Top Stories

మాజీ మంత్రి కాకాణికి హైకోర్టు షాక్.. ఇక అరెస్టేనా?

అక్రమ మైనింగ్ కేసులో వరుసగా రెండు సార్లు పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి ఇప్పుడు మరింత చిక్కుల్లో కూరుకుపోయారు. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు మంగళవారం (ఏప్రిల్ 1) కొట్టివేసింది.  ఈ కేసులో అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించజాలమంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఏ క్షణమైనా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసులకు భయపడనంటూ గంభీర ప్రకటనలు చేసిన కాకాణి తీరా పోలీసులు నోటీసులు అందజేయడానికి వస్తే అజ్ణాతంలోకి వెళ్లి పోవడం తెలిసిందే.   వైసీపీ అధికారంలో ఉండగా  ఆయన నెల్లూరు జిల్లాలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను ఆధారం చేసుకుని  పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణిని ఏ4గా పోలీసులు చేర్చారు. వరుసగా రెండు సార్లు పోలీసులు ఇచ్చిన నోటీసులను ఖాతరు చేయకుండా విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి, మంగళవారం (ఏప్రిల్ 1)న తాను బుధవారం తరువాత అంటే గురువారం అందుబాటులో ఉంటాను అంటూ సమాచారం పంపారు.  అదే సమయంలో కాకాణి బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రాగా, పోలీసులు కాకాణి విచారణకు గైర్హాజర్ అయిన విషయాన్నీ అలాగే రెండు రోజులుగా నోటీసులు తీసుకోకుండా కాకాణి తప్పించుకు తిరుగుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  
మాజీ మంత్రి కాకాణికి హైకోర్టు షాక్.. ఇక అరెస్టేనా? Publish Date: Apr 1, 2025 5:30PM

నృత్య రీతుల్లో అత్యంత క్లిష్టమైనది కూచిపూడి!

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎనిమిది క్లాసికల్ నృత్య రీతులలో  కూచిపూడి నృత్యం అత్యంత క్లిష్టమైనది. దీనిలో కాలి వేళ్లనుండి ఆపాదమస్తకం డాన్స్ లో భాగం గా స్పందించి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతటి గొప్ప కళ ప్రపంచంలో మరెక్కడా లేదని ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చలాది  పూర్ణచంద్ర రావు పేర్కొన్నారు . ఉగాది ఉత్సవాల సందర్భంగా మచిలీపట్టణం సమీపంలోని  కూచిపూడి నాట్యకళకు జన్మ స్థలం  కూచిపూడిలో  రెండురోజులపాటు  నాట్యగురు,కేంద్ర సాహిత్య,నాటక అవార్డు గ్రహీత డా. వేదాంతం రాధే శ్యామ్ నేతృత్వం లో  జరుగుతున్న "కూచిపూడి నాట్య శిల్పారామం"  నృత్యోత్సవాలలో  మొదటిరోజు ముఖ్య అతిధిగా  పాల్గొన్న వేదాంతం రాధేశ్యామ్   జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.  పేద మధ్య తరగతి విద్యార్థులు ఈ అపురూపమైన నృత్యం నేర్చుకున్నప్పటికీ పలువురు ప్రదర్శనలు ఇచ్చేందుకు అవసరమైన ఖరీదైన కాస్ట్యూమ్స్,ఇమిటేషన్ ఆభరణాలు కొనలేని స్థితిలో  వున్నారనీ, అటేవంటివవారికి ప్రభుత్వం, దాతలు నృత్య దుస్తులు, ఇమిటేషన్ ఆభరణాలు  సమకూర్చాలని కోరారు.  నాట్య గురు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ బాల కొండలరావు   విశాఖపట్నం లో తానూ స్థాపించిన కూచిపూడి నాట్య అకాడెమి ద్వారా వేలాది మంది నృత్య కళాకారిణులను తీర్చి దిద్దినట్లు ఆమె తెలిపారు.  విశాఖపట్నం, పార్వతీపురం,హైదరాబాద్,లతో పాటు పలు ప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులు, నాట్య గురువు లతో కూచిపూడి లొ ఉగాది నాట్య ఉత్సవం వైభవంగా జరిగింది.  
నృత్య రీతుల్లో అత్యంత క్లిష్టమైనది కూచిపూడి! Publish Date: Apr 1, 2025 5:19PM

ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసు.. డాక్టర్ పద్మావతికి సుప్రీంలో షాక్!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్  రఘురామ కృష్ణంరాజు  కస్టోడియల్ టార్చర్  కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో  గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రి  డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరుకావాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పద్మావతి ఈ నెల  7, 8 తేదీల్లో సీఐడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ విచారణకు హాజరు కాకున్నా, విచారణకు సహకరించకున్నా  మధ్యంతర రక్షణ రద్దు అవుతుందని హెచ్చరించింది.  ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ కేసులో తప్పుడు  మెడికల్ రిపోర్టు ఇచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఏపీ హైకోర్టు ఆమె ముందస్తు బెయిలు పిటిషన్ ను తిరస్కరించడంతో సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు  ఆమెకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ, విచారణకు హాజరై సహకరించాలని సూచించింది.  అయితే ఆమె విచారణకు హాజరుకావడం లేదని, ఆమెకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను మంగళవారం (ఏప్రిల్ 1) విచారించిన సుప్రీంకోర్టు విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకాకపోతే మధ్యంతర రక్షణను తొలగిస్తామని హెచ్చరించింది.  
ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసు.. డాక్టర్ పద్మావతికి సుప్రీంలో షాక్! Publish Date: Apr 1, 2025 4:37PM

నిత్యానంద స్వామి ఇక లేరు? 

