అమ్మో అమ్మాయిలు 32

Listen Audio File :

అబ్బులికి కోపం వచ్చింది. తమాయించు కున్నాడు. “కాశీమజిలి కథలు ఇలాగే వుంటాయి. కావాలంటే పుస్తకం యిస్తాను, చదవండి, పాత లాంతరు రుద్దితే భూతం ప్రత్యక్షం కావటం.... పళ్ళ గంపలోంచి ఆకాశరాజు వూడిపడటం.... రొట్టెల వాడి కథలో రొట్టె తుంచగానే రాజకుమారి మంజారీ దేవి రొట్టె మధ్యలో నవ్వుతూ నిలబడి వుండటం.....” అబ్బులు యింకా చెప్పబోయాడు గాని.

బిందురేఖ అడ్డు తగిలి "అబ్బ, ఏం కథలండీ కథానాయకులు కథానాయకులు రొట్టెలమ్మే వాళ్ళు, పళ్ళమ్మే వాళ్ళు, పాతలాంతర్లు బాగుచేసేవాళ్ళు.....”

“సవరాలు కట్టేవాళ్ళు.............” అంటూ చివరిమాట జయచిత్ర పూర్తిచేసింది.

“ఏం వాళ్ళకి కథలుండకూడదా? వాళ్ళు హీరో హీరోయిన్లకి పనికిరారా? వాళ్ళకేం వచ్చింది? కాలొంకరా కన్నొంకరా? కథలో వాళ్ళ శౌర్యపరాక్రమాలు చదువుతుంటే వళ్ళు గగుర్చొడుస్తుంది. ఉత్తేజం ఉప్పొంగి పోతుంది. రక్తం వేడెక్కుతుంది. రోమాలు నిక్కపొడుచు కుంటాయి. సాహసం ధైర్యం....... అదీ ఇదీ........ ఆ...ఊ...” అన్నాడు అబ్బులు భూతద్దాలలోంచి బిందురేఖని కళ్ళార్పకుండా చూస్తూ.

“ఎవరికీ?” మాట సాగదీస్తూ అంది జయచిత్ర.

“ఏం, మీకు మాత్రం కథ వింటుంటే ఆ థ్రిల్ రాలేదా?”

“థ్రిల్లు, నా పిండాకూడు. మీ రాజకుమారుడేం రాజకుమారుడండీ. ఏ బండరాతిలోనో దేవతుంటుంది. మీ రాజకుమారుడి కాలివేరు గోరు మార్గం మధ్యలో వున్నా ఆ రాతికి తగులుతుంది. అక్కడ రాయి మాయమయి ఆ స్థానంలో ఓ యక్షిణి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు యక్షిణి మీరు రాజకుమారా ప్రతాపచంద్ర నీవు రాజకుమారైను రక్షించటానికి వెళుతున్నావు. రాజకుమారుడి రాక్షసుడి వద్ద వుంది. వాడు మాయవి భూత ప్రేత పిశాచాలు వేలకొద్ది వాడి రహస్య మందిరానికి కాపలా కాస్తుంటాయి.

ఎవరు వాడిని చంపలేరు. ఇదిగో ఈ ఖడ్గం నీ కిస్తున్నాను ఇది ఇంద్రుడిది. దీనితో వాడిని చంపు నీకు జయం కలుగుతుంది. నేను శాపవశాత్తు రాయినయాను. నీ గోరు తగిలి శాపవిమోచన అయింది" అని చెప్పి ఖడ్గం యిచ్చి మాయమవుతుంది. రాజకుమారుడు ఆ ఖడ్గంతో రాక్షసుడిని చంపి రాజకుమారిని రక్షించి తీసుకు వస్తాడు. అంతేనా!” అంది బిందురేఖ.

“అంతే, అంతే" అన్నాడు అబ్బులు.

“గుడ్! రాయిలో యక్షిణి లేకపోతే, ఆ యక్షిణి ఖడ్గం యివ్వకపోతే రాక్షసుడిని రాజకుమారుడు చంపగలిగే వాడా?” అంది బిందురేఖ.

“ఎట్టాగోట్టా చంపాలి కదా?” అంది జయచిత్ర.

“ఎట్టాగోఅట్టా చంపాలి కదా అని ఎలాగో అలా కథలో సాయంచేస్తే ఎలా?” అంది బిందురేఖ.

“ఎలాగో అలా సర్దుకుందూ?” అంది జయచిత్ర.

“అదెలా? కుదరదు" అంది బిందురేఖ..

“ఇంకెలాగో మరి.....?” అన్నాడు అబ్బులు.

“ఇలా....రాజకుమారుడికి శౌర్యపరాక్రమాలు లేవు. చేవలేదు. సొంత ఖడ్గంతో చీమపిల్లను కూడా చంపడు....”

“నువ్వు చూసొచ్చావేమిటి?” అంది జయచిత్ర.

