అమ్మో అమ్మాయిలు 45

Listen Audio File :

బిందురేఖ ఇలా చెపుతోంది "ఒకానొక ఆంధ్రదేశం లో ఒకానొక తెలుగు నవల రచయిత్రి తన నవల లన్నింటిలో కళ్లభాషని గుప్పించి రాసింది. అదెలా వుంటుందంటే ఒక అమ్మాయి ఓ యింటికి వచ్చి "అద్దెకిచ్చే భాగాలు ఏవైనా మీ యింట్లో వున్నాయా!” అని యింటి ఓనరుని చూపులతో అడుగుతుంది.

“లేవు అమ్మాయీ! నిన్ననే ఓ భాగం ఖాళీగా వుంటే ఎవరికో యిచ్చేశాను" అని కళ్ళతో చెపుతాడు ఆయన. ఈ చూపుల భాష మొదట్లో జయచిత్రకి, బిందురేఖకి అయోమయంగా అనిపించింది. నోరు కుట్టేసుకుని కళ్లతో మాట్లాడటం యిప్పుడిప్పుడే ప్రాక్టికల్ గా చేసి చూస్తున్నారు వీళ్ళు. అది విషయం.

“పిండి వడియాలు ఎలా పెట్టాలే పిల్లా!” మరోసారి రెట్టించి అడిగింది బామ్మగారు.

“పిండి వడియాలు పెట్టటం చాలా తేలిక బామ్మగారూ! ఇల్లన్న తర్వాత ఏదో ఒక పిండి వుంటుంది కదా! అలాగే మినప వడియాలో, గుమ్మడికాయ వడియాలో యింట్లో వుంటాయి. ఎటొచ్చీ చేయవలసింది ఏమిటంటే ఏదో ఒక పిండి తీసుకుని దాంట్లో కాసిని వడియాలు వేసి రెండు బాగా కలిపి పెట్టవే పిండి వడియాలు" ఏ మాత్రం జంకకుండా చెప్పేసింది బిందురేఖ.

“ఆసి నీయిల్లు బంగారం కానూ!” అంటూ బామ్మగారు పెద్ద పెట్టున నవ్వారు. అక్కడితో వూరుకోక "నీ పెళ్ళికి ఈ వడియాలే పెట్టిస్తాలే" అన్నారు పకపకలాడుతూ.

రాంగ్ స్టెప్ పడినట్లు జయచిత్ర, బిందురేఖ గుర్తించారు. బామ్మగారి ముందు నుంచుంటే మర్యాద దక్కదని అక్కడనుంచి పరుగు తీశారు.

“ఇప్పుడే నా కళ్ళముందు వున్నారు. ఇంతలోనే ఎలా మాయం అయారబ్బా!” అంటూ బామ్మగారు బోలెడు ఆశ్చర్యపోయారు. మొత్తానికి అటు వ్యాకర్ణ, అబ్బులు ఇటు జయచిత్ర, బిందురేఖలు తమ బాధలు అర్థం చేసుకున్నారు. పెళ్ళి లోపల ప్రేమించుకోటానికి టైముందని చాలా ఆనందించారు.

బులిబులి కోపాలు ఆడవాళ్ళకి వస్తే బ్రతిమిలాడి లాలించి బుజ్జగించి ఆ కోపాన్ని పారద్రోలటం మగవాళ్ళ వంతు కాబట్టి జయచిత్ర, బిందురేఖ యింకా కోప గృహంలోనే ఉత్తుత్తి కోపం అభినయిస్తూ వున్నారు. వాళ్ళతో మాట్లాడుదామంటే వ్యాకర్ణకిగాని అబ్బులుకిగాని అవకాశం చిక్కటం లేదు. అలా చిక్కకుండా అమ్మాయి లిద్దరూ తప్పించుకుంటున్నారు.

“ఇలా అయితే ఎలారా అబ్బూ!” ఓ రోజు వ్యాకర్ణ దిగులుపడుతూ అడిగాడు.

