అమ్మో అమ్మాయిలు 33

Listen Audio File :

“రచయిత్రులనంటే సహించను గాక సహించను" గట్టిగా అంది జయచిత్ర.

“సహించరు లేండి. మీ జాతివాళ్ళు కదా రాసేది . నిజం చెప్పాలంటే నవల్స్ లో ఎన్ని లోపాలుంటా యో చెప్పనా? ఇది నిజజీవితంలో వాస్తవంగా జరుగుతుందా అని అనిపిస్తుంది. ఓ హీరో వుంటాడు అతగాడు రిక్షా తొక్కేవాడు. బి.ఎ వెలగబెడుతున్నా హీరోయిన్ కారులో రోజు కాలేజి కొస్తుంది. ఓ రోజు కాలేజి వదిలేటప్పటికి కారు రాదు, హీరో రిక్షాని పిలుస్తుంది. 'ఎంతివ్వ మంటావ్?” అంటుంది.

“మీ దయ అమ్మాయి గారూ!' అంటాడు.

ఈ పిల్ల రిక్షా ఎక్కుతుంది. ఆ పిల్లగాడు రిక్షా తొక్కుతాడు . ఇంటికొచ్చింతర్వాత పదిరూపాయల నోటు ఇస్తుంది. పైసా ఎక్కువ తీసుకోనని ఓ ముప్పావలా పుచ్చుకుని తొమ్మిది రూపాయల పావులా ఆ పిల్లదానికిచ్చి వెళ్ళిపోతాడు. అర్జంటుగా ఆ రాత్రే అబ్బాయి కలలోకి అమ్మాయి, అమ్మాయి కలలోకి అబ్బాయి వెళ్ళిపోతారు.”

“ఇలాంటి కథ ఏ రచయిత్రి రాయలేదే?” తను చదివిన నవలలు గుర్తు తెచ్చుకుంటూ అంది బిందురేఖ.

“ఏ రచయిత్రన్నా రాసిందేమో! మనం చదివుండము బాగుంది ముందు కథ విందాం పట్టు" అంది జయచిత్ర.

“కానియ్యరా అబ్బూ!” అన్నాడు వ్యాకర్ణ.

“ఓ రోజు పదిమంది కాలేజీ స్టూడెంట్లు ఈ అమ్మాయిని రేప్ చేయబోతారు. సమయానికి ఎవరు వుండరు. కాశీమజిలీ కథలో రాజకుమారిలా విలపిస్తూ "రక్షించండి రక్షించండి.” అని గావుకేక పెడుతుంది. ఆ దోవన వెడుతున్న రిక్షా అబ్బి అంటే మన హీరో పరుగున వెళ్ళి పదిమందిని చితకదన్ని ఆ పిల్లని రక్షిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఆ నిమిషాన ప్రేమ అంకురిస్తుంది. ప్రేమ అంకురించింది కాబట్టి బిగ్గరగా కౌగిలించుకుంటారు.”

“ఉండుండు నాకో సందేహం, వాడు రిక్షా తోక్కుకునే వాడు, ఆమె కారున్న కాంత వాళ్ళిద్దరూ అలా టచ్చయితే రిక్షా అబ్బి బీదవాడు. చిరిగిన మురికి దుస్తులు ధరించిన వాడు కాబట్టి ఆమె అతగాడి స్మెల్ ఎలా భరించింది. అసలే స్టంట్ చేస్తున్నాడు, నీచుకంపు ఎంత కొడుతున్నాడో, ఏంటీపాడు, ఛీ" అన్నాడు వ్యాకర్ణ.

“ఎలాగో అలా భరించింది లెద్దూ!” అన్నాడు అబ్బులు భూతద్దాల్లోంచి బిందురేఖను కొంటెగా చూస్తూ.

“అదెలా కుదురుతుంది?” అన్నాడు వ్యాకర్ణ ఓ చూపు జయచిత్రపై పారేసి.

జయచిత్ర మూతి మూడొంకర్లు తిప్పింది.

“కుదరకపోతే ఎలాగో అలా సర్డుకుందు! నాకడ్డురాకు. సరే అప్పుడేమయింది అంటే అప్పుడు ఆమెకు కడుపొచ్చింది....” అని ఆగాడు అబ్బులు.

“అదెలా? ఏం జరిగిందని కడుపొస్తుంది.” అన్నాడు వ్యాకర్ణ.

“ఏం జరగాలి! ఇంకేం జరగాలంటా? జరిగింది చాలాదూ? ఆ పిల్ల ఈ పిల్లగాడు తొలిప్రేమతో గాఢంగా కౌగిలించుకున్నారు. అతగాడి వేడిశ్వాస అంటే గాలి తగిలి ఈవిడ గారు వాంతి చేసుకుంది.” అన్నాడు అబ్బులు.

“అవునుమరి వాడేమో రిక్షావాడు మాసిన గుడ్డలు చెమటకంపు పైగా పదిమందితో స్టంట్ చేసి వున్నాడాయో మనిషింపయినా కంపెక్కడికి పోతుంది! అందుకే వాంతయింది ఆమెగారికి" అన్నాడు వ్యాకర్ణ జేబులోంచి కర్చీఫ్ తీసి ముక్కుకు అడ్డంగా పెట్టుకుని.

“వాసనకి కాదురా కర్ణ! వాంతయింది. కడుపొచ్చి. అంటే వెవీళ్ళు అని గుర్తన్నమాట......” అన్నాడు అబ్బులు.

“సరేలే, ఎలాగో అలా కానియ్యి" అన్నాడు వ్యాకర్ణ కర్చీఫ్ జేబులో కుక్కుకుని.