కేసీఆర్ బాటలో జగన్.. టార్గెట్ వందసీట్లు.. వ్యూహం ఫలిస్తుందా?

 

తెలంగాణలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనుసరించాలని చూస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. అంతేకాదు అందరికంటే ముందుగా ఒకేసారి ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీనివల్ల అసంతృప్తి నేతలను బుజ్జగించడానికి ఎక్కువ సమయం దొరికింది. అలాగే మిగతా పార్టీలకంటే ముందుగా ప్రచారం మొదలు పెట్టి ప్రజల్లోకి త్వరగా వెళ్లే అవకాశం దొరికింది. మొత్తానికి కేసీఆర్ వ్యూహం ఫలించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని ఏపీలో అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు.
 
ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఈ సారి ఒకే దఫా వంద సీట్లలో అభ్యర్ధులను ప్రకటించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన కూడా అతి త్వరలోనే ఉండే అవకాశం ఉందని సమాచారం. 'ప్రజా సంకల్ప యాత్ర' పేరుతో జగన్ చేప్పట్టిన పాదయాత్ర ఈ నెల 9 తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగియనుంది. అదేరోజు జగన్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 175 సీట్లు ఉన్న ఏపీలో ఒకేసారి వంద సీట్లలో అభ్యర్ధులను ప్రకటించటం ద్వారా జగన్ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇలా ముందుగా అభ్యర్ధుల ప్రకటన పార్టీకి లాభిస్తుందని.. ప్రచారానికి కావాల్సినంత సమయం ఇచ్చినట్లు అవుతుందనే అభిప్రాయంతో జగన్ ఉన్నారు. మిగిలిన 75 సీట్లకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేయాలని.. పరిస్థితులకు అనుగుణంగా ఈ సీట్లలో నిర్ణయం తెసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే తెలంగాణ ఫార్ములా ఏపీలో పనిచేస్తుందని చెప్పటానికి లేకపోయినా.. అభ్యర్ధి ప్రజల్లోకి వెళ్ళటానికి, తమ ప్రత్యర్ధుల కంటే ముందుగా ప్రచారం చేసుకోవటానికి ఇది పనికొస్తుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సారి వైసీపీలో టిక్కెట్ల కేటాయింపు కూడా పక్కాగా గెలుపు అవకాశాలు ఉన్నవారికే ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏదైనా కారణంగా టిక్కెట్ నిరాకరించాల్సి వస్తే.. అలాంటి నేతలతో జగన్ స్వయంగా మాట్లాడి బుజ్జగింపులు కూడా చేయటానికి ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని తెలుస్తోంది. చూద్దాం మరి జగన్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో.