టమాటో నిల్వ పచ్చడి

 

 

 

టమాటాలు విరివిగా దొరికినప్పుడు , ఎండలు కూడా బావుంటే నిల్వపచ్చడి  పెట్టుకోవచ్చు. అయితే ఎండలు పెద్దగా ఉండని దేశాలలో వుండేవారు, అలాగే ఎండబెట్టుకునే అవకాసం లేవి వాళ్ళు ఈ పచ్చడి రుచిని మిస్ అవ్వకుండా ఇన్స్టంట్ గా ఓ నెల నిలవ వుండే టమాటో పచ్చడి చేసుకోవచ్చు. ఇది ఇంచు మించు నిల్వపచ్చడి రుచిలాగానే వుంటుంది.

 

కావాల్సిన పదార్దాలు:
టమాట  - 1 కిలో
కారం   -     4 పెద్ద చెమ్చాలు
ఉప్పు     -    2 చెమ్చాలు
పసుపు   -    అర చెమ్చా
మెంతి పొడి  -  అర చెమ్చా
ఇంగువ      -   చిన్న చెమ్చా తో
ఆవాలు       - పోపుకు తగినంత
ఎండు మిర్చి   - 4 నుంచి 5 దాకా
నూనె  - చిన్న కప్పుతో

 

తయారీ విధానం:
ముందుగా టమోటాలని కడిగి గాలికి ఆరబెట్టాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని లోతున్న బాణలిలో కొంచం నూనె వేసి ఈ టమోటాలని వేసి మూత పెట్టకుండా మగ్గించాలి . మగ్గటానికి ఓ 20 నిముషాలు పడుతుంది . ముక్క పూర్తిగా మెత్తబడి టమోట మిశ్రమం దగ్గరగా వస్తుంది. అప్పుడు ఉప్పు , కారం, పసుపు, వేయించిన మెంతుల పొడి వేసి బాగా కలపాలి . ఓ 5 నిముషాలు వుంచి స్టవ్ ఆపేసి కొంచం చల్లారనివ్వాలి. పచ్చడి చల్లారాకా పోపు గరిటలో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి వేయాలి. ఆవాలు చిటపటలాడు తుండగా ఇంగువ వేసి స్టవ్ ఆపేసి ..పోపుని టమోట పచ్చడి పైన వేసి బాగా కలపాలి. మూత పెట్టి కాసేపు కదపకుండా ఉంచితే పోపు పచ్చడికి చక్కగా పట్టి రుచిగా వుంటుంది. తడి తగలకుండా చూసుకుంటే ఈ పచ్చడి నెల దాకా నిల్వ వుంటుంది.

 

టిప్స్..

1. ఈ పచ్చడి చేసినప్పుడు లోతుగా వున్న బాణలి తీసుకోవాలి. ఎందుకంటే పచ్చడి మగ్గి , దగ్గర అయ్యే సమయం లో చుట్టుపక్కలకి చిందుతుంది.

2. ఈ పచ్చడిలో ఇంగువకు బదులుగా వెల్లుల్లి వేస్తారు కొందరు. అప్పుడు వెల్లులిని పచ్చడి అంతా అయ్యాక చివరకి వేసి, కలపాలి.  ఒకరోజు తర్వాత వాడితే వెల్లుల్లి రుచి పచ్చడికి పడుతుంది.

3. ఎక్కువ మొత్తం లో చేయాల్సి వచ్చినప్పుడు టమోటాలని కుక్కర్ లో పెట్టి ఒక్క విజిల్ రానిస్తే చాలు. మూత తీసాక కొంచం నీళ్ళనీళ్ళగా వుంటుంది. స్టవ్ మంట పెంచి దగ్గరుండి కలిపితే దగ్గర పడుతుంది . అయితే ఈ పచ్చడి కొంచం తక్కువ రోజులు మాత్రమే నిల్వ వుంటుంది. ఫంక్షన్లు జరిగినప్పుడు ఇలా చేసుకోవచ్చు.

 

-రమ