పోలవరానికి బ్రేకులు.. సర్దుకుంటున్న కాంట్రాక్టు సంస్థలు!!

 

పోలవరం ప్రాజెక్ట్ అసలు ఇప్పట్లో పూర్తవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పోలవరం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. వందల మంది కార్మికులు, భారీ యంత్రాలతో హడావుడిగా కనిపించే పోలవరం ప్రాంతంలో ఇప్పుడు స్తబ్దత నెలకొంది. ఇప్పటికే ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వరద సీజన్‌ కాబట్టి డయాఫ్రంవాల్‌, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు కూడా నిలిచిపోయాయి. స్పిల్‌వే వద్ద కాంక్రీటు పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. రాబోయే రెండు మూడు నెలలు వరదల ప్రభావం ఉంటుంది. మరోపక్క వర్షాలు కూడా వస్తాయి. ఇలా కొంతకాలం ఈ పనులు పుంజుకునే అవకాశం లేదు.

ఇటీవల ఈ ప్రాజెక్టు నిర్మాణ అంచనాను రూ.55వేల కోట్లకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కానీ కేంద్ర బడ్జెట్‌లో నిధులు ఏమీ కేటాయించలేదు. ఇప్పటికే కేంద్రం నుంచి రూ.వేల కోట్లు రావలసి ఉంది. ఈ నేపథ్యంలో పోలవరం పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రూ.కోట్లాది బిల్లులు పెండింగ్‌ పడడంతో కాంట్రాక్టు సంస్థలు మెల్లగా సర్దుకుంటున్నాయి.

ఇంతకాలం మట్టి పనులు చేసిన త్రివేణీ సంస్థ ఇప్పటికే ప్రాజెక్టు పని నుంచి తప్పుకుంది. తన కంటైనర్లతోపాటు ఇతర ఎక్విప్‌మెంట్‌ను కూడా తరలించుకుని పోతోంది. ఈ సంస్థకు సుమారు రూ.70 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌ ఉన్నాయట. దీనికంటే ముందు ఎల్‌అండ్‌టీ సంస్థ కాఫర్‌ డ్యామ్‌ బెడ్‌ పనులు చేసి వెళ్లిపోయింది. ఆ సంస్థకు కూడా రూ.కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం నవయుగ, మరో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ మాత్రమే ఉన్నాయి. వీటికి కూడా రూ.వందల కోట్ల బిల్లు బకాయిలు ఉన్నట్టు తెలుస్తోంది.

పోలవరం ఎగువ కాఫర్‌డ్యామ్‌ పనులు గత నెలలోనే ఆగిపోయాయి. పోలవరం ప్రాజెక్టు అథార్టీ ఆదేశాల మేరకు ఈ పనులు ఆపేశారు. ఉభయగోదావరి జిల్లాల్లోని పోలవరం, దేవీపట్నం మండలాల మధ్య గోదావరిలో నిర్మించనున్న ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం, దానికి ఎగువ, దిగువ భాగాలలో కాఫర్‌ డ్యామ్‌లు నిర్మాణం చేపట్టారు. 2.47 కిలోమీటర్ల పొడవు లక్ష్యంగా పెట్టుకుని రెండు కరకట్టల మధ్య దీని నిర్మాణం చేపట్టారు. అందులో గత నెల వరకూ 1.7 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఇంతలో ఈ పనులు ఆపేయమని పీపీఏ ఆదేశించడంతో పనులు ఆగిపోయాయి. దీనిని తర్వాత పూర్తి చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ ప్రస్తుతం వరదల వల్ల ఇంతవరకూ నిర్మించిన కాఫర్‌డ్యామ్‌ దెబ్బతినకుండా పీపీఏ ఓ డిజైన్‌ ఇచ్చింది. దాని ప్రకారం రక్షణ చర్యలు చేపట్టారు. మరో వారం రోజుల్లో ఇవి పూర్తి కావచ్చని చెబుతున్నారు.

మరోవైపు దేవీపట్నం మండలంలో 34 గ్రామాలకు వరద ముప్పు ఉందని, ప్రజలు ఆ గ్రామాలను ఖాళీ చేయాలని చెబుతున్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లాలో పునరావాస కాలనీలు ఇంకా పూర్తి కాకపోవడంతో అధికారులు ఏ నిర్ణయం తీసుకోవాలని తటపటాయిస్తున్నారు. కొందరు ప్రజలు స్వచ్ఛందంగానే తరలివెళ్లిపోతున్నారు. ఎందుకంటే సాధారణంగా ప్రతీ ఏటా వరదల వల్ల దేవీపట్నం మండలంలో చాలా గ్రామాలు మునిగిపోతుంటాయి. పడవ ప్రయాణమే శరణ్యం. కానీ ఈసారి గోదావరిలో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించారు. ఇక్కడ గోదావరి వెడల్పు 2.45 కిలోమీటర్లు. గతంలో ఇంత వెడల్పున గోదావరి వరద నీరు కిందకు ప్రవహించేది. కానీ ఇప్పటికే 1.7 కిలోమీటర్ల కాఫర్‌ డ్యామ్‌ను గోదావరికి అడ్డంగా కట్టారు. సుమారు 25మీటర్ల ఎత్తులో ఉంది. దీనికి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల వైపు నదిలో కొంత భాగం వదిలేశారు. ప్రస్తుతం వరద నీరు కాఫర్‌ డ్యామ్‌ కట్టగా, మిగిలిన నదీ భాగం నుంచే కిందకు లాగవలసి ఉంది. ప్రస్తుతం పోలవరం వైపు పైపుతో నిర్మించిన వంతెన ద్వారా నదిని మళ్లించారు. కానీ గోదావరి వరద ఉధృతమైతే ప్రాజెక్టు వద్ద తక్కువ భాగంలో నుంచి మొత్తం నీరు లాగదు. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతం అంటే పాపికొండల వైపు వరదనీరు ఎగదన్నే అవకాశం ఉంది. ఆయా గ్రామాలలో ఎక్కువ నీరు నిల్వ ఉండి, గ్రామాలలో జనం ఉండే పరిస్థితి ఉండకపోవచ్చని ప్రజల ఆందోళన చెందుతున్నారు.