వెంకయ్య ఐక్యతారాగం!

 

 

 

అచ్చ తెలుగువాడు.. పదహారణాల ఆంధ్రుడు, బీజేపీ కేంద్ర నాయకుడు వెంకయ్య నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినట్టు అనిపిస్తోంది. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్న ఆయన రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు మొత్తాన్నీ కిషన్ రెడ్డి చేతుల్లోనే ఉంచారు. అయితే పేనుకు పెత్తనం ఇచ్చినట్టుగా కిషన్ రెడ్డి తెలంగాణకి ఏకపక్షంగా మద్దతు ప్రకటించి మొత్తం రాష్ట్రంలోనే బీజేపీ దుకాణం సర్దేసే పరిస్థితి తెచ్చారు.


కిషన్ రెడ్డిని ఇంకా అలాగే వదిలేస్తే పద్ధతిగా వుండదని అర్థం చేసుకున్న వెంకయ్య నాయుడు రంగంలోకి దిగారు. కిషన్ రెడ్డి చేసిన డ్యామేజీని సరిదిద్దే ప్రయత్నంలో వున్నారు. సీమాంధ్రులు ప్రస్తుతం బీజేపీని శత్రువుగా భావిస్తున్నారు. మొదట ఆ అభిప్రాయాన్ని తొలగించే పనిలో వెంకయ్య వున్నారు. కిషన్ రెడ్డి నోటి పవర్ని కాస్త తగ్గించమని ఇప్పటికే ఆదేశాలు అందటంతో ఆయన అంతకుముందులా దూకుడుగా కాకుండా కాస్తంత ఆచి తూచి మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన తనకు ఇష్టం లేకపోయినా పార్టీ ఆదేశాలకు తలవంచి ఇంతకాలం మౌనంగా వున్న వెంకయ్య నాయుడు ఇప్పుడు సమైక్యతా రాగం ఆలపిస్తున్నారు.



నిన్నగాక మొన్న హైదరాబాద్‌లో ‘ఐక్యతా చిహ్నం’ పేరుతో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో వెంకయ్య మాట్లాడారు. సర్దార్ పటేల్ దేశం ఐక్యంగా వుండాలని ఎంతో కోరుకున్నారని, ఆయన ఎన్నో సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారని చెబుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కుల, మత, ప్రాంతాల పేరుతో ప్రజల్ని విభజించే పనిలో వుందని విమర్శించారు. బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమే గానీ, ఇష్టమొచ్చినట్టు  రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలను విభజించడానికి మాత్రం వ్యతిరేకమని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం మాత్రమే కాకుండా తెలుగు ప్రజలను కూడా విభజిస్తోందని ఆయన కుండ బద్దలు కొట్టారు. రాష్ట్రాన్ని విభజిస్తే తమ మద్దతు వుంటుందిగానీ, ప్రజల్ని విభజిస్తామంటే తమ మద్దతు వుండబోదని స్పష్టంగా చెప్పారు. ఐక్యత అనేది ఎంతో బలమైనదని ఆయన సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. వెంకయ్య నాయుడు ఐక్యతా ఉపన్యాసం విన్నవారికి, చదివినవారికి రాష్ట్రం ఐక్యంగా వుంటుందన్న ఆశలు చిగురిస్తున్నాయి.