ఒక్కరోజు గ్యాప్ లో ఇద్దరు సీఎంలు... ఆసక్తిరేపుతోన్న కేసీఆర్, జగన్ ఢిల్లీ టూర్

 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ బాట పట్టారు. కేవలం ఒకే ఒక్క రోజు గ్యాప్ లో కేసీఆర్ అండ్ జగన్ హస్తినకు వెళ్తున్నారు. ఒకట్రెండు ఇష్యూస్ మినహా ఇద్దరి అజెండాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇద్దరూ కూడా ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రులను కలిసి తమతమ రాష్ట్రాల సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అలాగే విభజన సమస్యలు కూడా ప్రస్తావనకు రానున్నాయి.

అయితే, ఎన్నికలకు ముందు మోడీని తిట్టిన తిట్టకుండా ఒంటికాలిపై లేచిన కేసీఆర్... నరేంద్రమోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక తొలిసారి సమావేశంకాబోతున్నారు. మరోవైపు తెలంగాణలో పొలిటికల్ వార్ ... టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారుతోన్న క్రమంలో.... కేసీఆర్... మోడీని కలవబోతుండటం ప్రాధాన్యత కలిగిస్తోంది. అయితే, రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే మోడీతో కేసీఆర్ చర్చించనున్నారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో తక్షణమే గ్రాంట్లను రిలీజ్ చేయాలని కోరనున్నారు. అలాగే, ఆయుష్మాన్-భవ పథకం నిధులను ఆరోగ్యశ్రీకి అనుసంధానం చేయాలని, అదేవిధంగా జలశక్తి కేటాయింపులకు మిషన్ భగీరథకు ఇవ్వాలని విజప్తి చేయనున్నారు. ఇక, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, జోనల్ వ్యవస్థ సవరణ, రిజర్వేషన్ల పెంపు, యురేనియం తవ్వకాల నిలిపివేత, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం... ఇలా పలు డిమాండ్లను ప్రధాని ముందు పెట్టనున్నారు. 

ఇక, ఒక్క రోజు గ్యాప్ తో ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా... రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధాని మోడీని కోరనున్నారు. రెవెన్యూ లోటు, ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో... ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాలంటూ మెమొరాండం ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు. అయితే, అక్టోబర్ 15న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న రైతు భరోసా పథకం ప్రారంభానికి ముఖ్యఅతిథిగా రావాలని మోడీని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అయితే, ఇటీవల ప్రగతి భవన్లో సమావేశమైన కేసీఆర్-జగన్... కేంద్ర ప్రభుత్వ తీరుపైనా, మోడీ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారంటూ పత్రికల్లో కథనాలు రావడం సంచలనం సృష్టించింది. ఇక, ఇఫ్పుడు ఒక్క రోజు గ్యాప్ లో కేసీఆర్, జగన్ లు ఢిల్లీ వెళ్తుండటం... అదే సమయంలో ఇద్దరికీ మోడీ అపాయింట్ మెంట్లు ఇవ్వడం ఆసక్తిరేపుతోంది.