Antera Bamardee 7

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

ఏడవ భాగం

అది ఖరీదైన కారు. అది ఖరీదైన రోడ్డు మీద పరుగెడుతుంది. ఖరీదైన రోడ్లు రాష్ట్ర మంతటా వున్నాయంటే ఎవరూ నమ్మరు.

హైదరాబాద్ లో కొన్ని రోడ్లు ఖరీదుగా వుంటాయని చెబితే కాబోసనుకుంటారు! కాబోసనుకునే రోడ్లలో అదొకటన్నమాట! కారు ఆ రోడ్డు మీద పరుగెడుతోంది. ఆ కార్లో బసవరాజున్నాడు.అతను కార్లో వున్నా అతని మనసంతా ఉమ మీద వున్నది.

ఉమని పెళ్ళికి వెళ్లొద్దని చెప్పడం సబబా కాదా అని ఆలోచిస్తున్నాడు. క్షణం సేపు సబబనిపిస్తోంది.క్షణం తర్వాత కాదనిపిస్తోంది. అవునూ కాదనే సమయాల్లో అతను బొమ్మా బొరుసు మీద ఆధారపడుతాడు.ఈ అలవాటు అతనికి పాతికేళ్ళ క్రితం తగులుకుంది.

పాతికేళ్ళ క్రితం...

బసవరాజు జానకిని పెళ్ళాడే ముందు ఈ పెళ్లి తన జీవితాన్ని సుఖమయం చేస్తుందో,ముదనష్టం చేస్తుందో తెలుసుకుందామని జేబులోంచి రూపాయి బిళ్ళని తీసుకున్నాడు.

బొమ్మ పడితే సుఖమయం.బొరుసు పడితే ముదనష్టం అనుకుని టాస్ వేసేడు. బొమ్మ పడింది. జానకిని పెళ్ళాడటానికి గల అనేకమైన కారణాల్లో బొమ్మ పడటం ముఖ్యమైన కారణంగా చెప్పుకుంటాడు.

ఆనాడు బొమ్మ పడింది గనక తన వైవాహిక జీవితం సుఖమయంగా నడుస్తోందని యిప్పటికీ అనుకుంటూ వుంటాడు. అంచేత...ఉమని పెళ్ళికి పంపించడమనే కార్యక్రమాన్ని బొమ్మ బొరుసుతో ముడిపెట్టి టాస్ వేసేడు. బొమ్మే పడింది. అందుచేత ఉమని పెళ్ళికి పంపించడం ఉచితంగా వుంటుందని భావించేడు.

కారు బసవరాజు అండ్ కంపనీ ముందు ఆగింది. బసవరాజు కారు దిగేడు.దిగీ దిగంగానే డ్రైవర్తో అంటున్నాడు.

“రంగా!కారుని ఇంటికి తీసుకెళ్ళు.ఉమని ఈ కార్లోనే పెళ్ళికి తీసుకెళ్ళు !”అన్నాడు. ఆ మాటకి రంగడు ఆనందిస్తూ అన్నాడు.

“చిత్తం!ఈ ముక్క యింట్లోనే చెప్పి వుంటే బావుండేదేమోనండయ "అన్నాడు డ్రైవర్.

“సలహాలోద్దు.చెప్పింది చెయ్యి.ఉమని జాగ్రత్తగా తీసుకెళ్ళు "

“చిత్తం !మల్లెపూవు మాదిరి తీసుకెళ్ళి మందార పూవు మాదిరి తీసుకొస్తానండయ "

“వద్దు "

“చిత్తం "

“ఉమని ఉమ లాగానే తీసుకెళ్ళి ఉమ లాగానే తీసుకురా "అని బసవరాజు ఆఫీసులోకి వెళ్ళిపోతున్నాడు.

డ్రైవరు కారు స్టార్టు చేసేడు.

బసవరాజు ఆఫీసు ప్రవేశం చేస్తుండగా...అక్కడ సిబ్బంది యావన్మందీ గౌరవ సూచకంగా లేచి నిలబడుతున్నారు.వాళ్ళందర్నీ ఓరకంట చూస్తూ బసవరాజు 'ప్రోప్రటయిర్'అని బోర్డు తగిలించి వున్న గదిలోకి వెళ్ళిపోతున్నాడు.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)