తమిళనాడుకు చెందిన వివాదాస్పద స్వామి నిత్యానందస్వామి మరణించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఆయన మేనల్లుడు సుందరేశ్ నుంచే  ఈ ప్రకటన వెలువడింది. సినీ నటి రంజితతో రాసలీలతో  ఆయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. 2022లో కూడా నిత్యానంద స్వామి చనిపోయినట్టు వచ్చిన వార్తలను స్వయంగా ఖండించారు. ప్రస్తుతం వస్తున్న మరణ వార్తలను ఇంతవరకు నిత్యానంద స్వామి ఖండించలేదు. తమిళనాడు అరుణాచలంకు చెందిన నిత్యానంద స్వామి కైలాస పేరిట ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకున్నారు. కైలాస దేశానికి  ప్రత్యేక కరెన్సీ  కూడా ఉంది. ఇండియా నుంచి వెళ్లిపోయిన నిత్యానంద ప్రత్యేక ఐలాండ్ లో కైలాస దేశం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు వేల కోట్లకు అధిపతి అయిన నిత్యానందకు వారసులు ఎవరు అనేది ప్రశ్నార్ణకమైంది. కైలాస దేశానికి నిత్యానంద ప్రధాని పదవిలో ఉన్నట్టు స్వయంగా ప్రకటించుకున్నారు. దక్షిణ అమెరికా ఈక్వెడార్ లో కైలాస దేశం ఉందని చెబుతుంటారు. . 
నిత్యానంద స్వామి ఇక లేరు?  Publish Date: Apr 1, 2025 4:23PM

సంజయ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం పోటీసులు జారీ చేసింది. ఏపీలో  అగ్నిమాపక విభాగంలో డీజీగా పనిచేసిన సమయంలో  అవినీతికి పాల్పడ్డారంటూ సంజయ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.   ఈ కేసులో సంజయ్‌కు ఏపీ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.  ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై  జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం మంగళవారం(ఏప్రిల్ 1) విచారించింది. ఈ సందర్భంగా సంజయ్ బెయిలు రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాి వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ పిటిషన్ పై కూంటర్ దాఖలు చేయాల్సిందిగా సంజయ్ కు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణకు వాయిదా వేసింది.  
 సంజయ్‌కు సుప్రీంకోర్టు  నోటీసులు Publish Date: Apr 1, 2025 4:17PM

విచారణకు మాజీ మంత్రి కాకాణి మళ్లీ డుమ్మా.. ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు విచారణకు మళ్లీ డుమ్మా కొట్టారు.  మైనింగ్ కేసులో ఆయన మంగళవారం (ఏప్రిల్ 1) విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన డుమ్మా కొట్టారు. వాస్తవానికి పోలీసులు ఆయనకు సోమవారం (మార్చి 31) విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన తన నివాసంలో అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకు నోటీసులు అంటించారు. ఆ తరువాత తాను ఉగాది సందర్భంగా హైదరాబాద్ లో తన కుటుంబ సభ్యులతో ఉన్నానంటూ మాజీ మంత్రి కాకాణి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ సారి పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి మంగళవారం (ఏప్రిల్ 1) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. అయితే ఆయన హైదరాబాద్ లోని నివాసంలో కూడా అందుబాటులో లేకపోవడంతో పోలీసులు కాకాణి సమీప బంధువుకు నోటీసులు అందజేశారు. మంగళవారం విచారణకు గైర్హాజరైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఇటు నెల్లూరులో కానీ, అటు హైదరాబాద్ లో కానీ ఆయన అందుబాటులో లేకుండా అజ్ణాతంలోకి వెళ్లిపోయారని అంతా భావిస్తున్నారు. ఇలా ఉండగా అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిలు మంజూరుచేయాలని కోరుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాకాణి బెయిలు పిటిషన్ నేడో రేపో విచారణకు వచ్చే అవకాశం ఉంది.  ఇలా ఉండగా మాజీ మంత్రి కాకాణి తాను గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను బుధవారం (ఏప్రిల్ 2) సాయంత్రం తరువాత నెల్లూరు చేరుకుంటాననీ, గురువారం నుంచీ అందుబాటులో ఉంటాననీ, విచారణకు సహకరిస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. మరో సారి నోటీసులు ఇస్తారా? లేక రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టినందున పరారీలో ఉన్నట్లు పరిగణించి గాలింపు చర్యలు చేపడతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా మరో వైపు కాకాణి గిరిజనులను బెదిరించారంటూ నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది. 
విచారణకు మాజీ మంత్రి కాకాణి మళ్లీ డుమ్మా.. ముందస్తు బెయిలు కోసం హైకోర్టుకు Publish Date: Apr 1, 2025 4:07PM