వైసీపీ ఎమ్మెల్యేకు తెల్ల రేషన్ కార్డు.. రేషన్ బియ్యం ఇంటికి

 

తెల్ల రేషన్ కార్డులు పేదవారికి ఇస్తుంటారు. అయితే ఏపీలో ఓ వైసీపీ ఎమ్మెల్యే కుటుంబానికి కూడా తెల్ల రేషన్ కార్డు ఉంది. అలా అని ఆయనేదో పేదవాడు అనుకుంటే.. రేషన్ లో ఇచ్చే కందిపప్పులో కాలేసినట్టే. ఇంతకీ ఆయన ఎవరంటే.. పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పల రాజు. ఎమ్మెల్యే కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండటంతో ఆయన మీద విమర్శలు మొదలయ్యాయి. అయితే తెల్ల రేషన్ కార్డు విషయాన్ని వెలుగులోకి తెచ్చింది ప్రతిపక్షాలు కాదు, స్వయంగా ఆయన ప్రచారం చేసుకొని మరీ విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఏపీలో తాజాగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. గ్రామ వాలంటీర్లు వారి డ్యూటీలో భాగంగా తెల్ల రేషన్ కార్డున్న ఎమ్మెల్యే కుటుంబానికి బియ్యంతో పాటు సరుకుల్ని అందించారు. ఇంకేముంది ఎమ్మెల్యే గారు ఇటు గ్రామ వాలంటీర్ వ్యవస్థ పనితీరు గురించి, అటు రేషన్ సరుకుల నాణ్యత గురించి చెప్పాలి అనుకున్నారో ఏమో కానీ.. రేషన్ బియ్యం, సరుకులు తీసుకున్న ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడీ పోస్టు వైరల్ అవుతోంది. ఇంకేముంది ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి తెల్ల రేషన్ కార్డు ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తాయి.పేదలకు అందాల్సిన సరుకులు ఈ విధంగా దుర్వినియోగం అవుతున్నాయని నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.

దీంతో తనపై వస్తున్న విమర్శలకు స్పందించిన ఎమ్మెల్యే అప్పలరాజు.. వివరణ ఇచ్చారు. తనకు తెల్ల రేషన్ కార్డు ఉందన్న విషయం తెలియదన్నారు. తన కుటుంబసభ్యులకు కూడా ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేదన్నారు. గ్రామవాలంటీర్ల వ్యవస్థ వలనే ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుందని కొనియాడారు. తాను తెల్ల రేషన్ కార్డుదారుడైతే.. ఇప్పటివరకు ప్రతీ నెల తన రేషన్ ఏమైందని ప్రశ్నించారు. నెల నెల రేషన్ అందనప్పుడు దానిని తెల్ల రేషన్ కార్డును ఎందుకు రద్దుచేయలేదని ప్రశ్నించారు. పాస్‌పోర్టు కోసం 2009లో రేషన్ కార్డు అవసరం వచ్చింది. ఈ క్రమంలో గులాబీ రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేశాను. 2010-11లో తెల్లకార్డు ఇచ్చారని ఎమ్మెల్యే తన పోస్టులో వివరణ ఇచ్చారు. తనకు కార్డు వచ్చిన తరువాత రెండు ప్రభుత్వాలు మారిపోయాయని, తన కార్డును క్యాన్సిల్ చేయాలని పలాస ఎమ్మార్వోకు చెప్పానని ఎమ్మెల్యే అన్నారు.