అమ్మో అమ్మాయిలు 29

Listen Audio File :

వ్యాకర్ణ, అబ్బులు కల్సి వార, మాస పత్రికలు, డిక్షనరీ, డైలీ పేపర్సు, ప్రసిద్ధ రచయిత్రుల నవల్స్, సినిమా పత్రికలు, రైల్వే గైడ్, జనరల్ నాలెడ్జి గైడు వగైరా అన్నీ ముందు పేర్చుకు కూర్చున్నారు. తర్వాత గుర్తుకొచ్చి సినిమా పాటల పుస్తకాలు కూడా దుమ్ము దులిపి ముందేసుకున్నారు. తిరగెయ్యనివి, తిరగేసేసి, తిరగేసినవి, అన్నీ పదేసి సార్లు చూశారు. రెండున్నర గంటల తర్వాత ఓ వారపత్రికలో ఓ డాక్టరుగారి సలహాల శీర్షిక కింద "ఎండాకాలం చెమట పట్టడం ఎండ లక్షణమే కాక, చెమటశరీరానికి మంచి కలుగజేస్తుంది. చెమట బిందువులు (చుక్కలు)...” అంటూ రాశాడు.

అది చదివిన అబ్బులు ఆనందంతో అమాంతం వ్యాకర్ణని కౌగలించుకుని అంత క్రితమే హీరో బ్లేడుతో చదును చేసిన వ్యాకర్ణ బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు.

"నీకేం వచ్చిందిరా!” అని వ్యాకర్ణ బుగ్గ తుడిచేసుకుని అబ్బులి నెత్తిన వొకటిచ్చుకున్నాడు.

“వచ్చిందిరా వచ్చింది. ఈ డాక్టరు గారు చెమట బిందువులని రాసి బిందువులంటే అర్థం కాని అక్కు పక్షులుంటారేమో అని బ్రాకెట్ లో చుక్కలు అని రాశారు. చుక్క అంటే బిందు" అన్నాడు అబ్బులు.

“ఈ మాట చెమట చుక్కకే వర్తిస్తుందా? అన్ని చుక్కలకి వర్తిస్తుందా?”

“నీ అనుమానం తగలెట్టా, తారల్ని అంటే సినిమా తారలు కాదు, ఆకాశంలో తారలు, అంటే నక్షత్రాలు, వాటిని చుక్కలంటారు. ముగ్గు పెట్టేటప్పుడు చుక్కలెడతారు. అంతే కాదు. వాక్యం పూర్తి కాంగానే చుక్క పెడతారు. కొన్ని గుర్తుల్ని చుక్కలంటారు. శరీరం మీద చుక్కలుంటాయి. ఇవిగాక తోక చుక్క, తోడేయటానికి చుక్క.... ఇంకా...... అబ్బులు వుషారుగా చెప్పుకుపోతున్నాడు.

చటుక్కున వ్యాకర్ణ........ అబ్బులి నోరు మూసి.... “నీ చుక్కలు తగలెట్టా నీ మాట ఒప్పుకున్నాను. చుక్క అంటే బిందువే అంటే బిందు.ఇహ రేఖలు సంగతి చూసి తగలడదాం పద" అన్నాడు బోలెడు విసుగు ప్రదర్శిస్తూ.

అబ్బులు కళ్ళు భూతద్దాల్లోంచి మెరిశాయి. వ్యాకర్ణ చేతిని నోటి మీద నుంచి తొలగించి ఆ చేతిని ముద్దు పెట్టుకుని. “...... నువ్వెంత మంచివాడవమ్మ! నువ్వెంత అందమైన వాడివమ్మా! నువ్వెంత తెలివిగలవాడివమ్మా! నువ్వెంత.....”

వ్యాకర్ణ అబ్బులి మాటలకి అడ్డు తగిలి "మరో ముక్క నీ నోటంట వచ్చిందంటే చంపేస్తాను. నన్ను తరువాత ఎత్తేద్దువుగాని నీకేం పుట్టిందో చెప్పు" అన్నాడు. “చుక్క అంటే బిందు అని కనిపెట్టేశాను. అనుకోకుండా వచ్చిన మాటతో గీతని కూడా లాగేశాను"

“నా నోటంట గీతొచ్చిందా?”

“వచ్చిందా! చిన్నగా అడుగుతావేమిటి? వచ్చింది.

రేఖలు సంగతి చూద్దామన్నావు. గీతలంటే రేఖలు. గీత అంటే రేఖ, చుక్క అంటే బిందు. గీత అంటే రేఖ. ఆ అమ్మాయి పేరు బిందురేఖ. అర్థమయిందిరా! పేరు చూడబోతే వ్యాకర్ణం తెలివి చూడబోతే వ్యా..... వ్యా...” అన్నాడు అబ్బులు.

వ్యాకర్ణ సందేహం వెళ్ళబుచ్చుతూ. “ఇదిగో యిలాంటి వెధవనుమానాలు వెలికి తీయకు. ఆ పిల్ల పేరు బిందురేఖే. కాకపొతే ఓడిపోయేది నేను. నీకేం బాధ?”

“ఇందాకేమన్నావ్! నీ ఓడిపోవటం నాకు కూడా అవమానమన్నావు గుర్తుందా?”

“గతం మర్చిపోరా కుంతీపుత్రా!”

“పోతాను. నీదేం పోయింది, మంచయినా చెడయినా నీ తర్వాతే కదా నాకు తగిలేది.”

“అలా అన్నావు బాగుంది" అన్నాడు వ్యాకర్ణ.