మంత్రాలకు చింతకాయల్లాగే… పంచులకు ఓట్లు రాలవు!

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావచ్చా? ఖచ్చితంగా రావచ్చు! కాకపోతే , సినిమాల్లో వున్నప్పుడు వాళ్లు అటెండ్ అయ్యే ఆడియో రిలీజ్ వేడుకలు వేరు… రాజకీయ బహిరంగ సభలు వేరు! ఈ తేడా అర్థం చేసుకుని కాస్త పరిణతితో మాట్లాడాలి. సినిమాల్లో వున్నప్పుడు సినిమా హీరోలు వేదిక మీద నుంచీ ఏం మాట్లాడినా ఈలలు వేస్తారు. కాకపోతే వాళ్లెవరూ ఓటర్లు కారు. ఫ్యాన్స్! అభిమానులకి హీరో తుమ్మినా, దగ్గినా నచ్చుతుంది. ఇక పంచ్ డైలాగ్ లు చెబితే వార్ని ఆపగలమా? అదే ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ వేడుకల్లో హుషారుకి కారణం!

రాజకీయ బహిరంగ సభలు, పాదయాత్రల్లో సినిమా హీరోలు ఆచితూచి మాట్లాడాలి. లేదంటే అప్పటికప్పుడు ఈలలు రావచ్చు కానీ… తరువాత మాత్రం గోలలే మిగులుతాయి. ఈ సత్యం గతంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు తెలుసుకోలేదు. తాజాగా జనసేనాని పవన్ కూడా గ్రహించటం లేదు!

 

 

పవన్ పబ్లిక్ లో మాట్లాడితే ఎలా వుంటుందో ప్రజారాజ్యం కాలంలోనే తెలిసిపోయింది. అప్పట్లో కాంగ్రెస్ నేతల పంచెలూడగొట్టాలంటూ పంచ్ డైలాగ్ లు వేశాడు. తరువాత ఆ మధ్య కేసీఆర్ తాట తీస్తానన్నాడు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయి పొలిటీషన్ అవతారం ఎత్తాక మరిన్ని బాంబులు పేలుస్తున్నాడు ఈ ఆరు అడుగుల బుల్లెట్! కానీ, వాటి వల్ల ఎంత వరకూ ఓట్లు రాలుతాయి? ఇదీ జనసేనాని వేసుకోవాల్సిన ప్రశ్న! బహుశా ఆయన జాతీయ స్థాయిలో రాహుల్, రాష్ట్ర స్థాయిలో జగన్ని ఆరద్శంగా తీసుకుంటున్నారేమో! అందుకే, ఎవరి మీదంటే వారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తుంటారు. అదీ తన ఇష్టానుసారమైన భాషలో! వాటికి ఎలాంటి ఆధారాలు కూడా వుండవు. అందుకే, చివరకు టీడీపీ నేత ఒకాయన విసిగిపోయి పవన్ అంటే గాలి అని… ఆయనవన్నీ గాలి మాటలనీ తేల్చేశారు! ఇదే ఫీలింగ్ ఓటర్లకు కలిగితే… ఇప్పుడు వినిపించే విజిల్సే మిగులుతాయి తప్ప విజయాలు కాదు!

 

 

చంద్రబాబును, లోకేష్ ను తిడుతూ జగన్ తో బాటూ ప్రతీ రోజూ రోడ్డు మీదే వుంటోన్న పవన్ ఎప్పటికప్పుడు అసందర్భపు విమర్శలు చేస్తూనే వున్నారు. జనసేన అధ్యక్షుడిగా ఆయన సీఎంను, మినిస్టర్ అయిన లోకేష్ ను విమర్శించవచ్చు. కానీ, దానికి ఓ పద్ధతంటూ వుంటుంది కదా? అదేం లేకుండా తనకు ఆ రోజు ఏది గుర్తుకు వస్తే అది ప్రయోగిస్తుంటాడు పవన్! తాజాగా వున్నట్టుండీ… లోకేష్ కు హితబోధ చేశాడు. ఆయన కెనడీ, అబ్రహం లింకన్, గాంధీ జీ వంటి వార్ని ఆదర్శంగా తీసుకోవాలట! చంద్రబాబును కాదట. చంద్రబాబు వెన్నుపోటుదారుడని పరమ రోటీన్ గా ఓ విమర్శ విసిరేశాడు. అసలు లోకేష్ చేసిన తప్పేంటి? చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆయన ఏపీ ప్రజలకు చేసిన హాని ఏంటి? పవన్ వద్ద దేనికీ సరైన సమాధానం వుండదు. లోకేష్ అవినీతి అంటూ ఊగిపోతుంటాడు. అది నిజమే అయితే ఒక్కటంటే ఒక్క కేసులోనైనా కోర్టుకి వెళ్లొచ్చు కదా? పోనీ మీడియా ముందు నీ దగ్గరున్న ఆధారాలు పెట్టొచ్చు కదా? లోకేష్ అవినీతి చేశాడని చెప్పటమే తప్ప ఏనాడూ దానికి ఆధారం చూపిన పాపాన పోవటం లేదు మన గబ్బర్ సింగ్! ఇలా చేస్తే రేపు ఓటు వేయటానికి బయలుదేరిన జనం ఎలా నమ్ముతారు?

 

 

గతంలో ఓ సారి కాకినాడలో సభ పెట్టిన పవన్ తెలంగాణ చరిత్ర మొత్తం చెప్పాడు! కాకినాడ జనానికి తెలంగాణ చరిత్రకి ఏంటి సంబంధం? ఇప్పటికే అలాగే మాట్లాడుతుంటాడు! జగన్ తన మూడు పెళ్లిల్ల గురించి ఓ సారి మాట్లాడాడు. తరువాత ఆయన సైలెంట్ అయిపోయాడు. పవన్ మాత్రం మళ్లీ మళ్లీ దాన్ని గుర్తు చేసుకుని స్పందిస్తున్నాడు. తనతో వుండటం కష్టమని తానే చెప్పుకున్నాడు. అందుకే, తనని వదిలేసి వెళ్లిపోయారనీ, మూడు పెళ్లిల్లు చేసుకోవటం తన ఖర్మ అని అంటున్నాడు. ఆయన వ్యక్తిగత జీవితం ఆయన ఇష్టం. ఆయన పెళ్లిల్లపై ఎవరూ కామెంట్ చేయక్కర్లేదు. కానీ, అదే సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు పవనే స్వయంగా తన ట్రిపుల్ మ్యారేజ్ వ్యవహారం డిస్కస్ చేస్తుంటే … అది చివరకు హాస్యంగా మారిపోతుంది! అసలు ఒక పార్టీకి అధినేతగా వుండి ఎలా మాట్లాడాలో పవర్ స్టార్ ఎవరి వద్దైనా ట్యూషన్ పెట్టించుకుంటే మంచిది! జనాన్ని ఆకర్షించే ప్రయత్నంలో వున్నప్పుడు పీఆర్ చాలా ముఖ్యం. మోదీ లాంటి వారే తగిన శిక్షణ, జాగ్రత్తలు తీసుకుంటారంటారు. పవన్ కూడా ఆ పని చేయాలి! లేదంటే పసలేని ఆరోపణలు చేసిన ఈ యాత్రలు, బహిరంగ సభలన్నీ … ఫ్లాప్ సినిమాకు ముందు అట్టహాసంగా జరిగే ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకల్లా యూట్యూబ్ లో మిగిలిపోతాయి!