పెద్ద ఆవకాయ
కావలసిన పదార్థాలు:
పెద్ద మామిడికాయలు - 15
ఆవగుండ - 4 పావులు (1 కేజీ)
కారం - 3 పావులు
ఉప్పు - 2 పావులు
నూనె - 1 కేజీ (వేరుశెనగ నూనె ఐతే బావుంటుంది.... నువ్వులనూనెను కూడా వాడవచ్చును)
పసుపు - 1 స్పూన్
మెంతులు - 2 స్పూన్స్
ఇంగువ - 6 స్పూన్స్
తయారుచేయు విధానం:
ముందుగా ఆవగుండా, కారం, ఉప్పు, పసుపు, మెంతులు, ఇంగువ అన్నీ ఒక పెద్ద బేసిన లేదా టబ్ లో కలిపి ఉంచుకోవాలి. ఆతర్వాత మామిడికాయలని తడిబట్టతో బాగా తుడిచి, ఆరిపోయాక నాలుగు ముక్కలుగా చేసుకొని, ఆ ఒక్కొక్క ముక్కని తిరిగి మూడు లేదా నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న ఆవగుండ మిశ్రమంలో ముక్కలను కొద్ది -కొద్దిగా వేస్తూ, నూనె వేసి కలపుకుంటూ..... పక్కనే కడిగి, తుడిచి ఉంచుకున్న జాడీలో వేస్తూ ఉండాలి. అంటే ప్రతి ముక్కకి ఆవపిండి మిశ్రమం, నూనె సమంగా పట్టేటట్టు చూసుకోవాలి. మన అరచేతితో తీసినప్పుడు తెలిసిపోతుంది ముక్కలకి సరిపడా పిండి పట్టిందా లేదా అని.
ముఖ్యసూచన: ఆవకాయ మరియు ఉరగాయ పచ్చళ్ళు ఏవైనాసరే జాడీలు, సీసాలులోనే దాచి (నిల్వ) ఉంచాలి. ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు వంటి వాటిల్లో ఉంచితే వాసనవచ్చి ఎక్కువరోజులు నిలవ ఉండదు.ఎక్కడా తడి తగలకుండా చూసుకోవాలి.
-శ్వేత వాసుకి