ఉత్తరాంధ్రను వణికిస్తున్నతిత్లీ

 

బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడుతోంది. వజ్రపుకొత్తూరు మండలంలో తుపాను తీరం దాటిన సమయంలో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి.తుపాను తీరాన్ని దాటినప్పటికీ వజ్రపుకొత్తూరు, సోంపేట, తదితర మండలాల్లో గాలులు, వర్షభీభత్సం కొనసాగుతోంది. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో పాటు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.పెను తుపాను తీరం దాటిన సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఒడిశాలోని గజపతి, గంజాం, ఖుర్దా, నయాగడ్ పూరి జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు.తుఫాను ప్రభావం ఉద్దానం ప్రాంతంపై ఎక్కువగా కనిపిస్తోంది.భారీ ఎత్తున జీడిచెట్లు, కొబ్బరిచెట్లు నేలకూలాయి.పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో 10వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.సంతబొమ్మాళి మండలం మరువాడలో సముద్ర తీరంలో అలల ఉద్ధృతికి పది అడుగుల మేర కోతకు గురైంది.వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనయ నదులకు వరద తాకిడి పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో అధికారులు తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

తుపాను ప్రభావంపై ఆర్టీజీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో మాట్లాడిన సీఎం చంద్రబాబు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. భోజనం, పులిహోర, తాగునీటి పాకెట్లు పంపిణీ చేయాలని, సహాయ పునరావాస చర్యల్లో అందరూ పాల్గొనాలని సీఎం సూచించారు.15వ ఆర్థిక సంఘం సమావేశం అనంతరం సీఎం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.రాత్రికి అక్కడే బస చేసి పునరావాస చర్యలపై సమీక్షించనున్నారు.