బయటకొచ్చిన చిన్నమ్మ

అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళా నటరాజన్ జైలు నుంచి బయటకొచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్షను విధించింది సుప్రీంకోర్టు. దీనిలో భాగంగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఆవిడ భర్త నటరాజన్ ఆరోగ్యం క్షీణించి ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

 

ఈ విషయం తెలుసుకున్న శశికళ తన భర్తను చూసుకునేందుకు పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తొలుత కర్ణాటక జైళ్ల శాఖను కోరగా..వారు నిరాకరించారు. దీంతో ఆమె కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల స్పందనను కోరింది. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం శశికళకు షరతులతో కూడిన ఐదు రోజుల పెరోల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ ఐదు రోజుల పెరోల్‌‌ను వ్యక్తిగత అవసరాల కోసమే వినియోగించుకోవాలని.. రాజకీయ కార్యక్రమాలకు హాజరు కావొద్దని ఆదేశించింది. దీంతో ఆమె జైలు నుంచి బయటకు రానున్నారు. ఈ నేపథ్యంలో శశికళ మద్ధతుదారులు సంబరాల్లో మునిగిపోయారు.. ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.