అమ్మో అమ్మాయిలు 37

Listen Audio File :

ఆ సాయంత్రం. టిప్ టాప్ గా తయారయి వ్యాకర్ణ గాంధీహిల్ కి, అబ్బులు ఊర్వశికి దారిపట్టారు. జయచిత్ర, బిందురేఖ ఎప్పుడో యింట్లోంచి బయటికి కెళ్లారు. గాంధీ హిల్ మీద ఓ పక్కగా చదునుగా వున్న చోటు చూసుకుని వ్యాకర్ణ, జయచిత్ర కూర్చున్నారు. మంచిగా మాట్లాడి వ్యాకర్ణ నిజస్వరూపం తెల్సుకోవాలనుకుంది జయచిత్ర, చిరునవ్వుతో వ్యాకర్ణని చూసింది. ఆ చూపుకి అయిసయిపోయాడు వ్యాకర్ణ

"హా.. నిజమా! హా... నా...... చిత్రా!” అనుకున్నాడు.

“మీకు నిజంగా నా మీద ప్రేమవుంటే ఒక్క మాట దాయకుండా నిజం చెప్పాలి చెబుతారా?” అంది జయచిత్ర.

“అంతా నిజమే చెబుతాను. అబద్ధమాడను" కోర్టులో ప్రమాణం చేసినట్లు అన్నాడు వ్యాకర్ణ.

“నా గురించి మీ అభిప్రాయం ఏమిటి? నన్నెప్పటి నుంచి ప్రేమిస్తున్నారు? నన్సు గ్లాసులో ఎన్ని ఔన్సులవరకు ప్రేమ నింపారు?” అని అడిగింది.

“అంతా నిజం చెపుతాను, అబద్ధమాడను. కాని ఒక్క మాట నన్ను మీరు ఎంత ఘాటుగా ప్రేమించింది, నాలో ఏం చూసి వగైరాలు మీరు నిజం చెప్పాలి.”

“అలాగే."

“అయితే అంతా నిజమే చెపుతాను. మీ యింటికి అద్దెకొచ్చినప్పుడే మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే నా కళ్ళముందు ఓ మెరుపు మెరిసింది. అది ప్రేమని అప్పుడు తెలియదు. మీ రూపం మీ మాటల ఆకర్షణకి పూర్తిగా ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలనుకున్నా జయా! నీ రూపం నా హృదయం నిండా ఆశ్రయించుకుంది నీ మాటలు నా కడుపు నింపాయి. అబ్బులుగాడు చెప్పినట్లు నే కవిత్వం చెప్పలేను. నిన్ను మనసారా ప్రేమించాను జయా!” అన్నాడు వ్యాకర్ణ.

“ఇది ప్రేమ, మరి పెళ్ళి మాట?”

“నువ్వు ఊ అను, తాళిబొట్టు తాడుతో సహా ఎదురు నిలుస్తాను.”

“కట్టుబట్టలు తప్ప నాతో కానీ కట్నంరాదు.”

“నీవు కట్నం యివ్వకపోతే తాళి కట్టనని అనలేదే. కావాలసింది కట్నం కాదు నీవు. కట్టుబట్టలు తప్ప ఏమీ తీసుకురానంటావ్? అవి మాత్రం దేనికి! మన పెళ్ళయిన తర్వాతే నేకొంటాను.”

“ఏయ్ పోకిరీ మాటల మాట్లాడకు.”

“మాటలాడను.”

“ఇంత ప్రేమ నా మీద వుండి ఎప్పుడూ బయటపెట్టలేదేం?”

“ఎలా పెట్టను! నీ మనసులో ఏముందో తెలియదు నా మీద ప్రేమున్నట్లు తెలిస్తే కదా? నేనేదయిన తెగించి చేయడానికి సారీ నీ మాటలు చూపులు నామీద ప్రేమతో కూడివుండాలి, అంతలో రుసరుసలు తీక్షణ వీక్షణాలు, నీవు నన్ను ప్రేమించలేదనుకో, నేను తొందరపడి ప్రేమించానని చెపుతాననుకో, అప్పుడేమవుతుంది?”

“అదీ మీరే చెప్పండి.”

“పాత చెప్పు తీసుకుంటావు. సమయానికి అది లేకపోతె బజారు పరుగెత్తి కొత్త చెప్పులు కొనుక్కొచ్చి ఎడా పెడా వాయిస్తావు.”

“ఆమాత్రం యింగింతం వుంది కదా?”

“ఉంది, ఇహ నీవు నన్నెప్పటినుంచి ప్రేమించింది చెప్పు జయా!”

