ఎండు ఆవకాయ

 

 

 

 

అసలు అన్ని ఆవకాయలలో రుచి లో ఫస్ట్ నిలిచే ఆవకాయ ఏది అంటే పూర్తి మార్కులు ఈ ఆవకాయకే పడతాయి.

 

కావలసిన పదార్ధాలు:

మామిడికాయలు -- 5
కారం      -- ఒక గ్లాసుడు         
ఉప్పు     -- అర గ్లాసుడు
ఆవపిండి  -- ఒకటిన్నర గ్లాసుడు
నూనె        -- సరిపడా

 

తయారీ విధానం:

మామిడి కాయని పొడవుగా, నాలుగు ముక్కలుగా తరగాలి. ముక్కలలో ఆవపిండి మిశ్రమాన్ని కలిపి, నూనె ఆ పిండి తడిసేలా మాత్రమే వేయాలి. ఈ కలిపిన మిశ్రమాన్ని ఒక పొడి జాడీలో లో పెట్టి మూడో రోజున ఒకసారి కలియ తిప్పాలి. నూనె తక్కువ వేసాం కాబట్టి ముక్క నుంచి నీరు వస్తుంది. ఇలా ఏడు రోజులు వుంచి, ఆ తర్వాత జాడీలో ఆవకాయని ఒక పళ్ళెంలోకి వంపాలి. ఇప్పడు పొడవుగా వున్న ముక్కలని పిండి నుంచి వేరు చేయాలి. ముక్కకి ఆవపిండి అంటి వుంటే దానిని కూడా తీసేయాలి. అంటే ముక్కలు పూర్తిగా పొడిగా వుండాలి. ఇప్పడు ఆ ముక్కలని ఒక పళ్ళెంలో విడి, విడిగా పెట్టి ఎండ పెట్టాలి. రెండు వైపుల తిప్పుతూ నాలుగు రోజులు ఎండపెట్టాలి. పిండిని మాత్రం రెండు రోజులు ఎండపెడితే సరిపోతుంది. ఇలా ముక్కలు ఎండాక వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ( మాములు ఆవకాయకి ముక్కలు తరిగినట్టు ). ఆ ముక్కలని ఆవపిండి మిశ్రమంలో వేసి బాగా కలిపి, ముక్కలు, పిండి పూర్తిగా తడిసేలా నూనె పోయాలి. ఎండు ఆవకాయ రెడీ అయినట్టే.

ఇంత కష్టపడ్డాక... ఈ ఆవకాయ రుచి చూసి దానిని మర్చి పోవచ్చు. అన్ని రకాల ఆవకాయలు కొనటానికి దొరుకుతాయి కాని ఈ ఆవకాయ దొరకదు. కాబట్టి కొంచెం కస్టపడి పెట్టేస్తే... మంచి రుచి గల ఆవకాయ తినొచ్చు. పిండి, ముక్క రెండు ఎండలో ఎండటం వల్ల వాటికి మంచి రుచి వస్తుంది.

 

రమ