఆలోచించడం అస్సలు తెలీదు.మీ యిద్దరికీ ఈ రెండు లక్షణాలూ లేవు.అది వాయిస్తుంది! నువ్వు మోగిస్తుంటావ్!నువ్వు చెప్పేదేదో శాంతంగా చెప్పివుంటే మీ అక్క ప్రశాంతంగా ఆలోచించేది.ఇపుడు చెప్పు.చెప్పదలుచుకున్నదేదో శాంతంగా ప్రశాంతంగా చెప్పు.ఆవేశపడకుండా అర్థమయ్యేలాగా చెప్పు "వేణు ఏదో చెప్పబోతుండగా రంగనాథం అడ్డం పడి తానే చెబుతున్నాడు.

“ఆగు...నీకు తొందరెక్కువ.అంచేత నువ్వు చెప్పదలుచుకున్నది నేను ప్రశాంతంగా చెబుతా. నాగపూర్లో ఉద్యోగం చేయడం నీకిష్టం లేదు.అంతేగదా.అదట్లావుంచు.నువ్వు మమ్ముల్ని విడిచిపెట్టి నాగపూర్ వెళ్లడం నాక్కూడా యిష్టం లేదు "అన్నాడు.

బావగారి అభిప్రాయానికి వేణు ఎంతో ఆనందించేడు. అందువల్ల ఆనందంగా అక్కతో అంటున్నాడు. “విన్నావా!బావక్కూడా ఇష్టం లేదట !” అన్నపూర్ణకి తన భర్త మీద,తమ్ముడి మీదా కోపం వచ్చింది.అందువల్ల భర్తని విడిచిపెట్టి,తమ్ముడిని కోపంగా ప్రశ్నించింది.

“అలాంటప్పుడు అసలు నువ్వు ఇంటార్వ్యూకి ఎందుకు వెళ్ళేవురా?” రంగనాథం అరిచేడు.

“చంపుతా!ఏదైనా అడగాలనుకున్నప్పుడు శాంతంగా అడగాలి.వాడు ఇంటార్వ్యూ వంకమీద నాగపూర్ చూడటానికి వెళ్లేడు.తప్పా ?”అని.

బావగారు తనకిస్తున్న సపోర్టుకి కడు సంతోషిస్తూ అక్కతో అన్నాడు "బావని చూసైనా నేర్చుకోవే. బాగుపడతావ్"అని. ఇప్పుడు రంగనాథం బామ్మర్ది మీద మండిపడ్డాడు.

“నువ్వు నోర్మూయ్.ఆ పని మీ అక్క వల్ల కాదు.మా పెళ్ళయిన దగ్గర్నించీ గమనిస్తున్నాను. నాకున్న శాంత స్వభావం మీ అక్కకు లేదు "అని వెంటనే భార్యతో అన్నాడు. “చూస్తూ నిలబడతావే.నాగపూర్నుంచి వచ్చేడు.బాగా అలసిపోయి వుంటాడు.ముందు వాడి స్నానానికి ఏర్పాట్లు చూడు.వెళ్ళూ "అన్నాడు.

ఈ వరస ఆ యింట్లో ఎప్పుడు ఇదే విధంగా సాగుతుంది.సమస్య చిన్నదైనా పెద్దదైనా బాణీ మాత్రం మారదు గాక మారదు.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)