అమ్మో అమ్మాయిలు 38

Listen Audio File :

వ్యాకర్ణ నవ్వు విని గాంధీహిల్ మీద వున్న కొన్ని పక్షులు ఎగిరిపోయ్యాయి ఓ చీమలబారు ఉరుములతో వానొస్తుందనిగబగబ పుట్టలోకి దూరాయి. రెండు మూడు రాళ్ళు దొర్లిపడ్డాయి. దుమ్ము ఎగిరిపడింది. వాయుదేవుడు భయపడి తూర్పువైపు నుంచి పడమరకి తిరిగాడు.

“ఇదేం నవ్వు! ఇదేం నాటకం!” అన్నట్లు కోపంగా చూసింది జయచిత్ర. జయచిత్ర కోపానికి ఊళ్ళో చాలాచోట్ల కరెంట్ పోయింది.

“అమ్మ...... అబ్బ.......... ఎంత అపార్ధం చేసుకున్నావు, జయచిత్రా! ఇది అబ్బులుగాడు రాసిన ప్రేమలేఖ" ఆ మాత్రం గ్రహించలేదా! ఇది వాడి హేండ్ రైటింగ్" అన్నాడు వ్యాకర్ణ నవ్వాపేసి.

“ఏంటీ?” అని ఆశ్చర్యపోయి. ముఖం నిమ్మకాయంత చేసుకుని మళ్ళీ కోపం తెచ్చుకుని "అబ్బులు నాకెందుకు ప్రేమలేఖ వ్రాయాలి? అబ్బులికి బుద్ధిలేదు. మీకు లేదు, అబ్బులు నాకు ప్రేమలేఖ రాస్తే కోపగించుకొవ్వాల్సింది పోయి, అదేదో ఘనకార్యం అన్నట్లు నవ్వుతారా?” అని యింతెత్తు ఎగిరి పడింది జయచిత్ర.

వ్యాకర్ణ మరోసారి యిందాక నవ్వినట్లే నవ్వాడు. నవ్వి.... “అబ్బు ప్రేమలేఖ రాసింది నీకు కాదు. బిందురేఖకి, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. నాకు తెలుసు" అన్నాడు.

అనుమానం తీరని జయచిత్ర "ఈ ఉత్తరం నా చేతిలో ఎవరు పెట్టారు?” అంది.

“వాడే" అన్నాడు వ్యాకర్ణ.

“ఏంటీ నాటకం?” గయ్యిమంది జయచిత్ర.

“అబ్బునాధం రాత్రి భూతద్దాలు లేకుండా ఈ ఉత్తరం పట్టుకుని మీ వరండాలోకి వచ్చి వుంటాడు. కంగారులో బిందురేఖ చేతిలో పెట్టాల్సింది నీ చేతిలో పెట్టాడు. వాడి ధర్మమా అని నా జయ హృదయం బయటపడింది. క్షమిస్తానంటే ఇంకో కథ" అన్నాడు వ్యాకర్ణ.

“ఊ చెప్పండి" బుంగమూతి పెట్టి కోపంగా అంది జయచిత్ర.

“నన్ను పెళ్ళి చేసుకోమని అమ్మా నాన్న బలవంతం.నే చేసుకోమనినని భీష్మించుకొన్నాను. వారు విసిగి వేసారిపోయ్యారు. ఓ రోజు అంటే మీ యింట్లో చేసిన రెండు వారాలకి మా నాన్నగారి వద్దనుంచి లెటర్ వచ్చింది. పెళ్ళి విషయంలో నిన్నేం బలవంతం పెట్టము. నీ కొత్త అడ్రస్ చూశాను. ఆ యింటివారికి ఓ అమ్మాయి వుంది. పేరు జయచిత్ర. ఓ స్నేహితుడు వాళ్ళ సంబంధం చెప్పాడు. పిల్ల నచ్చితే రాయి లేకపోతె లేదు. నీ ఇష్టానుసారం నీ ఇష్టమొచ్చినప్పుడే పెళ్ళి జరుగుతుంది" ఇది లెటర్ లో సారాంశం.

నాన్నగార్కి తొందరపడవద్దని లెటర్ రాసి ఈ దేవిని ఎలాగూ ప్రేమించా గాబట్టి దేవి ఆజ్ఞకోసం ప్రేమభిక్ష ఎప్పుడు పెడుతుందా అని ఓర్పుగా వేచి ఉన్నాను ఈ మధ్యని పరీక్ష తాలుకూ కోపం, రుసరుసలు చూసి నన్ను ప్రేమించటం లేదేమో అని భయపడ్డాను. భయంతో అడుగు ముందుకేం వేయగలను? అబ్బూ దయం వల్ల లైన్ క్లియరయింది. ఇప్పుడు ఓ అడుగు ముందేకేస్తాను. కోప్పడకు జయా?” అన్నాడు వ్యాకర్ణ.

“అబ్బ మీకో కథ వుంది! మీరెంత మంచివారండీ!” మిమ్మల్ని ప్రేమించాను అని ఒక్కమాట చెప్పుజయా!”

“మగాడివి, ధైర్యం చేసి మీరు చెప్పలేదు గాని నేను చెప్పాలా?”

“చెప్పితే కోప్పడతావాయె.”

“కోప్పడనుగా!”

“ఐ లవ్ యు జయా!”

“ఐ... లవ్.... యూ..... కర్ణా!”

ఆ తరువాత యిద్దరూ సిగ్గుపడి సంతోషపడి ఎలాగో అలా సర్దుకుని మామూలు మనుషులయ్యారు. “డ్యూయెట్ పాడితే బాగుంటుంది కదూ జయా!” వ్యాకర్ణ.

“వద్దు, గాంధీహిల్ మీద పాడకూడదు. కాశ్మీర్గాని సిమ్లాగాని వెళదాం" అంది జయచిత్ర.

కాసేపు మనసులు విప్పుకుని (భాషాదోషం) ప్రేమగా మాట్లాడుకుని జంటగా కొండదిగి వచ్చారు వ్యాకర్ణ జయచిత్ర, జయచిత్ర వ్యాకర్ణను నాన్నమ్మ దగ్గరకు లాక్కెళ్ళి ఆశీర్వదించమని కాళ్ళమీద పడి జరిగిన కథ చెప్పారు. బామ్మగారు ఏంతో సంతోషించి "పడిరి పిడుగుల్లారా! ఇద్దరు పెళ్ళి వద్దని మాకు తెలియకుండా పెళ్ళిదాకా వచ్చారా!” అని ఆశ్చర్యపడుతూ ముళ్ళకిరీటం సవరించుకున్నారు.