అమ్మో అమ్మాయిలు 30

Listen Audio File :

అబ్బులు వ్యాకర్ణ కలిసి యధాస్థానంలో పేపర్లు పుస్తకాలు సర్దారు. ఆ తరువాత ఆ సాయంత్రం లోపల అబ్బులు లెట్రిన్ కి పదిసార్లు బాత్ రూమ్ కి పాతికసార్లు వెళ్ళొచ్చాడు. ఆ ఆకల్చిప్పల అందమైన కళ్ళు గల అమ్మాయి కనపడు తుందేమో "నీ పేరు బిందురేఖ" అని చెపుదామని.

ఆ పిల్ల మాత్రం అబ్బులి కంటపడలేదు. పదిసార్లు లెట్రిన్ కి పాతికసార్లు బాత్ రూమ్ కి తిరిగినందున అబ్బులుకి బోలెడు నీరసం వచ్చింది. “ఇంత యిది పనికిరాదు ఎంతయినా" అంటూ వ్యాకర్ణ కోప్పడ్డాడు.

రాత్రి భోజనాలయ్యాయి. కాసేపు జయచిత్రతో బాతాఖానీ యేసొచ్చి నిద్రపోదామని వ్యాకర్ణ,అబ్బులు జయచిత్ర దగ్గరకు వెళ్ళారు. బిందురేఖతో కబుర్లు చెపుతున్న జయచిత్ర వీళ్ళను చూసి "రండి రండి" అని ఆహ్వానించి వరండాలో కుర్చీలు వేసింది.

బిందురేఖను చూస్తూనే "బిందురేఖగారూ! మీ పేరు గీతలోంచి చుక్కలోంచి లాగేశాను" అన్నాడు అబ్బులు.

“మీ బుర్ర నిజంగా బ్రిలియంట్ బుర్ర" అని బిందురేఖ మెచ్చుకుంది.

జయచిత్ర అడిగిన మీదట ఉదయం జరిగింది చెప్పింది బిందురేఖ. జయచిత్రతో మాట్లాడాలని ఒకటే యిదైపోతున్న వ్యాకర్ణ "మా అబ్బులు మహా మేధావిలెండి. పజిల్స్ సాల్వ్ చేయటంలో, కథలు చెప్పడంలో ఆటలాడటంలో అమ్మాయిలను ఢీకొనడంలో" అన్నాడు.

జయచిత్ర కిల కిలా నవ్వింది.

“పోరా!” అంటూ సిగ్గుపడ్డాడు అబ్బులు.

ఆ తర్వాత జయచిత్ర, బిందురేఖ, వ్యాకర్ణ, అబ్బులు, బోలెడు విషయాలు మాట్లాడుకున్నారు. కబుర్లు పెరుగుతున్నాయేగాని తరగటం లేదు. “కథలు బాగా చెపుతారని మీ మిత్రుడంటున్నాడు. ఓ మాంచి కథ చెప్పండి" అంది బిందురేఖ అబ్బులితో.

“మీ అభిమాన రచయితల రచయిత్రుల పేర్లు చెప్పండి" అన్నాడు అబ్బులు.

జయచిత్ర బిందురేఖ వరసపెట్టి అరడజనుమంది రైటర్స్ పేర్లు చెప్పారు.

“ఊహూ లాభం లేదు.మీరు పెద్దవాళ్ళని పెట్టుకున్నారు. నా కథలేం నచ్చుతాయి. నావన్నీ కాశీమజిలీ, అల్లావుద్దీన్ అద్భుతదీపం, అరేబియన్ నైట్స్, అపూర్వచింతామణి అలాంటి కథలు చదివిన వాడిని అవే చెప్పగలిగిన వాడిని" అన్నాడు అబ్బులు.

“బుల్లబ్బాయ్" అంటూ నవ్వింది బిందురేఖ.

“కాశీమజిలీ కథలు చాలా ప్రసిద్ది కదండీ, నేనొక్కటీ చదవలేదు. అదే చెప్పండి" అంది జయచిత్ర.

“అనగనగా ఓరాజు...అవేం బాగుంటాయండి" అంటూ అడ్డు వచ్చాడు వ్యాకర్ణ.

“వింటేనే కదా తెలిసేది...” అంటూ కొట్టేసింది జయచిత్ర.

“కరెక్ట్, కరెక్ట్" అంది బిందురేఖ.

ఆముదం తాగినట్లు ముఖం పెట్టి "మీ యిష్టం" అన్నాడు వ్యాకర్ణ.

“మొదలెట్టేస్తున్నా!” అని అబ్బులు కథ మొదలు పెట్టాడు. “అనగనగా ఓ అవంతీపురం...........”

“అనగనగా దేనికి? అవంతీపురం అనండి చాలు" అంది బిందురేఖ అడ్డుతగిలి.

“సరే. ఓ అవంతీపురం వుంది.అవంతీపురం రాజుగారి పేరు రుద్రసింగు. ఆయనకీ ఒక్కతే కూతురు. పేరు హిమబిందు.” అబ్బులు ఓ కొంటెచూపు పారేసి అన్నాడు.

బిందురేఖ మూతి మూడు వంకరలు తిప్పింది.