“చెపుతాను, చెప్పి పాయింట్ కోస్తాను. మీలాంటి రూపంగల యువకుడు భర్తగా వుంటే బాగుండునని చాలాసార్లు అనుకున్నాను. ఉన్నంతలో పోకిరీ వేషాలు లేకుండా మంచిగానే వున్నారు. అది ఆకర్షించింది. ఇదిలా వుండగా మా నాన్నమ్మ వూరికెళ్ళింది. ఎందుకంటే మా నాన్నగారొక పెళ్ళి సంబంధం చూశారుట. అది మాట్లాడటానికి, పెళ్ళి చూపులు, పెళ్ళికొడుకు ముందు తలొంచుక్కూర్చోవటం చేయను. పెళ్ళికొడుకు కట్నం అడగరాదు.

అయినా ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు. అని నాన్నమ్మ చేత మా నాన్నగారికి కబురంపాను. నాన్నమ్మ నాన్నగారు ఓ కబురు నా కందజేసింది.

“పెళ్ళికి నిన్నేమీ బలవంతం చేయము. నా స్నేహితుడి, స్నేహితుడి కొడుకు విజయవాడలో వున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మంచిది. కుర్రాడు బుద్ధిమంతుడు. పిల్లాడికి పెళ్ళి చేయాలని వాళ్లనాన్నగారు ఎన్ని విధాల బలవంతంచేసినా, నా కిష్టం వచ్చిన పిల్ల నా కిష్టమైన నాడు చేసుకుంటాను. పెళ్ళికేం తొందర అని భీష్మించుకుని కూర్చున్నాడట. ఆ పిల్లవాడి అడ్రసు, ఫోటో యిస్తాను చూడు, నా కెందుకో ఆ పిల్లవాడు నచ్చాడు. వాళ్ళ ఫామిలీ మంచిది ఇది నాన్నగారి కబురు. నాన్నమ్మ చేత అడిగాడి ఫోటో కూడా పంపారు.”

“ఆ పిల్లగాడు నాకన్నా బాగుంటాడా?” ఆతృతగా అడిగాడు వ్యాకర్ణ.

“ఓ చాలా బాగుంటాడు" కళ్ళు తిప్పుతూ చెప్పింది జయచిత్ర.

నీరు కారిపోయాడు వ్యాకర్ణ "కొంపదీసి వాణ్ణి ప్రేమించారేమిటి?” అన్నాడు.

“ఉండండి. ఇంకా ఆ పాయింట్ కి రాలేదు. సరే, ఆ కుర్రాడెవడో తెల్సుకున్నాను. పరీక్ష చేయటానికి ఎన్నో రకాలుగా ఆడించాను. ఎన్నోసార్లు ఆడించాను. షేమ్ చేశాను. కోపం ప్రదర్శించాను. అనవసరంగా కల్పించుకుని పోట్లాడి నానా మాటలన్నాను అన్నింటికీ చిరునవ్వే. ఓ ఓర్పు ఆ శాంతం చూసి నేనెంత యిదయ్యాను.”

“ఛీ వాడు మనిషి కాదు" గొణుకున్నాడు వ్యాకర్ణ.

“అతగాడు మామూలు మనిషి. నా ప్రేమ పరీక్షలో నెగ్గలేదు. రాత్రి బండారం బైటపడింది" అని వూరుకుంది జయచిత్ర.

“వాడేం చేశాడు వాడి బండారం బైటపడడంవల్ల ఈ ఉదయం నుంచి నన్ను ప్రేమించటం మొదలు పెట్టాడా?” బొంగురు స్వరంతో అడిగాడు వ్యాకర్ణ.

“ప్రేమలేదు, దోమలేదు, రాత్రి ఆ సంఘటన జరిగిందగ్గరనుంచీ నా హృదయం మండిపోతున్నది. మా నాన్నగారు, మా నాన్నమ్మ చేతికిచ్చి పంపిన ఫోటో మీది. అడ్రస్ మీ పాతింటిది. మా నాన్నమ్మని మాట్లాడవద్దని చెప్పి ఎన్ని విధాలుగానో పరీక్ష చేశాను. పరీక్షలో నెగ్గారు. గెలిచారు. కాని రాత్రి మామూలు మనిషనిపించుకున్నారు. సెక్స్ సినిమాకి రమ్మని ఉత్తరం రాసి, నా చేతిలో పెట్టి పారిపోతారా? అలా అడగటానికి ఆ పని చెయ్యటానికి, ఎలా సిగ్గులేకపోయింది?” ఆవేశంగా గబగబ అంది జయచిత్ర.

“సెక్స్ సినిమా ఏంటి? ఉత్తరం ఏమిటి? రాత్రి పారిపోవటం ఏమిటి?” తెల్లబోయి అడిగాడు వ్యాకర్ణ.

“ఈ ఉత్తరం చూడండి. మీకే తెలుస్తుంది.” అని వ్యాకర్ణ మీదకు విసిరేసింది ఆ ఉత్తరాన్ని.

వ్యాకర్ణ అది చదివి గాంధీహిల్ అంతా ప్రతిధ్వనించేటట్లు నవ్వాడు.