'అయ్యా మాకు బీర్ దొరకట్లేదు' అంటూ కలెక్టర్ కి లేఖ..!!

మందు ఎంత పనైనా చేయిస్తుందని ఊరికే అన్నారా. ఓ మందు బాబు కింగ్ ఫిషర్ బీర్ దొరకట్లేదని ఏకంగా కలెక్టర్ కి లేఖ రాసాడు. ప్రజా సమస్యల పట్ల కలెక్టర్ కి లేఖ రాయడం కామన్.. కాని ఇలా బీర్ కావాలంటూ లేఖ రాయడంతో ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగిత్యాల కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అయిల సూర్యనారాయణ అలియాస్ టీవీ సూర్యం కింగ్ ఫిషర్ బీర్ దొరకట్లేదని ఫిర్యాదు చేస్తూ లేఖ రాసాడు. ఆ లేఖలో ఇలా పేర్కొన్నాడు.

 

 

'శ్రీయుత గౌరవనీయులైన కలెక్టర్ గారికి మనవి చేయునది ఏమనగా.. జగిత్యాల పట్టణంలోని వైన్ షాప్ మరియు బార్ అండ్ రెస్టారెంట్ లలో గత కొన్నేళ్లుగా కింగ్ ఫిషర్ బీర్లను అమ్మడం నిలిపివేశారు. ప్రజలలో, మద్యం ప్రియుల్లో, యువత ఎక్కువగా ఇష్టపడి సేవించే బీర్లలో కింగ్ ఫిషర్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ బీర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ జగిత్యాలలోని మద్యం విక్రయదారులు సిండికేటుగా మారి కింగ్ ఫిషర్ బీరును విక్రయించడం బంద్ చేశారు. ఈ బీర్ల స్థానంలో మరొక నాసిరకం బీరును విక్రయిస్తూ కొనుగోలు దారులను మోసం చేస్తున్నారని మనవి చేస్తున్నాను. భారత రాజ్యంగం లోని ఆర్టికల్-19 ద్వారా సక్రమించిన ప్రాథమిక హక్కులలోని స్వేచ్చతో కూడిన కొనుగోలు హక్కుకు మద్యం విక్రయదారులు భంగం కలిగిస్తున్నారని  తమకు మనవి చేస్తున్నాను. జగిత్యాల పట్టణం మరియు పలు మండలాల్లో ఏ నెల నుంచి కింగ్ ఫిషర్ బీర్లను విక్రయించడం నిలిపేశారన్న అంశంపై విచారణ జరిపించాలని.. మద్యం డిపోల్లో స్థానిక మద్యం వ్యాపారులు కింగ్ ఫిషర్ కోటాను కొనుగోలు చేయకపోవడంపై విచారణ జరిపి మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకొని.. కింగ్ ఫిషర్ బీర్లను మద్యం ప్రియులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నాను’ అని సూర్యనారాయణ లేఖలో పేర్కొన్నారు. కాగా ఆ లేఖను కలెక్టర్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కి పంపించారు.