మాగాయ
మాగాయ... వంటి పచ్చడి లేనేలేదంటూ తెలుగువారు పాటలు కూడా రాసుకున్నారు... అంటే అర్ధం అవుతోంది కదా... ఎన్ని పచ్చళ్లు వున్నా పుల్లగా వుండే మాగాయ రుచికి ఏవీ సాటిరావని. అయితే ఈ పచ్చడి పెట్టాలంటే కొంచెం ఓపిక కావలి. ముక్కలు తరగటం ఒక ఎత్తు అయితే, రోజు ఎండలో పెట్టటం ఒక ఎత్తు. కాని ఒక్కసారి ఓపిక పట్టి పెట్టామా... ఒక సంవత్సరం పాటు రుచిగల మాగాయ తినోచ్చు. ఈ పచ్చడి పెట్టేటప్పుడు ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చే కొలతలు పుల్లటి కాయ అయితే పట్టే కారం, ఉప్పు. కొన్ని సార్లు అంత పుల్లటి కాయలు దొరకవు. అలాంటప్పుడు కారం కొంచెం తక్కువే పడుతుంది. పులుపు బట్టే కారం, ఉప్పు వేసుకోవాలి. లేకపోతే పచ్చడి కారం, కారంగా వుంటుంది.
కావలసిన పదార్థాలు:
మామిడి కాయలు -- 6
ఉప్పు -- 2 కప్పులు
కారం -- 2 కప్పులు
మెంతిపొడి -- 3 స్పూన్స్(నూనె లేకుండా మెంతులు దోరగా వేయించి, పొడిచేసి ఉంచుకోవాలి)
నూనె -- 1/4 కేజీ
పోపు దినుసులు -- ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ.
పసుపు -- 1 స్పూన్
తయారీ విధానము:
మామిడికాయలు శుభ్రం చేశాక, చెక్కు తీసి, పల్చగా సన్నగా ముక్కలు తరిగిపెట్టుకోవాలి. ఈ ముక్కలలో ఉప్పు, పసుపు వేసి కలిపి మూతపెట్టుకుని, 3వ రోజు ఆ ఊటలో నుండి ముక్కలు గట్టిగా పిండి వేరేగా తీసి, ముక్కలు వేరేగా, ఊట వేరేగా ఎండబెట్టుకోవాలి. ముక్కలు బాగా ఎండిన తరవాత, ఊటలో వేసి కలపాలి.
సాధారణంగా మాగాయకి ఒక్కసారే కారం, కలిపి పోపు చేస్తారు. కాని కొంతమంది మాగాయలో ఎప్పటికప్పుడు కొంచెం, కొంచెం తీసుకుని కారం కలిపి పోపు చేస్తారు. దాని వలన మాగాయ ఇంగువ వాసనతో, తాజా పోపు రుచితో బావుంటుంది అని. ఒక్కసారే పోపు చేసి పెట్టుకునే వారు కారం, మెంతిపొడి కలిపి, అందులో ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువతో పోపు చేసుకోవాలి. ఇంగువ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మాగాయకి ఇంగువ రుచి చేరితేనే బావుంటుంది. ఈ మాగాయ పచ్చడి జాగ్రత్తగా జాడీలో దాచి ఉంచితే, ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది.
శ్వేతా వాసుకి