రెండులక్షల్లో సినిమా తీసేయ్యవచ్చు.. రాం గోపాల్ వర్మ చెప్పిన ఈ మాట ఎంతో మందికి తీపి కబురనే చెప్పాలి. సినిమా అంటే మక్కువ వున్న వాళ్లు, జీవిత కాలంలో ఒక్క సినిమా అయినా తియ్యాలి అని అనుకునే వారికి ఈ విషయం కలిగించే ఆనందం మరొకటి వుండదు. ఎంత చిన్న సినిమా అయినా కోటి రూపాయలు కావాలి అని ఫిక్స్ అయిపోతున్న ఈ రోజుల్లో 2 లక్షల్లో సినిమా పూర్తి చెయ్యోచ్చని చేతలతో నిరూపించారు రామ్ గోపాల్ వర్మ. ఇదెలా సాధ్య పడిందో కూడా ఆయన వివరించారు.
సినిమా మేకింగ్ అంటే ఆసక్తి వున్న తనలాంటి వాళ్లతో కలిసి పెట్టుబడి లేకుండా అనవసర ఖర్చులు తగ్గించి తక్కువ సమయంలో సినిమా తీయటంలో ఆయన విజయం సాధించారనే చెప్పాలి. సినిమా పరిశ్రమలో వుండే టీలు, ఫలహారాలు, భోజనం వంటి వ్యవహారం ఈ సినిమాలో పాటించలేదు. అందరూ ఇంటి నుంచి ఆహారం తీసుకుచ్చుకోవటం, డిసిప్లిన్ గా పనిచేయటం జరిగింది. ఇంకా సినిమా విడుదలైన తర్వాత సినిమాకు పని చేసిన వారు చెక్కులు అందుకున్నారు. అంటే పనిని మాత్రమే పెట్టుబడిగా పెట్టి చేసిన ఈ ప్రయోగం విజయం సాధించనే చెప్పాలి.
ముఖ్యంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు నమ్మి సినిమాపై డబ్బులు పెడతారు. సినిమా పరాజయం పాలైతే నష్టం వాళ్లు మాత్రమే ఎందుకు భరించాలి. సినిమా సమిష్టి కృషి అయితే నష్టం కూడా అందరు అనుభవించాలి అనే కొత్త తరహా ఆలోచనకు, పద్ధతికి రాం గోపాల్ వర్మ తెర తీశారు. ముందు నుంచే ఐస్‌క్రీం సినిమా సినిమా మేకింగ్ ప్రక్రియను మార్చిపడేస్తుందని రాం గోపాల్ వర్మ చెప్పిన విషయం ఈ అంశాలతో నిజమనే అనిపిస్తోంది.
|