చంద్రబాబుపై అసంతృప్తి.. మా సంగతేంటి బాబుగారు..

 

రాజకీయాల్లో జంపింగ్ లు కామన్. ఒకప్పుడైతే పార్టీకి కట్టుబడి ఉండి.. పార్టీ మీద ప్రేమతో అధికారంలో ఉన్నా.. లేకపోయినా అదే పార్టీలో ఉండేవారు. కానీ రోజులతో పాటు అలాంటి ప్రేమలు, పద్దతులు కూడా మారిపోయాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవ్వడం.. అప్పటి వరకూ వినడానికి కాస్త ఇబ్బందిగా ఉండే పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసినా.. ఎలాంటి మొహమాటం లేకుండా వేరే పార్టీలోకి వెళ్లడం.. వారితో కలిసిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే...

 

అధికార పార్టీ అయిన టీడీపీలోకి ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలందరూ టీడీపీపై అసంతృప్తితో రగిలి పోతున్నారట.  తమను పార్టీలో చేర్చుకునే ముందు… చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారని, కాని వచ్చాక కూరలో కరివేపాకులా తీసేస్తున్నారని మండిపడుతున్నారట. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణానంతరం ఆయన అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులిచ్చారు చంద్రబాబు. అందులో ప్రధానంగా రెడ్డి వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ముగ్గురికి స్థానం కల్పించారు. మరో నలుగురికి మంత్రి పదవులిచ్చారు.. అయితే  మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రం మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం నామినేటెడ్ పోస్టుల్లో కూడా తమకు ప్రాధాన్యం కల్పించలేదని మండిపడుతున్నారట. దీంతో సైకిల్ పై వెళితే.. తమకు భవిష్యత్ ఉండదని గ్రహించి.. ఫ్యాన్ కిందకు వచ్చేయాలని ఆరాటపడుతున్నారట. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో.. పదిమంది ఎమ్మెల్యేలు జగన్ తో చర్చలు జరిపారట.

 

మరి జగన్ వైఖరి అందరికీ తెలిసిందే. పార్టీలో ఉన్నవాళ్లే జగన్ కు భయపడుతుంటారు. తాను చెప్పిందే వినాలనుకుంటాడు జగన్. అలాంటిది..ఇప్పుడు టీడీపీలోకి జంప్ అయి ఇప్పుడు వస్తా అంటే అంత ఈజీగా ఓకే అంటాడా..? తాము ఏదో అనుకుని పార్టీ మారామని, కానీ, ఇక్కడ తాము అనుకున్నంత లేదని వారు ఆవేదన వ్యక్తం చేసినా... వారి మాటలు విన్న జగన్ మోహన్ రెడ్డి మాత్రం.. వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదట. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చి గెలుపించుకోగలనన్న దీమాతో ఉన్నారట జగన్. పాపం మరి రెంటికి చెడ్డ రేవడిలా.. పాపం అటు టీడీపీలో ఉన్నా ఉపయోగం లేదు.. ఇటు జగన్ కనికరించక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారట. ఆయన ఎప్పుడు ఊ అంటే.. అప్పుడు గోడదూకేందకు సిద్ధంగా ఉన్నారట. మరి చూద్దాం ఏం జరుగుతుందో...