“చూడాలేమిటి? కథలోవుందిగా! రాజకుమారుడికి ఏ దేవతో, దెయ్యమో ప్రత్యక్షమై వరాలు, ఖడ్గాలు, మాయ కుండలాలు, కీలుగుర్రం లాంటివి ప్రసాదిస్తే వాటి సాయంతో కొండంత రాక్షసుడిని చంపుతాడు. ఏనుగంత మాంత్రికుడిని హతమారుస్తాడు. ఏ సాయము లేకుండా తన భుజబలంతో, తన ఖడ్గంతో రాక్షసుడిని చంపితే అది శౌర్యం, అది ధైర్యం.ఎవడో సాయం చేస్తే ఎలాగో అలా చంపేవాడు ఏం రాజకుమారుడు! ఉత్త వాజమ్మ" అంది బిందురేఖ.

“ఇది కథ, ఎలాగో సర్దుకుపోవాలి మరి" అంది జయచిత్ర.

“వీళ్ళిద్దరూ ఇద్దరే పోకిరీ పిల్లలు. యేం చేద్దాం.” అంటూ వ్యాకర్ణ అబ్బులి చెవి కొరికాడు.

“వీళ్ళ సంగతి నేచూసుకుంటాలే" అని తిరిగి అబ్బులు వ్యాకర్ణ చెవి కొరికి ఓసారి భూతద్దాలు తీసి తుడుచుకుని కళ్ళకు తగిలించుకున్నాడు.

“బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడవేమిటి?” అంది బిందురేఖ.

“మాట్లాడితే మీక్కోపమొస్తుంది.” అన్నాడు అబ్బులు.

“వస్తే వస్తుంది మాట్లాడండి" అంది బిందురేఖ.

"అదెలా కుదురుతుంది?” రాగం తీశాడు అబ్బులు.

“వాళ్ళు ఎలాగో అలా సర్దుకుంటామంటే మనకేమిటి . ఊ, కానియ్" అన్నాడు వ్యాకర్ణ.

“అలాగే, ఇప్పుడు బామ్మగారు లేరుగాని వుంటే నాపక్షం వహించేవారు. అదలా వుంచండి. అసలు కథ కొద్దాం. కథ చెప్పండి, చెప్పండి అని చంపింది మీరు, పోనీకదా అని చెప్పాను అవునా?”

“అవును".

“కథ కాళ్ళుండవు. ముంతకు చెవులుండవని ఓ సామెతుంది. అలాగే ఈ రాజుల కథలకి తలతోకా వుండదు. ఎందుకంటే ఏం చెబుతామ్? అని కాకమ్మ కథలు అంతే, రామాయణం భారతాలు తీసుకోండి. అవి మన పవిత్ర గ్రంథాలు, వంకలు వెతకటానికి ప్రయత్నించండి. బోలెడు అందుకే రామాయణం రంకు, భారతం బొంకు అన్నాడు, దేవుళ్ళు, దేవతలు అనబడే వాళ్ళకి కూడా వరాలు, శాపాలు, బ్రహ్మాస్త్రా, నాగాస్త్రాలు, ఇవన్నీ కలగా పులగం అయే కథ నడిచింది".

అబ్బులు మాటలకి వ్యాకర్ణ అడ్డు తగిలి "మొన్న మనం చూశాం. అదేం సినిమా అబ్బా............! ఆ... పాదుకా పట్టాభిషేకం. దానిలో ఎన్.టి.ఆర్., ని శారద "బ్రదర్, బ్రదర్" అని కేకలెడుతూ పాటపాడితే ఠకీమని ప్రత్యక్షము బోలెడు నైలాన్ చీరలివ్వలేదేమిటి? ఎక్కడో వున్నా కృష్ణుడు యిక్కడున్న శారద పిలుపుకి పరుగెత్తుకు రాలేదేంటి" అన్నాడు.

“నోరు ముయ్యి" అన్నాడు అబ్బులు, అనటమేగాక వ్యాకర్ణ నోరుమూశాడు తన చేత్తో.

జయచిత్ర, బిందురేఖ పొట్టలు పట్టుకున్నారు.

(వాళ్ళచే) నవ్వాపుకోలేక. “నిన్నెవరు నోరు తెరవమన్నారు?” అని అబ్బులు కోప్పడి మళ్ళీ మొదలుపెట్టాడు. “కాశీమజిలీ కథలేమిటి ఇచ్చట ప్రముఖ రచయిత్రుల కథలేమిటి , అన్ని అవే అని సర్దుకుపోవాలి. అదెలా ఇదెలా అని కోడిగుడ్డు మీద ఈకలు పీకటానికి ప్రయత్నించకూడదు" అంటూ హితబోధ చేశాడు.

“కాశీమజిలీ కథలకీను మా రచయిత్రుల కథలకీను పోలికా ! నక్కెక్కడ నాగలోకం ఎక్కడ?” గయ్యిమంది బిందురేఖ.