అమ్మో అమ్మాయిలు 36

Listen Audio File :

జయచిత్ర ఎక్కువ ఆలోచించకుండానే గ్రహించింది. ఎవరో లేపి తన చేతిలో కాగితం పెట్టి వెళ్ళారని. అవసరం వస్తుందని పక్కలోదిండుకింద టార్చిలైటు వుంచుకుంటుంది జయచిత్ర. ఎప్పుడూ అర్థరాత్రి టార్చిలైటు వెలిగించుకునే అవసరం రాలేదు. ఇప్పుడొచ్చింది. జయచిత్ర టార్చిలైటు వెలిగించి ఆ వెలుతురులో అబ్బులి లెటరు చదివింది. చదివి కోపం తెచ్చుకుంది, తెచ్చుకుని ఓ గంట ఆలోచించింది.

“అవురా ఎంత తొందర! అవురవురా ఎంత తెగించాడు! ఇలా కాదు మంచిగా పనులుగావు రేపు రేపు చెప్పాలి చెప్పాలేంటి చూడాలి. చూసేదేమిటి తాడోపేడో తేల్చాలి" అనుకుంది. రేపేం చేయాల్సింది. ఎలాచేస్తే బాగుంటుంది! మరోసారి దీర్ఘంగా ఆలోచించి తెల్లవారు ఝామున నిద్రపోయింది.

మర్నాడు. అబ్బులు లేచి సమయం చూసి వ్యాకర్ణ వద్దకు వాళ్ళ గదిలోకి వచ్చింది. జయచిత్రను చూస్తూనే చాపమీద నుంచి లేచాడు వ్యాకర్ణ. కొంటెగా నవ్వుతున్న జయచిత్రను చూసి మురిసిపోయాడు.

"మిరోస్తారని ఎందుకో అనుకున్నాను. దేవతలా ఠకీమని ప్రత్యక్షమయ్యారు" అన్నాడు వ్యాకర్ణ.

“అనుకుంటారు, అనుకుంటారు పనేముంది మీ పని మీ పని.... ఇప్పుడు కాదు ఆనక" అనుకుని, పైకి ఓ చిరునవ్వు నవ్వి. “సాయంత్రం గాంధీహిల్ కి మీరొక్కరే రండి.సరిగా అయిదు గంటలకి అక్కడ ఎదురు చూస్తూ వుంటాను. మనం చాలా మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్న తర్వాతే మరేమయినా, వస్తారు కదూ? ఒంటరిగా రావాలి రెండో కంటికి తెలియరాదు" అని వేగంగా గదిలోంచి బైటికెళ్ళిపోయింది జయచిత్ర.

అరగంటకి తేరుకున్నాడు వ్యాకర్ణ. ఆ తర్వాత ఆలోచించాడు. “మగాళ్ళం మేం తెగించటానికి భయపడి చస్తున్నాము. జయచిత్ర చూడు, క్వీక్ గా తెగించేసింది. ప్రేమంటే అలా వుండాలి నేను వున్నాను దేనికి? ఈ మధ్య నా మీద తరుచు జయచిత్ర చిరుబురులాడుతున్నది. ఎందుకో తెలియలేదు ఇప్పుడు తెలిసింది. తను నన్నెంత గాఢంగా ప్రేమించింది. నేనేమో భయపడి తెగించి ఒక్కడుగు ముందుకు వేయకపోతిని కోపం రాదా మరి! ఇలా కాదని తానే ముందడుగు వేసింది.

ఎవరో ఒకరు మా ఇద్దరిలో ఎవరైతేనేం? సాయంత్రం గాంధీహిల్ కెళ్ళాలి. అందంగా తయారయి మాంచి డ్రస్ వేసుకుని నా జయ ముందు ప్రత్యక్షమవుతాను. ఒంటరిగా వుంటాము మా మనసులు విప్పుకుని చెప్పుకుంటాము. అప్పుడు జయచిత్రని ఏమండీ! అనక్కరలేదు. పేరు పెట్టి ఎంచక్క పిల్వవచ్చు. 'జయా'! అంటే? పోనీ చిత్రా!” అంటే, ఏదీకాదు "జయచిత్రా!” అనేస్తే, సర్లే దీనికోసం ఇంతగా తల బద్దలు కొట్టుకోవటం దేనికి, అప్పడు ఎలా తోస్తే అలా పిలుస్తాను.

నన్ను ఏమండీ! అనొద్దని చెపుతాను. కర్ణా! అని పిలవమంటాను. ఆ దొండపండులాంటి పెదవులు బహు అందంగా సున్నితంగా వీణ మిటినట్లు"కర్ణా!” అంటాయి కాబోలు, నేనెంత అదృష్టవంతుడిని, కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్లు... ఇలా ఆలోచిస్తూ వుండిపోయాడు వ్యాకర్ణ. గాంధీహిల్ కెళ్ళొచ్చిన తరువాత అబ్బులితో చెప్పొచ్చులే అని కూడా అనుకున్నాడు. ఆ ఉదయం నుంచి అబ్బులికి ఓ అనుమానం వచ్చింది.

“బిందురేఖ తన ఉత్తరం చూసుకుందా? పొరపాటున క్రింద పడేసిందా? అదే జరిగితే ఆ ఉత్తరం జయచిత్ర కంటపడితే? “అమ్మో....? ఇంకేమయినా వుందా? పిల్లరాక్షసి జయచిత్ర తన ప్రాణం తీస్తుంది. ఉప్పులో గుండెకాయని ఊరేసి నూటముప్ఫై డిగ్రీల ఎండలోనా గుండె కాయని ఎండా పెడుతుంది. ఆ ఎండిన గుండెను రాత్రికి వేయించుకుని ఆ....... ఆ అని తినేస్తుంది. అమ్మో! జయచిత్రమ్మ తల్లో నీకో దండం నీ జోలికి రాను" అనుకున్నాడు.

బిందురేఖ కనపడుతుందేమో అని నాలుగు సార్లు లెట్రిన్ కి, నాలుగు సార్లు బాత్ రూంకి తిరిగాడు అబ్బులు, చివరిసారి కనపడింది బిందురేఖ. ఎవరైనా చూస్తారేమో అని అటూ ఇటూ దొంగచూపులు చూసి రెండంగల్లో బిందురేఖని చేరి "ఊర్వశీ థియేటర్, ఆరుగంటలాట....” అని యింకేదో అనబోయాడు అబ్బులు.

“ఓ.కే.” అనేసి, యింట్లో కెళ్ళిపోయింది బిందురేఖ.

“అమ్మయ్య. నా లెటర్ బిందురేఖ అందుకుంది. నా గుండెకాయకెంత ప్రమాదం తప్పిపోయింది" అనుకున్నాడు అబ్బులు.