ప్రకాశం జిల్లాలో క్వారీలు ఉన్న టీడీపీ లీడర్స్ కు వైసిపి ప్రభుత్వం షాక్...


 

ప్రకాశం జిల్లాలో టీడీపీ లీడర్స్ కు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. దేశం నేతలకు చెందిన గ్రానైట్ క్వారీలకు భారీ జరిమానాలు విధించింది. వీరిలో బిజెపి రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ మండలాల్లో గ్రానైట్ తవ్వకాలు అధికంగా జరుగుతాయి. పలువురు టిడిపి నేతలకు ఇక్కడ క్వారీలున్నాయి, అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ అధికారుల దాడులు ముమ్మరం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండునెలలుపాటు గ్రానైట్ క్వారీల్లో తనిఖీ చేశారు. కడప, అనంతపురం నుంచి ప్రత్యేకంగా సర్వేయర్ లను తీసుకువచ్చి క్వారీలో జరిగిన తవ్వకాలపై కొలతలు వేశారు. పలు అక్రమాలు జరిగినట్లు అధికారుల దాడుల్లో తేలింది. దీంతో వారికి భారీగా జరిమానా విధించారు అధికారులు, బల్లికురవలో బిజెపి రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు కుటుంబ సభ్యులకు చెందిన గ్రానైట్ క్వారీలో అధికారులు సోదాలు జరిగాయి.

క్వారీలో అక్రమాలు జరిగాయంటూ 285 కోట్ల 32 లక్షల రూపాయల భారీ జరిమాన విధించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ క్వారీలపైన 250 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించారు అధికారులు. మాజీ మంత్రి టీడీపీ నేత శిద్దా రాఘవరావు ఆయన కుటుంబ సభ్యుల గ్రానైట్ క్వారీలపై త్వరలో భారీ మొత్తంలో జరిమానాలు విధించేందుకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి విడతలో మొత్తం 56 గ్రానైట్ కంపెనీలకు 1914 కోట్ల రూపాయల జరిమానా విధించారు. ప్రభుత్వం తమను ఉద్దేశ్యపూర్వకంగా టార్గెట్ చేసిందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. క్వారీల్లో తవ్వకాల విషయంలో అన్ని నిబంధనలు పాటిస్తున్నప్పటికీ జరిమానాల రూపంలో వేధిస్తున్నారని తప్పుబట్టారు. కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల క్వారీలపైనే భారీ మొత్తంలో జరిమానాలు విధించటంతో ఆ పార్టీ నేతల్లో కలవరం మొదలయ్యింది. వందల కోట్ల రూపాయల జరిమానాలు విధించటంతో ఆ నేతలు హడలెత్తిపోతున్నారు. మరోవైపు అక్రమాలకు పాల్పడ్డారంటూ మైనింగ్ శాఖ కూడా నోటీసులు జారీ చేసింది. పదిహేను రోజుల్లో సమాధానం చెప్పాలంటూ వివరణ కోరింది.