Rating:             Avg Rating:       849 Ratings (Avg 3.01)

Aanagar Colony 10

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

10వ భాగం

వి.యస్. కాలని పోలిస్ స్టేషన్ పోలిసులు రైఫిల్స్ తుడుచుకుంటున్నారు. హెడ్ కానిస్టేబుల్ సూరిబాబు చెవిలో గుబిలి తీసుకుంటున్నారు రైటర్ రామేశం ఓ డైలిపేపర్ లో బియ్యం పోసుకొని రాళ్ళు ఏరుతున్నాడు. ఆ పోలిస్ స్టేషన్ గోడలకు ఏ వైపు చూసినా దేవుళ్ళు పటాలే కనిపిస్తున్నాయి. ఒక్కో పటం ముందు ఒక్కో అగరబత్తీ వెలిగించి ఉంది.

"రైటర్ రామేశం ఏం చేస్తున్నావోయ్" చెవిలో గుబిలి తీసుకుంటూ అడిగాడు హెడ్ కానిస్టేబుల్ సూరిబాబు.

"నీ పనేదో నువ్వు చూసుకో...నా సంగతి నీకెందుకు అన్నట్టు మొన్న యస్సయ్ గారు తన చెవిలో గుబిలి తీయాలన్నారుగా తీసేసావా?" కసిగా అడిగాడు రామేశం.

"తీసాం లేవోయ్...అయినా బొత్తిగా 'హెడ్డు' ననే భయం లేకుండా పోతుంది. ఏంటీ సంగతి. బియ్యంలో రాళ్ళేరుతున్నావా?" "ఊహు...రాళ్ళలో బియ్యం ఏరుతున్నాను."

"వాళ్ళిద్దరి సంభాషణ విని మిగతా పోలీసులు అలవాటుగా కీసుక్కున నవ్వేసుకున్నారు. ఆ పోలీస్ స్టేషన్ లో అది నిత్యకృత్యం. ఎక్కువగా కేసులు రావు. ఆ స్టేషన్ కు ఇన్ స్పెక్టర్ రాంబాబు. కానీ తన పేరు షేర్ ఖాన్ అని అందరికీ చెప్పుకుంటాడు. నిప్పులాంటి మనిషి సినిమాలో సత్యనారాయణ పోషించిన షేర్ ఖాన్ క్యారెక్టర్ వచ్చి, తన పేరును షేర్ ఖాన్ అని మార్చుకున్నాడు.

అందుకే అతనికా పేరు ఫిక్సయిపోయింది. నక్సల్స్ ఏరియాకు ట్రాన్స్ఫర్ చేయడంతో హయ్యర్ ఆఫీషియల్స్ ని రిక్వెస్ట్ చేసి, ప్రశాంతంగా ఉండే ఆహానగర్ కు పోస్టింగ్ వేయించుకున్నాడు. పైకి గంభీరంగా కనిపించే అతను స్టేషన్ లో ఇంటరాగేషన్ చేసే పద్ధతి కూడా చాలా వేరయిటిగా ఉంటుంది.

* * *

"ఏంటో రామేశం...బొత్తిగా కేసుల్లేకుండా పోయాయి" అంటుండగా.

"సూరిబాబు...సూరిబాబు"

"అని ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి, తన చేస్తున్న పని ఆపి పక్కకు చూశాడు. ఆ స్టోన్ లాంటి టోను, తన ఏడేళ్ళ పుత్రరత్నానిదే. సూరిబాబు మనసేదో డామేజ్ ని శంకించింది.

"సూ...రి...బా...బూ" అంటూ మెడలో బ్యాగు తగిలించుకొని పరిగెత్తుకొచ్చాడు అతని పుత్రరత్నం బబ్లూ. స్టేషన్ లో స్టాఫ్ అంతా కెవ్వున కేకవేసి కళ్ళు మూసుకున్నారు. బబ్లూ మెడలో బ్యాగ్ తప్ప ఒంటిమీద నూలుపోగు లేదు.

"ఒరే...ఇదేమిట్రా...ఈ అవతారమేమిట్రా...స్టాఫ్ అంతా జడుసుకు చస్తారు" అన్నాడు ఓ డైలిపేపర్ తీసి, కొడుకు నడుం చుట్టూ చుట్టీ. బబ్లూ సీరియస్ గా తండ్రివంకచూస్తూ.

"మిస్టర్ సూరిబాబూ...అసలు నీఉద్దేశమేమిటి?" సూటిగా అడిగేశాడు.

"హావ్వ....హవ్వ....కన్న తండ్రిని పేరెట్టి పిలుస్తారా?" అన్నాడు ఓ కానిస్టేబుల్ బుగ్గలు నొక్కుకుని.

"నువ్వు కొత్తగా వచ్చావు కదా...నీకంతా తెలియదు. అదంతే" రామేశం బియ్యంలో రాళ్ళు ఏరడం ఆపి అన్నాడు.

"నేనేం చేసాన్రా?"

"పొద్దున్నే సినిమాకు వెళ్తానని అమ్మ నీకు చెప్పిందా? లేదా? "

"చెప్పింది."

"దానికి నువ్వేమన్నావు?"

"రేపు వెళ్దువుగాని అన్నాను.?"

"అందుకే ఆమెకు ఒళ్లు మండి నా బట్టలు సెకండ్ హ్యాండ్ రేటుకు అమ్మేసి సినిమాకి వెళ్ళింది.

"ఇంకా నయం నా బట్టలు అమ్మింది కాదు" అన్నాడు.

"రేపొద్దున్నే నీ బట్టలూ అమ్మేస్తుందట."

"హమ్మో...హమ్మో..ముందు నువ్వు ఇంటికి పద."

"సూరిబాబు భార్య ప్రసూనాంబది విచిత్రమైన క్యారెక్టర్. చీరలు కొనడం అన్నా, సినిమాలు చూడ్డం అన్నా సరదా. దానికోసం ఎంతకైనా తెగిస్తుంది.