కింగ్ ఆఫ్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌ ..!

ప్రపంచ క్రీడా చరిత్రలో తమ తమ రంగాల్లో తిరుగులేని ప్రతిభా పాటవాలను చూపించినవారు, రికార్డులను నెలకొల్పినవారు ఎంతో మంది ఉన్నారు. కానీ, సదరు క్రీడ వల్ల వ్యక్తికి కాకుండా, ఆ వ్యక్తివల్లే ఆ ఆటకు గుర్తింపు రావడం అరుదు. బాక్సింగ్‌లో మహ్మద్ అలీ, క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్‌లో మారడోనా ఇలా ఎంతో మంది క్రీడాకారులు ప్రపంచం చేత జేజేలు పలికించుకున్నారు. అలాంటి వారి జాబితాలో ఉసేన్ బోల్ట్ కూడా ఒకరు. 100. మీ పరుగుపందెంలో దశాబ్ధకాలం పాటు స్ప్రింట్‌కింగ్‌గా ప్రపంచాన్ని ఏలాడు ఉసేన్. ప్రాణ ప్రదమైన కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాలని ప్రతీ ఒక్క ఆటగాడికి ఉంటుంది. అయితే అలా జరగడం కొందరికి మాత్రమే చెల్లింది.

 

ప్రాణంగా ప్రేమించిన కెరీర్‌ను వీడుతున్నానే బాధో అభిమానులను ఇక అలరించలేను అనుకున్నాడో కానీ తన ఆఖరి పరుగు పందెంలో ఈ జమైకా చిరుత అడుగు తడబడింది. స్వర్ణంతో గ్రాండ్‌గా కెరీర్‌కు బై..బై చెబుదామనుకున్న బోల్ట్‌ ఆశ నెరవేరలేదు. ఐఏఏఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా ఈ ఆదివారం జరిగిన 100 మీ ఫైనల్లో బోల్ట్‌కు షాకిచ్చాడు ఆయన చిరకాల ప్రత్యర్థి గాట్లిన్. ఈ వార్త యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే ఉసేన్ రేస్‌లో ఉన్నాడంటే...ప్రత్యర్థులతో పాటు అభిమానులు కూడా సెకండ్ ప్లేస్‌ ఎవరిదా అని బెట్టింగులు వేసుకునేవారు. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ ఎలాగూ బోల్ట్‌దేనని ఫిక్స్‌ గనుక.‌

 

అటువంటి ఆటగాడి చివరి పరుగు కోసం ప్రపంచం మొత్తం ఊపిరిబిగబట్టి ఎదురుచూసిన వేళ..స్వర్ణం పక్కా అనుకుంటే..కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గాట్లిన్ 9.92 సెకన్లలో గమ్యానికి చేరగా, అమెరికాకు చెందిన క్రిస్టియన్ కోల్‌మన్ 9.94 సెకన్ల టైమింగ్‌తో రజతాన్ని సాధించగా..బోల్ట్ 9.96 టైమింగ్‌తో కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. క్రీడల్లో ఎంతటి వారైనా పరాజయం పాలుకాక తప్పదు కానీ రెండుసార్లు డోపీగా పట్టుబడిన గాట్లిన్ చేతిలో బోల్ట్ ఓడిపోవడం అతని అభిమానులను జీర్ణించుకోలేకుండా చేస్తోంది.

 

ఆ అక్కసుతో వారు స్టేడియంలో గాట్లిన్‌ను హేళన చేశారు. అవేవి నేను పట్టించుకోనని బోల్ట్‌ను ఓడించడానికి అతడినే స్పూర్తిగా తీసుకున్నానని..ట్రాక్‌పై ఉన్నంత సేపే ఉసేన్‌ తనకు ప్రత్యర్థని..బయట మాత్రం తాము మంచి మిత్రులమని చెప్పి విజయం సాధించిన అనంతరం బోల్ట్ ముందు మోకరిల్లాడు గాట్లిన్. వెళ్లిపోతూ..వెళ్లిపోతూ నన్ను క్షమించండి, విజయంతో కెరీర్‌ను ముగించలేకపోయాను..కానీ మీ అభిమానానికి మాత్రం కృతజ్ఞతలని చెబుతూ తనదైన డ్యాన్స్‌ చేసి వాళ్లని హుషారెత్తించాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం..ఫైనల్లో బోల్ట్ ఓడిపోయి ఉండవచ్చు..అతని అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉండవచ్చు. కానీ ట్రాంక్ అండ్ ఫీల్డ్‌లో అతడిదో శకం. తన సృష్టించిన రికార్డుల ద్వారా ఎవరూ అందుకోలేనంత ఎత్తుకెదిగాడు బోల్ట్.