“ఎలా అయితే ఇలా?” అబ్బులు అద్దంలో ముఖం చూసుకుంటూ అడిగాడు.

“ముందు ఆ ముఖం అద్దంలోంచి తొలగించు" అన్నాడు వ్యాకర్ణ.

“అద్దంలో నా ముఖం వుండటం తప్పా?” అబ్బులు పిడివాదంలో దిగుతూ అన్నాడు.

“తప్పని కాదురా. అద్దంలో నీ ముఖం నీవు చూసుకుంటున్న.......”

“నా ముఖం గాక నీముఖం చూడనా?”

“అది కాదురా అబ్బూ! నా మాట సాంతం విని మాట్లాడు.”

“అఘోరించు.”

“మనం మన వాళ్ళని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలియక నేను దిగులు పడుతూ, నీవు చిరాకు పడుతూ వున్నాము కదా!”

“అయితే?”

“ఇలాగే నెలా ఇరవై రోజులు గడిచిపోతుందేమోనని నా భయం.”

“ఇలా అయితే అలాగే రోజులు వెళ్ళిపోతాయి.”

“మరెలా?” “దానికో ఉపాయం ఆలోచించాను.”

“మా నాయన కదు, మా బాబు కదు, మా తండ్రి కదు, తొందరగా చెప్పరా.”

“మనిద్దరం పక్కపక్కనే వుండి జయచిత్రకి బిందురేఖకి కనపడుతున్నాము. దాంతో అల్లరి అమ్మాయిలు మనిద్దరిని ఆటపట్టిస్తూ చిరచిరలు రుసరుడలు ప్రదర్శిస్తున్నారు. కనుక మనం విడిపోవాలి.”

“నీకేమన్నా పిచ్చిపట్టిందిరా అబ్బూ! వెనుకటికి నీలాంటివాడే పిచ్చి కుదిరించి రోకలిబండ నెత్తికి చుట్టండి అన్నాడట. వాళ్ళు కోపంగా వున్నారని మనం విడిపోతామా! ఆరు నూరైనా నూరు ఆరైనా మనం విడిపోయే ప్రసక్తి లేదు.” అబ్బులు పెద్దగా నవ్వుతూ అద్దంలో చూసుకున్నాడు.

“వీడికి మతిగితి చలించలేదు కదా!” అని హడాలిపోయాడు వ్యాకర్ణ.

“వెర్రి కర్ణా! విడిపోవటం అంటే శాశ్వతంగా కాదు. ఎవరి దోవన వారు ప్రేయసిని కల్సుకుని ప్రేమ సంభాషణ సల్పటం అని అర్థం.”

“నా శార్థం" అని చిరాకుపడ్డాడు వ్యాకర్ణ. “అలా చిరాకు పడకు. అమ్మాయిలిద్దరూ పక్క పక్కనే వుండటం వల్ల మన్ని చూసి సిగ్గుపడటం లేదు. ఒంటరిగా వాళ్ళని కల్సుకున్నామనుకో సిగ్గుపడతారు. అప్పుడప్పుడు మనం... మనం అంటే నేనుగాని నీవుగాని సారీ చెప్పేస్సి సరదా కబుర్లలోకి దిగుతాము. అలా అలా మన సంభాషణ ప్రేమలోకి దిగుతుంది...”

అబ్బులు చెపుతుంటే సాంతం వినకుండానే మధ్యలో "హుర్రే" అని ఆనందంగా అరిచి "నీ బుర్ర బుర్ర కాదురా అబ్బూ! ఎంత మంచి ఆలోచన నీ బుర్రకి తట్టిందిరా అబ్బూ! ఈ సంగతి ముందే అఘోరిస్తే పోయేది కదరా అబ్బూ! ప్రేమ విరహం భరించలేక నా జుట్టు పీకేసుకున్నా కదరా అబ్బూ!” అంటూ వ్యాకర్ణ రాగం తీశాడు.

“ముందా సోకాలు ఆపు" అబ్బులు అరచి మరీ చెప్పాడు. వ్యాకర్ణ నోరు మూసుకున్నాడు.