అమ్మో అమ్మాయిలు 34

Listen Audio File :

అంతవరకు కథ వింటున్న జయచిత్ర, బిందురేఖ పళ్ళు కొరుక్కుంటూనే (నూరుతూనే) ఉన్నారు. పళ్ళు నొప్పుట్టాయి. పళ్ళు కొరకటం మానేసి కోపం తెచ్చుకుని కళ్ళెర్రచేసి "గాలి పీలిస్తే కడుపొస్తుందా?” అన్నారు.

“మగాణ్ణి... ఆ సంగతి నాకెలా తెలుస్తుంది?” అన్నాడు అబ్బులు.

“ఆడాళ్ళకి తెలుస్తుందిగా ఎవ్వరినైనా అడిగితే" అన్నాడు వ్యాకర్ణ.

“మీ కథలో దండం, మీకో దండం. ఇంకాపెయ్యండి, తెలుగు సినిమా కథ చెప్పి రచయిత్రుల నవల్స్ లో ఈ కథ వుంటుందంటారా?” అంటూ జయచిత్ర కళ్ళెర్రచేసింది.

“తెలుగు సినిమాలు సగం రచయిత్రుల నవలలే కదండీ తీసింది" చల్లగా అన్నాడు అబ్బులు.

“తీశారు గాని, గాలి పీలిస్తే గర్భం రావటం రాయలేదు., తీయలేదు కావాలంటే పందెం కస్తాను" అంది బిందురేఖ బోలెడు ఆయాసపడిపోతూ.

“గాలి పీలిస్తే గర్భిణి అయిందని మాట వరసకి చెప్పాను, చలికి పిల్లలు పుడతారా? అన్నట్లు గాలికి గర్భిణి వస్తుందా? ఏదో కథ కోసం" అన్నాడు అబ్బులు.

"వస్తుంది" గట్టిగా నొక్కోపలికాడు వ్యాకర్ణ.

“నీకెలా తెలుసురోయ్! ఎవరికొంపముంచావురోయ్! ఎవరికొచ్చిందిరోయ్?” అంటూ గుండెలు బాదుకున్నాడు అబ్బులు.

“నువ్వు ముందా శోకాలు ఆపెయ్యి! సినిమా అనుకో నవలనుకో ఇలా రేప్ సీను చూపిస్తారు. అలా కడుపొస్తుంది. ప్రేమికులు అలా కల్సుకుంటారు. ఇలా కడుపొస్తుంది. అలా విడిపోతారు. కన్నుమూసి తెరిచేటప్పటికి జరిగిపోతుంది కాదా? దీనికి అనుభావం ఉండాలా? ఇలాంటి వెన్నో చదివాను. ఇలాంటి వెన్నో చూశాము సినిమాలలో" అన్నాడు వ్యాకర్ణ.

“సరేలెండి యిప్పుడేమంటారు?” అంది జయచిత్ర చాలా సీరియస్ గా.

“అబ్బే, ఏం అనమండి" అన్నాడు వ్యాకర్ణ.

“ఎలా అంటామండి, మీ యింట్లో అద్దెకున్నామాయె!” అన్నాడు అబ్బులు.

“అద్దెకు లేకపోతే అనేవారన్నమాట...! మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు" అంది బిందురేఖ.

కొంటెగా చూసి తల తిప్పేసుకున్నాడు వ్యాకర్ణ.

“ఉత్త పోకీరి పిల్లగాళ్ళు!” అనుకున్నారు బిందురేఖ , జయచిత్ర.

“ఈ పూటకు సరదగా కథలతో కబుర్లతో కాలక్షేపం అయింది . చాలా పొద్దుకూడా పోయింది యింక లేద్దాం" అన్నాడు అబ్బులు.

“ఎలాగో అలా కాలక్షేపం అయింది. మా నానమ్మ ఊరికెళతనంటే ముందే బోలెడు బెంగ పెట్టుకున్నాను. మీ వల్ల మాటలు కాలక్షేపం. బిందురేఖ రాకవల్ల తోడు అట్టట్టా రెండు రోజులయిపోయింది. ఇంకో రెండు రోజులు, నాన్నమ్మ వచ్చేస్తుంది" అంది జయచిత్ర.

“ఎలాగో అలా రోజులు గడవాలి కదా, ఈ రెండు రోజులు అలాగే గడిపేస్తే సరి" అన్నాడు వ్యాకర్ణ.

“అట్టాగేలెండి" అన్నది బిందురేఖ.

అట్టా యిట్టా భాషకి నలుగురికి నవ్వొచ్చింది. నలుగురు నవ్వుకున్నారు. తర్వాత నిద్ర పోవటానికి ఒకరినుంచి ఒకరు సెలవు తీసుకుని లేచారు. అప్పటికే, ఆరోజు చాలా కథలు, కబుర్లు దొర్లినందున రాత్రి పన్నెండయింది. లేక చిన్న ముల్లు పెద్దముల్లు టచ్చయ్యాయి. ఆ మర్నాడు అబ్బులు, వ్యాకర్ణ సినిమా కెళ్ళారు. అనుకోకుండా అదే సినిమాకి జయచిత్ర, బిందురేఖకూడా వెళ్ళారు.

హాలువద్ద ఒకరినొకరు చూసుకుని, కలుసుకుని, మాట్లాడుకుని, ఒకే వరసలో, ఒకే క్లాసుకి, ఓ నాలుగు చిక్కెట్లుచ్చుకుని, సరదగా సినిమా చూశారు. ఆ మర్నాడు బామ్మగారు ఊరునుంచి దిగింది. బామ్మగారు వచ్చిన తరువాత నలుగురు కూర్చుని పెద్దగా మాట్లాడుకోకపోయినా మధ్య మధ్య నలుగురు మాట్లాడుకుంటునే వున్నారు. బామ్మగారు మంచీ చెడ్డా కనుక్కుంటూనే వున్నారు. రోజులు బాగానే గడిచిపోతున్నాయి.