ఎంపీ విజయసాయి పేరుతొ దందా చేస్తున్న వైసీపీ నేత సస్పెన్షన్ 

ఎంపీ విజయసాయిరెడ్డి పేరు చెప్పి అధికారులను కూడా బెదిరించి భూ వివాదాల సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారనే ఆరోపణపై విశాఖ వైసీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డిని అధిష్ఠానం సస్పెండ్‌ చేసింది. విశాఖపట్నంకు చెందిన ప్రసాద్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ అధికారిక ప్రకటన ఒకటి విడుదల చేసింది. 

 

పార్టీ ముఖ్య నాయకుల పేర్లను దుర్వినియోగం చేయడం ద్వారా అయన భూ లావాదేవీలు సెటిల్ చేసినట్లు సమాచారం. విజయసాయి రెడ్డి, విశాఖ కలెక్టరేట్ పేర్లను ఉపయోగించి అయన అక్రమ కార్యకలాపాలకు పాల్పడడాన్ని పార్టీ క్రమశిక్షణా సంఘం తీవ్రంగా పరిగణించింది. దీంతో కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ అధిష్టానం వెల్లడించింది. అంతేకాకుండా ఇలాంటి అక్రమాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించింది. 

 

దివంగత వైఎస్‌ సీఎంగా వున్న సమయంలో ప్రసాదరెడ్డి రాష్ట్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పనిచేశారు. వైసీపీ ఆవిర్భావం నుండి కొంతకాలం కిందటి వరకూ అయన పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఐతే కొయ్య ప్రసాదరెడ్డి సస్పెన్షన్‌ ఉదంతం విశాఖ వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.